Monday, May 25, 2026

 *అనన్యసామాన్యమైన కరుణ*

డా. శివశంకరన్ తను కూర్చున్న బోయింగ్ విమానం కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు. చెన్నై కొబ్బరి చెట్లు దగ్గర దగ్గరగా వస్తున్నాయి, కాంక్రీటు భవనాలు కొమ్ములలాగా పైకి మొలుస్తూ కనబడుతున్నాయి. నురుగుతో కూడిన సముద్రపు అలల చివరన ఉన్న తెల్లని మట్టి కనుచూపుమేర కనిపిస్తోంది.
“మద్రాసు వదిలి సరిగ్గా ఇరవై సంవత్సరాలయ్యింది” అన్నాడు శివశంకరన్.
“ఎంతగానో మారిపోయి ఉంటుంది” అంది భాగీరథి.
“కేవలం సముద్రం మాత్రమే మారలేదు”
భాగీరథి తన చేతిసంచి తెరిచి, దాంట్లో చాలా ఉన్న చిన్న చిన్న సీసాల్లోని ఒక సీసా తీసుకుని, తెరిచి అందులో ఉన్న గులాబి రంగు ద్రావణాన్ని చేతుల్లో వేసుకుని చెక్కిళ్ళకు పూసుకుని, కేవలం పది నిముషాల్లో తన వయస్సును తగ్గించేసుకుంది. చిన్నగా దాని పరిమళం విమానం అంతా వ్యాపించింది.
“శంకరాచార్యులను చూడడానికి కూడా ఇలా సింగారించుకోవాలా?” అన్నాడు శివశంకరన్.
“కాదు! నా చర్మం ఈ ఎండలను తట్టుకోలేదు”
“May I have your attention please” అని పైనున్న స్పీకరు నుండి ప్రకటన మొదలయ్యింది. తరువాత చెప్పిన విషయం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.
“ప్రపంచంలోనే అత్యంత చెత్త విమానయాన సంస్థగా భారతీయ విమానయాన సంస్థకు ప్రతీ సంవత్సరం బహుమతి ఇవ్వొచ్చు” అన్నాడు శివశంకరన్.
భాగీరథి మౌనంగా ఉండడంతో మరలా తనే, “ప్రపంచంలోనే అత్యంత చెత్త విమానాశ్రయం బాంబే” అని అన్నాడు. భాగీరథి కనుకొనల నుండి అతణ్ణి చూస్తూ, “మొత్తానికి భారతదేశాన్ని దూషించడం మొదలుపెట్టారా?” అన్నది.
“నేను నిజమే చెబుతున్నాను. చెప్పు, ఈ దేశం ఎప్పటికైనా పురోగతి చెందుతుందా? విమానాశ్రయంలో తాగడానికి ఒక్క చుక్క నీరు లేదు; కూర్చుని సేదతీరడానికి ఒక్క కుర్చీ లేదు; అమెరికాలో ఖాయమైన మన టికెట్టు గురించి వారికి సమాచారం రాలేదు అన్నారు; విమానం మూడు గంటల ఆలస్యం. అస్సలు ఈ దేశానికి విమానం ఎందుకు?” అని శివశంకరన్ రెచ్చిపోయాడు.
భాగీరథి మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే, వాటికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే ఆ చర్చ ఎక్కడికి వెళ్తుందో తనకు తెలుసు. కానీ శివశంకరన్ తన వ్యంగ్య ధోరణిలో, “కాంచీపురంలో ఏదైనా హోటలు ఉంటుందా, లేక మనం ఆరుబయటే ఉండాలా?” అన్నాడు.
భాగీరథి ఏమీ బదులివ్వలేదు.
“ఒక అల్యూమినియం పాత్రతో . . . ?”
మరలా తను మౌనంగానే ఉంది.
విమానం రన్ వే ను తాకి ఒక్కసారిగా కుదుపుకు గురయ్యింది. “ఎంత చెత్తగా దించాడు విమానాన్ని” అన్నాడు శివశంకరన్. విమానం నిలిచిపోయింది.
