Sunday, April 12, 2026

వెల్లువయే ఆవేశాలను 
అలలపై   తీరానికి పంపి 
అంతలో వెనక్కు లాగే 
ఆంతర్యం సముద్రానిది..

బడబానలం  ఎదలో దాచి 
బహు సంతోషం పైకి తెలిసేలా 
తుళ్లిపడే సంతోషాన్ని 
కెరటాలతో చూపిస్తుంది

ఆణువంత కూడా వంగని 
ఆకాశం స్నేహం కోసం 
అలుపెరుగని యత్నంగా 
ఎగసి ఎగసి పడుతుంది

ఉప్పుతనం  తానే ఉంచుకుని 
తియ్యని నీటిని మబ్బులకిచ్చి 
అవని  అవసరం తీర్చమని 
నెనరులు కోరుతుంది

వినువీధిని విహరించి 
పడమరలో పయనం ఆపే 
ఇన బింబపు అలసట తీర్చి 
తనలో దాచేసుకుంటుంది

తూరుపు ఎరుపు అవగానే 
తనలో దాచిన  తపనుని 
తళ తళ మను వెలుగుపువ్వులా 
ధరణికి కానుకలా పంపే  జలధికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment