Sunday, May 24, 2026

 *🌺 ఈశ్వర వైభవం 🌺*

🍃🌹ఈశ్వర వైభవం తెలిస్తే అహంకారం నశిస్తుంది. తెలియకపోతే, ఈశ్వరుడు మన ముందే నిలిచినా మన అహంకారం మనల్ని బాగుపడనివ్వదు. సరిగదా, మరీ పాడుచేసి కూర్చుంటుంది.

భస్మాసురుడు, రావణాసురుడు, దుర్యోధనుడు పరమాత్మను ముందుపెట్టుకొని పాడయ్యారు.
వస్తువు ఉంటే లాభం లేదు. వస్తుజ్ఞానం ఉండాలి.

మనలోని వైభవాలు కూడా ఈశ్వర వైభవాలేనని తెలియగానే అహంకారం క్షణంలో నశిస్తుంది. అంతేకాదు, ఈర్ష్యలు నశిస్తాయి. అసూయలు అదృశ్యమవుతాయి. శత్రుత్వాలు రూపుమాపుకుంటాయి.

కొందరు వృద్ధిలోకి వస్తే, అది చూసి చాలామంది ఈర్ష్య పెంచుకుంటారు. బాగా ఎత్తుకు ఎదిగిపోయాడని అసూయపడుతూ ఉంటారు. పైకెళ్లే వాళ్లను చూసి ఈర్ష్యపడే బుద్ధి ఉన్నప్పుడు, పైకి ఎగిరే పక్షిని చూసి ఈర్ష్యపడరు ఎందుకని? అదేమిటి?

“పక్షికి నాకు సామ్యం ఏమిటి?” అంటారు.

నిజమే, బావుంది. పక్షికి నీకు సామ్యం లేదు. మరి, పరమాత్మకు నీకు సామ్యం ఉందా? చెప్పు. పరమేశ్వరునిపై నీవు ఈర్ష్యను పెంచుకోగలవా? అసూయపడగలవా?

వేణునాద విద్వాంసుడు తనకన్నా ప్రావీణ్యం గల మరొక వేణునాద విద్వాంసునిపై ఈర్ష్యను పెంచుకోవచ్చు. శ్రీకృష్ణుడు కూడా మురళీనాద విద్వాంసుడే కదా! కృష్ణునిపై అసూయను పెంచుకుంటాడా?

వీణా విద్వాంసుడు, వీణా విద్వాంసులైన మానవులపై అసూయను పెంచుకోవచ్చునేమో గాని, సరస్వతీదేవి విషయంలో అసూయపడతాడా?

నాట్యాచార్యులు నటరాజుపై ఈర్ష్య పెంచుకుంటారా?

కవులు ఆదికవిపై అసూయపడతారా?

బుద్ధిమంతులు బృహస్పతితో పోటీపడతారా?

“అదేమిటి స్వామీజీ! అదంతా దైవబలం. ఈశ్వర వైభవం. ఆ విషయంలో నాకు ఈర్ష్య ఎలా ఉంటుంది? అసూయ ఎలా వస్తుంది?” అంటారు.
అలాగా! అయితే విను.

మానవులలో ఉన్నది కూడా పరమాత్మ వైభవమే. ఏ మానవుడూ తన స్వంత వైభవంతో శోభించడం లేదు. అందరి వైభవాలూ అచ్యుతునివే. ఎవరిలో, ఎక్కడ, ఎప్పుడు ఏ వైభవం గోచరించినా అది అంతయూ పరమేశ్వరుని వైభవమే.

“ఏయే వస్తువు ఐశ్వర్యవంతముగాను, కాంతియుతముగాను, దృఢముగాను ఉన్నదో, అలాంటిదంతా నా తేజస్సు వలన కలిగినదిగా తెలుసుకో” అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలిపాడు.

కనుక ఎవరిలో వైభవం గోచరించినా అది ఈశ్వర వైభవమేనని గుర్తించాలి. దర్శించాలి. ఆనందించాలి. ఇదే జరిగితే, ఆకాశంలో చెట్లు నిలవనట్లే అంతఃకరణంలో అసురగుణాలు నిలవవు.

ఇతరులలోని వైభవాన్ని ఈశ్వర వైభవంగా దర్శించగానే ఈర్ష్యలు, అసూయలు అదృశ్యమవుతాయి. అలాగే మనలోని వైభవాన్ని కూడా ఈశ్వర వైభవంగా దర్శించగలిగితే అహంకార దర్పాలు అదృశ్యమవుతాయి.

“మరి, నాలో ఏ వైభవమూ లేదు కదా!” అని ఆలోచిస్తున్నావా? విచారించకు. మనలో ఏ వైభవం లేకపోయినా, ఉన్నవారిలోని వైభవాన్ని గుర్తించగలిగినా అదీ ఒక వైభవమే.

ఎవరిలో యశస్సు ఉన్నా దానిని నీవు గుర్తించగలిగావంటే, నీలో ఆ జ్ఞానం ఉంది. గొప్పతనం ఉంది. యశస్సు ఉంది. గుర్తించటం చేతకాక గతంలో ఎన్నో పోగొట్టుకున్నాం. తెలియనివాడు రత్నాన్ని గాజుముక్క అనుకోవచ్చు. తెలియని దోషం వల్ల జ్ఞానులకు కూడా దూరమవుతూ ఉంటాం. దారిచూపే గురువులకు కూడా దూరమవుతూ ఉంటాం.
పరులలోని పరమాత్మ వైభవాన్ని గుర్తించి దర్శించడం సులభమైన కార్యం కాదు. అది కూడా యశస్సే.

అలాంటి పవిత్రమైన యశస్సును ఇక్కడే మీరు చూడవచ్చు. ఇప్పుడే చూడవచ్చు. జ్ఞానయజ్ఞం జరిగే స్థలం వేలాదిమంది శ్రోతలతో నిండిపోవడం సులభమైన కార్యం కాదు. అదికూడా యశస్సే...అక్కడ శ్రోతలందరూ విద్యావంతులే అని చెప్పగలమా? అందరూ మేధావులేనా?

ఒక్కసారి ఆలోచించండి.
అక్కడ నిరక్షరాస్యులు కూడా కొందరు ఉన్నారు. అర్థం చేసుకోలేని ముసలివాళ్లు ఉన్నారు. ఏదీ అర్థంకాని పిల్లలు ఉన్నారు. అయినా అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. ఎందుకని?

వారిలో అక్షరజ్ఞానం లేకపోయినా, అక్షయ స్వరూపుణ్ని గుర్తించే వైభవం వారిలో ఉంది. లేకపోతే వస్తారా? నిశ్శబ్దంగా వింటారా?

వైభవాన్ని గుర్తించగలిగే వైభవమే ఒకనాడు వారిలో కూడా శోభిస్తుంది.
ప్రయత్నశీలులు పతనమెరుగరు. అహంకారి ప్రగతి ఎరుగడు.


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

No comments:

Post a Comment