“నీకు అంతగా వెళ్ళాలి అని ఉంటే, నువ్వు ఒక్కదానివే వెళ్ళి దర్శనం చేసుకో! నన్ను ఎందుకు మధ్యలో లాగావు?”.
“నువ్వు కూడా వారిని చూడాలి”.
“నేను ఎందుకు? నాకు ఇలాంటివాటిపై నమ్మకం లేదు. నేను భౌతికవాదిని, దేవుడు అతీంద్రియశక్తి లేదని విశ్వసించేవాడిని”.
తమ సంభాషణను ఈవిధంగా పొడిగించడం ఇష్టంలేక, విషయం వేరేవైపు మరల్చాలని “ఈరోజు ఏం వారం” అని అడిగింది.
“భారతదేశానికి వచ్చి, ఈ విమానాల కోసం వేచి చూసిన తరువాత, వారాలు కూడా మర్చిపోయాను”. “ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు? ఈ జనాలకు ఏరోబ్రిడ్జ్ ఎందుకు?”.
ప్రయాణీకులందరూ ఆదరాబాదరాగా బయటకు వెళ్ళే ద్వారంవైపు పరిగెత్తారు.
“మూడు గంటలసేపు కూర్చుని ప్రయాణం చేశారు. మూడు నిముషాల పాటు కూర్చోలేరా? ఏం భారతీయులో ఏమో!”
“నువ్వు భారతీయుడివి కావా?” అని అడగాలనుకుంది భాగీరథి. కానీ తెలివితో విషయాన్ని వేరేవైపు మరల్చింది.
“నువ్వు మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు, నీవద్ద ఎన్ని డాలర్లు ఉన్నాయి?” అని అడిగింది.
“రెండు డాలర్లు! కేవలం రెండే డాలర్లు” అది అతనికి అత్యంత ఇష్టమైన విషయం. ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పాడో. “కెన్నడి విమానాశ్రయంలో దిగాను. ఒక ఫోన్ కాల్ చేసుకోవడానికి కావాల్సినంత డబ్బు కూడా లేదు. అప్పుడు నాకు ‘కలెక్ట్ కాల్’ అంటే ఎంటో కూడా తెలియదు. అప్పుడు నాకు . . .”
మరలా ఇంకోసారి ఆ కథనంతా వినడానికి భాగీరథి సిద్ధమైంది. ప్రయాణీకులందరూ క్రిందకు దిగిపోయే దాకా ఇద్దరూ సీట్లలోనే కూర్చున్నారు; యాభై అడుగుల దూరం ఎండలో నడిచిన తరువాత ఏసి హాలులోకి వచ్చారు. ఎస్కలేటర్ పనిచేయడం లేదని వ్రాసున్న బోర్డును చూసి వ్యగ్యంగా నవ్వుకున్నాడు శివశంకరన్.
“ఈ దేశం తన పేదల ఆకలిని తీర్చి, జనాభాను నియంత్రిస్తే చాలు. ఇంకేం అవసరం లేదు; శాటిలైట్లు మిసైళ్ళు ఎందుకు?” దేశ సమస్యలకు రెండు వాక్యాలలో సులభమైన పరిష్కారం ఇచ్చేశాడు శివశంకరన్. ఏమీ బదులుచెప్పకుండా నడుస్తోంది భాగీరథి. ‘ఇలా చెప్పడం సులభమే కానీ, దాన్ని ఆచరణలో పెట్టడమే పెద్ద సమస్య’. కంచి వెళ్ళేదాకా తను ఇటువంటి చర్చలలో పాల్గొనదల్చలేదు.
హాలులో ఒక ట్రాలీ తీసుకోగా, అది కదలడానికి మొరాయించింది. “ఛీ! భారతదేశంలో కనీసం ఒక ట్రాలీని మంచిగా తయారుచెయ్యలేరా?”
‘స్వయంవరంలో’ మెల్లిగా నడచివచ్చే రాకుమారిలా కన్వేయర్ బెల్టుపై సామాను వస్తోంది. అప్పుడు ఒక సహాయకుడు దాన్ని అందుకుని, దానిపై వ్రాసిన సంఖ్యను తప్పుగా చెప్పాడు.
