Sunday, May 24, 2026

 యోగ వాసిష్ఠ హృదయము-1

ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటిలోకి రెండు గ్రంథాలు విశిష్టమైనవి. ఒకటి- నరుడు తన తత్త్వవిద్యను నారాయణుడికి నివేదించుకొన్న గ్రంథం "యోగవాశిష్ఠము.” రెండవది- నారాయణుడు నరుడికి తత్త్వవిద్యను ఉపదేశించిన గ్రంథం "భగవద్గీత” వీటిలో శాస్త్రవాదాలు వుండవు. విషయ వివరణ వుంటుంది. వీటిలో విశ్రాంతిగా రోజుల తరబడి చేసిన బోధ- యోగవాశిష్ఠము. అందుకే ఇది 32వేల శ్లోకాల గ్రంథం. యుద్ధ సమయంలో హడావిడిగా చేసిన బోధ భగవద్గీత. దానికి తగ్గట్టే అది సంగ్రహంగా వుంటుంది.

ఈ గ్రంథానికి యోగవాశిష్ఠమనీ, జ్ఞానవాశిష్ఠమనీ, ఉత్తర రామాయణమనీ, మహారామాయణమనీ, వాశిష్ఠరామాయణమనీ, పేర్లు ఉన్నాయి. సాంప్రదాయిక విద్వాంసుల అభిప్రాయం ప్రకారం, ఈ గ్రంథాన్ని రచించినవారు వాల్మీకిమహర్షి. కొందరు ఆధునిక విమర్శకులు ఇది భగవద్గీత తరువాత వెలసిన గ్రంథమని ప్రతిపాదన చేస్తున్నారు. కానీ, వారు చూపే కారణాలు అంత బలంగా కనిపించడం లేదు. భగవద్గీత సంగ్రహంగా చేసిన ఉపదేశం అవటంవల్ల, ఆ ఉపదేశాలు కొన్ని చోట్ల విస్పష్టంగా లేక, వేరు వేరు విధాలుగా వ్యాఖానాలు చేసేందుకు అవకాశం వుంది. ఈ యోగవాశిష్ఠంలో వాల్మీకిమహర్షి అలాంటి అవకాశం ఏ మాత్రం మిగల్చ లేదు. ప్రతి విషయాన్నీ విస్పష్టంగా, వివరంగా చర్చించడం మాత్రమే కాక, సిద్ధాంత విషయాలను అందమైన కథల రూపంలో ఆ మహాకవి మనకు అందించారు. అందువల్ల ఎక్కడా సందేహాలకు తావుండదు. భగవద్గీతానంతర కాలంలో వేదాంత శాస్త్రమంతా పారిభాషిక పదాలతో కట్టుదిట్టం చేయబడివుంది. ఆ గ్రంథాల్లో, అధ్యాస, ఉపాధి, సవిశేషము, నిర్విశేషము, బాధ, అనిర్వచనీయము, మొదలైన పారిభాషిక పదాలు మనకు విస్తారంగా కనిపిస్తూ వుంటాయి.

ఈ యోగవాశిష్ఠంలో అటువంటి పారిభాషిక పదాల ఆడంబరం ఏమాత్రమూ వుండదు. ఈ గ్రంథంలో స్పందన, స్ఫురణ, వాసన, ఉల్లాసము, లీల, వివర్తము, ఆభాసము, మొదలైన పదాలను ప్రకరణ శుద్ధితో వినియోగించడం కనిపిస్తుంది. ఇవన్నీ సనాతనంగా ఉపనిషత్తులలో కనిపించే పదాలే.

ఈ పదాలను బట్టీ, ఈ గ్రంథంలో చేసిన విషయ ప్రతిపాదనబట్టీ కూడా, ఇది సాక్షాత్తూ వాల్మీకి మహర్షియొక్క రచనే అని మనం నిర్ణయం చేయవచ్చు.

1. *గ్రంథావిర్భావము*

ఇక, ఈ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి ఎప్పుడు వ్రాశాడో, ఎందుకు వ్రాశాడో, పరిశీలిద్దాం. శ్రీమద్రామాయణంలోనూ, ఈ వాశిష్ఠంలోనూ, వున్న సాక్ష్యాధారాలను పరిశీలిస్తే, మనకు ఈ విషయాలు స్పష్టమవుతాయి.