‘ఎక్స్ క్యూజ్ మి! ఎక్స్ క్యూజ్ మి’ అంటూ శివశంకరన్ అతనివైపు పరిగెడుతూ, అతని చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ఆ సహాయకుడు కోపంతో, “ఈ సామాను నీదైతే, చెప్పు; అలాకాక, నాపై చెయ్యి వేశావు అంటే, నేను కూడా నీపై చెయ్యి వెయ్యడానికి ఎంతో సమయం పట్టదు; నువ్వు ధనవంతుడివి అయితే, అది నీ ఇంట్లో ఉంచుకో; ఇక్కడ నేనే అధికారిని” అన్నాడు.
“ఏమంటున్నావు? ఏమంటున్నావు?” అంటూ శివశంకరన్ ఇటువైపు తిరిగేటప్పటికి మొహం ఎర్రబడిపోయింది; వెంటనే సార్బిట్రేట్ మాత్ర తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు; కోపాన్ని భాగీరథిపై మరలుస్తూ, “ఇదంతా నీవల్లే! ఎందుకు నన్ను ఇలా కించపరుస్తున్నావు? నేను భారతదేశానికి రాను, ప్రిన్స్టన్ లోనే ఉంటానని నీకు చెప్పాను; నాకు ఇదంతా ఇష్టం ఉండదు; ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు? మద్రాసు విమానాశ్రయంలో ఒక లోఫర్ తో నేను ఇలా మాటలు పడాలా?”
“రేయ్! ఎవరు లోఫర్ ఇక్కడ? ఒక్క గుద్దు గుద్దానంటే నీ బర్ముడా మొత్తం రక్తసిక్తం అవుతుంది”.
“రా, వెళ్దాం! ఎందుకు అతనితో గొడవ” అని భాగీరథి పక్కకు లాక్కెళ్లింది. అలాంటి సమయంలో ఎక్కువ మాట్లాడకూడదని తనకి బాగా తెలుసు.
వాళ్ళు బయటకు వచ్చి, తమను తీసుకువెళ్లడానికి రావాల్సిన కారు కోసం చూడసాగారు. ఇతర ప్రయాణీకుల కార్లు రావడంతో, వారందరూ వెళ్ళిపోయారు; వెంటనే ఆ ప్రదేశం మొత్తం ఖాళీ అయిపోయింది.
“ఆటో కావాలా? డెబ్బై రూపాయలు మాత్రమే . . . మైలాపూరే కదా?”
“నేను ఎక్కడికి వెళ్లాలో నీకెందుకు?” అన్నాడు శివశంకరన్.
“ఆయనతో మాట్లాడకు” అంటూ భాగీరథి జోక్యం చేసుకుంది.
“నేను ఊరికే అడిగాను మేడమ్. ఎందుకు అలా కోప్పడతారు?” అని ఆటో డ్రైవర్ జవాబిచ్చాడు.
అప్పుడు ఒకతను వారి వద్దకు వచ్చి, “మీరు శివరామన్ కదూ?” అని అడిగాడు.
“డా. శివశంకర్”
“కంచి వెళ్లాల్సినవారు మీరే కదూ? కారు కోసం ప్రదీపా ట్రావెల్స్ వారిని అడిగారు కదూ?”
“అవును”
“ఉండండి, నేను కారు తెచ్చాను”
“నేను శివరామన్ కాదు”
“సరే శివశంకర్, రండి! కారు తెచ్చింది మీకోసమే”
ఆ డ్రైవరుని చూసి భాగీరథి ముచ్చటపడింది. వారి సామాను తీసుకుని కారు వెనకాల పెట్టి, కారు తలుపు తీసి, వారు లోపలకు వెళ్ళి కూర్చున్న తరువాత తలుపు వేసి, వెళ్ళి డ్రైవరు సీట్లో కూర్చున్నాడు.
“ఎటువంటి ట్రావెల్ ఏజెంట్స్ వీళ్ళు? కనీసం పేరు కూడా సరిగ్గా చెప్పరా?”
“కొన్నిసార్లు ఇటువంటి పొరపాట్లు జరుగుతాయి, టెలెక్స్ సందేశంలో . . .”