శ్రీరాముడు రాజ్యాధికారంలో వున్న సమయంలో జగద్గురువైన నారద మహర్షి వాల్మీకి మహర్షికి రామకథా సారం బోధించాడు. అప్పుడే బ్రహ్మదేవుడు వాల్మీకిమహర్షిని రామాయణం రచించమని ప్రోత్సహించాడు. లవకుశులు జన్మించేనాటికి వాల్మీకిమహర్షి రామాయణ రచన చేస్తూనే వున్నాడు. ఆయన మొదట బాలకాండ మొదలు యుద్ధకాండ వరకూ ఆరు కాండలు వ్రాసి, గ్రంథం పూర్తి చేద్దామని అనుకొన్నాడు. దానికి తగ్గట్టే యుద్ధకాండ చివర ఫలశ్రుతి కూడా చెప్పేశాడు. కానీ, కుశలవుల జన్మ తరువాత ఆ మహాకవి మనస్సు మార్చుకొని, ఉత్తరకాండ కూడా రచించాడు. తరువాత ఆయన ఈ రామాయణ గ్రంథాన్ని లవకుశులకు, తన ముఖ్య శిష్యుడైన భరద్వాజుడు మొదలనవారికి ఉపదేశించాడు.

ఈ రామాయణ రచన చేసేటప్పుడు వాల్మీకి మహర్షికి బాలకాండంలోనే ఒక చిక్కు వచ్చిపడ్డది. విశ్వామిత్రమహర్షి యాగరక్షణ అనే నెపంతో రాముణ్ణి తన వెంట పంపమని అడగటం అందరికీ తెలిసిన కథే. ఆ సమయంలో శ్రీరాముడు వైరాగ్యంలో మునిగిపోయి, ఏమీ పట్టకుండా వుంటున్నాడు. అప్పుడు వశిష్ఠ, విశ్వామిత్రులిద్దరూ కలసి శ్రీరాముడియొక్క తత్త్వ సందేహాలను తొలగించి, ఆయనయొక్క అకర్మణ్యతను తొలగించారు. ఆ తరువాతనే శ్రీరాముడు తాటక సంహారం, సీతా కళ్యాణం, మొదలైన విశిష్ట కార్యాలు నిర్వర్తించాడు. ఈ రామ వైరాగ్య ఘట్టాన్ని బాలకాండలోనే ప్రవేశ పెట్టినట్లైతే, ఆ మహర్షులు చేసిన బోధ అంతా అక్కడ చెప్పకపోతే అందం రాదు. చెబితే, గ్రంథం మొదట్లోనే వేదాంతచర్చ పెరిగిపోయి, మున్ముందు తను చేయబోయే కావ్య వర్ణనలు, రస పోషణలు, మొదలైనవన్నీ పేలవమైపోతాయి. అంటే, మొత్తంమీద కావ్య శరీరంలో సమతూకం దెబ్బ తింటుంది.

అందువల్ల, వాల్మీకిమహర్షి తెలివిగా పూర్వరామాయణంలో ఈ వశిష్ఠబోధ ప్రసక్తే లేకుండా, ఆ సన్నివేశమే ఎత్తేశాడు. కానీ, ఆ మహామనీషి హృదయంలో తత్త్వవిద్యా రసమయమైన ఈ ఘట్టం మెదులుతూనే వున్నది. అందువల్ల, తరువాత కొంత కాలానికి ఈ ఘట్టాన్నే వేరే ఒక గ్రంథంగా వ్రాద్దామని సంకల్పించి, నిదానంగా వ్రాయసాగాడు. కానీ, అప్పటికే కొంత వయస్సు మళ్ళడంవల్ల, సీతాదేవి భూగర్భంలో కలిసిపోవటం మొదలైన ఘట్టాలవల్లా, ఆయనలో చురుకుదనం చాలా సన్నగిల్లింది. అందువల్ల, రచన మందకొడిగా సాగుతోంది. ఇలాంటి మహత్తర గ్రంథ రచనలు, మానవులను అదృశ్యంగా నడిపించే దివ్య ప్రేరేపణకు ఫలితంగా ఆవిర్భవిస్తాయే గానీ, ఆయా కవులయొక్క ఉత్సాహంవల్ల సంభవించవు. వారి నిరుత్సాహంవల్ల ఆగిపోవు కూడా.

వాల్మీకిమహర్షి వద్ద తపో విధానాలలో శిక్షణ తీసుకొంటున్న భరద్వాజుడు అనే శిష్యుడు తన గురువుగారివల్ల, పూర్వ రామాయణ గ్రంథాన్ని ఉపదేశం పొందాడు. ఆ కుర్రవాడు గురువుగారి కవితామాధుర్యానికి పరవశించి, దేశదేశాలకూ వెళ్ళి, ఆ గ్రంథం గానం చేసి వస్తూ వుండేవాడు. అతను అప్పటికే అనేక యోగసిద్ధులు సాధించినవాడు గనుక, దేశ దేశాలకు మాత్రమే కాక, లోక లోకాలకూ కూడా పోయి, రామాయణ గానం చేస్తూ వుండేవాడు.

అలాగే ఒకసారి అతను మేరు శిఖరాగ్రాన, దేవ సభలో, రామాయణ గానం చేశాడు. అతని అదృష్టం పండి, ఆ సభకు బ్రహ్మదేవుడు స్వయంగా విచ్చేశాడు. తన ప్రోత్సాహంవల్ల ఉద్భవించిన రామాయణ మహాకావ్య సౌందర్యాన్ని చవిచూసిన బ్రహ్మదేవుడికి, మహానందం అయిపోయింది. ముని కుమారుడి గానరీతి ఆయనకు బాగా నచ్చింది. దాంతో ఆయన ఆ కుర్రవాణ్ణి అభినందించి "ఏదన్నా వరం కోరుకోవోయ్!" అన్నాడు. అది విన్న భరద్వాజుడు మేధావి గనుక “దేవదేవా! సమస్త జీవులకూ దుఃఖం పోయే ఉపాయం చెప్పు. ఇదే నాకు కావలసిన వరం" అన్నాడు. బ్రహ్మగారు నవ్వి, ఇలా అన్నాడు. “దానికి నన్నడగడం దేనికయ్యా? మీ గురువుగారు క్రొత్తగా గ్రంథం మొదలు పెట్టాడు గదా! ఆయన్నే ప్రార్థించు. ఆ గ్రంథాన్ని ఉపదేశం పొందితే, సముద్రాన్ని వంతెనతో దాటినట్లు, సంసారాన్ని అవలీలగా దాటవచ్చు.

*తస్మిన్ శ్రుతే నరో మోహాత్ సమగ్రాత్ సంతరిష్యతి।*
*సేతునేవాంబుధేః పారం అపారగుణ శాలినా॥* (వై.ప్ర.స.2,శ్లో. 10)

అని బ్రహ్మదేవుడు గ్రంథరచన పూర్తికాక ముందే సర్టిఫికేట్ ఇచ్చేశాడు. కానీ, ఆ రోజుల్లో శిష్యులు ఇప్పటి శిష్యుల వంటివారు కాదు. వాళ్ళకు గురువుగారి దగ్గర ఎంత చనువు వున్నా, “నాకు ఫలానా ఉపదేశం చెయ్యండి” అని అడిగే ధైర్యం వుండేది కాదు. భరద్వాజుడి లాంటి మహా సిద్ధపురుషులు కూడా బ్రహ్మదేవుడితోనైనా నిర్భయంగా మాట్లాడగలరు కానీ, గురువుగారి దగ్గర నోరు తెరవ గలిగేవారు కాదు. అది భయం కాదు. భక్తికి విహితమైన లక్షణం. వారి గురుభక్తి అంత ఆదర్శప్రాయంగా వుండేది. భరద్వాజుని సంకటాన్ని గమనించిన బ్రహ్మదేవుడు సంతోషపడి “సరే! నేనే మీ గురువుగారితో చెబుతాలే. నడు" అని, ఆ కుర్రవాడ్జి వెంటబెట్టుకొని, సరాసరి వాల్మీకి ఆశ్రమానికి వచ్చేశాడు. బ్రహ్మదేవుణ్ణి చూసేసరికి వాల్మీకి మహర్షికి వొళ్ళు తెలియలేదు. ఆయన బ్రహ్మదేవుడికి అనేక విధాల పూజ చేశాడు. కానీ, భక్తి ఆవేశంవల్ల తనేం చేస్తున్నాడో తనకే సరిగ్గా తెలియటం లేదు.

బ్రహ్మదేవుడు ఆ ఉపచారాలను అంతగా పట్టించుకోకుండా ఇలా అన్నాడు. “ఓ మునివర్యా! నువ్వు

ఇప్పుడు రచిస్తున్న గ్రంథం చాలా గొప్పది. అది ఏదో వేదాంత చర్చ అనుకుంటున్నావేమో, కాదు. శ్రీరాముడియొక్క అసలైన స్వరూపాన్ని నీవు ఆ గ్రంథంలో వర్ణిస్తున్నావు. అందువల్ల, నీవు విసుగుపడి ఆ గ్రంథాన్ని మధ్యలో
ఆపెయ్యరాదు. ఈ గ్రంథంవల్ల సమస్త లోకాలకూ ఉపకారం జరుగుతుంది. సంసార సాగరానికి ఇది పడవ
లాగా పని చేస్తుంది. లోకులు ఈ పడవతో ఆ సాగరాన్ని అవలీలగా దాటుతారు. ఈ మాట చెప్పటం కోసమే నేను ఇక్కడి దాకా వచ్చాను. నువ్వు చేసేది లోకహితార్థమైన పని, దానిని మానబోకు.” ఈ మాటలు చెప్పేసి,బ్రహ్మదేవుడు అంతర్ధానమైపోయాడు.

వాల్మీకి మహాకవికి ఏం జరిగిందో సరిగ్గా అర్థం కావడం లేదు. గాలికి సముద్రంలో ఒక కెరటం లేచి, చూసే లోపలే అణిగిపోయి, ఆ సముద్రంలోనే కలిసిపోయినట్లుగా వుందిట ఆ పరిస్థితి. కొంత సేపటికి వాల్మీకి మహర్షి యొక్క భక్తి ఆవేశం తగ్గింది. అప్పుడు ఆయన మెల్లగా తేరుకొని, శిష్యుడ్జి పిలిచి, "అబ్బాయీ! బ్రహ్మదేవులు ఏదో చెప్పార్రా! వారేం చెప్పారో నువ్వు నాకు సరిగా చెప్పు" అన్నాడు. భరద్వాజుడు బ్రహ్మగారి మాటలన్నీ యథాతథంగా చెప్పాడు. వాల్మీకిమహర్షికి బ్రహ్మగారి భావం అర్థమైపోయింది. దాంతో ఆ గ్రంథం గురించి ఆ కుర్రవాడితోనే కొద్దిగా చర్చించసాగాడు.

అప్పుడు భరద్వాజుడు మెల్లిగా "గురుదేవా! పూర్వ రామాయణం పరిశీలన చేస్తే ఒక్కొక్కసారి రాముడు సాంసారిక సుఖదుఃఖాలలో కొట్టుకు పోయాడేమో అనిపిస్తుంది. కొన్ని చోట్ల చూస్తే ఆయన మహాజ్ఞానేమో, తత్త్వజ్ఞుడేమో, అనిపిస్తుంది. ఆ మహాతల్లి సీతాదేవి ప్రవర్తనా అంతే. గురుదేవా! శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణాది సోదరవర్గమూ, వీరంతా ఈ సంసారయాత్రలో జ్ఞానులుగా ప్రవర్తించారా? అజ్ఞానులుగా ప్రవర్తించారా? ఆ వివరం నాకు ఉపదేశించు" అని అడిగాడు. వాల్మీకిమహర్షి బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు, గ్రంథాన్ని ప్రప్రథమంగా తన శిష్యుడైన భరద్వాజుడికే ఉపదేశించాలని నిశ్చయించుకొని, అప్పటివరకు రచించిన గ్రంథమంతా శిష్యుడికి వినిపించి, ఇక ముందు ఏ రోజు వ్రాసింది ఆ రోజు తాను శిష్యుడికి ఉపదేశిస్తూ వుండేవాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆజ్ఞ, వాల్మీకి మహర్షి యొక్క తత్త్వతపన, భరద్వాజ మునికుమారుని యొక్క జిజ్ఞాస, మూడూ ఏకీభవించగా, ఉద్భవించిన మహాగ్రంథమే యోగవాశిష్ఠము.(సశేషము)

No comments:

Post a Comment