డ్రైవరు తన మాటలను పూర్తిచేయ్యడానికి శివశంకరన్ వదల్లేదు, “మీ దేశంలో ఏది సరిగ్గా చేస్తారు గనక?”.
“డ్రైవర్ నీ పేరెంటి?” అని అడిగింది భాగీరథి.
“పాల్ రాజ్ మేడమ్! ఏసి వెయ్యమంటారా? పాటలు పెట్టమంటారా?”
ప్లేయరులో ఏదో కాసెట్ పెట్టాడు, “కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం” అంటూ పాడుతోంది.
“నాకు ప్రేమ వద్దు తమ్ముడు”
కారు బయలుదేరి వెంటనే ప్రధాన రహదారి పైకి వచ్చింది.
“ఎదైనా భక్తి గీతం పెట్టనా?”
“మాకు ఏ పాటలూ వద్దు, మమ్మల్ని ప్రశాంతంగా వదిలెయ్యి”
పూనమల్లి వైపుకు కారు తిరగగానే, “నిదానంగా వెళ్దాం పాల్ రాజ్. మాకు అంత అవసరం ఏమి లేదు” అన్నది భాగీరథి.
“ఈరోజే పరమాచార్య స్వామివారిని దర్శించుకోరా? ఇంకో రెండు గంటల్లో అక్కడికి చేరుకుంటాము”.
“రేపు తీరిగ్గా దర్శనం చేసుకుంటాము; అదేమీ నాకు ముఖ్యం కాదు; ఈమె కోసమే; కేవలం దీనికోసమే తను అమెరికా నుండి వచ్చింది” అని జవాబిచ్చాడు శివశంకరన్.
“ఓహ్! అవునా? నాకు చాలా ఆనందంగా ఉంది. పెరియవా దైవ స్వరూపులు సార్. నేను ఇప్పటిదాకా ఎనభైఎనిమిది సార్లు దర్శించుకున్నాను; వందకు మరో పన్నెండు తక్కువ; వారి వయసుకు సమానం అవుతుంది”.
“పాల్ రాజ్! నువ్వు క్రైస్తవుడివి కదా?”
“అవును సార్! అయితే ఏమిటి?”
“విడ్డూరం” అన్నాడు శివశంకరన్.
“మా ఇంట్లో ఆయన దేవుడు, మీకు తెలుసా? స్వామివారి ఒక్కచూపు చాలు, కోరుకున్నవి దక్కుతాయి”
“నీకు జరిగిందా?”
“ఎందుకు లేదు? నా కుమార్తె రోజ్ మేరీకి తపాలా శాఖలో ఉద్యోగం దొరకాలి అనుకున్నాను. మరలా దర్శనానికి వెళ్ళేటప్పటికి తనకు నియామక పత్రం వచ్చింది”.
“అవునా? ఆయన టెలిఫోన్లో కూడా ఉన్నాడా?”. శివశంకరన్ మాటల్లోని వ్యంగ్యం పాల్ రాజ్ గమనించలేదు.
“పెరియవా దేవుడు. దూరం నుండే వారిని దర్శించి వేడుకోండి, మీ కోరిక నెరవేరుతుంది. ఇంతకూ మీకు ఏమి కావాలి సార్?”
“కాంచీపురంలో మంచి హోటల్”
“మేడమ్, మీకు?”
“మనఃశాంతి”
“సార్ చాలా చతురులు”
“చూడు, పాల్ రాజ్, నాకు ఇటువంటి వాటిపై నమ్మకం లేదు. నా పరిశోధన ప్రకారం నాకు భగవంతుని అవసరం లేదు”.
“నాకు కావాలి, సార్”
“ముందర చూడు” అని గట్టిగా అరిచాడు శివశంకరన్.
పెద్ద లారీని ఢీకొట్టబోతూ వెంట్రుకవాసిలో తప్పి, కారు తారురోడ్డు నుండి క్రిందకు దిగి ఒక చెట్టు వద్ద ఆగింది.
శివశంకరన్ కు భయంతో చెమటలు పట్టాయి. పాల్ రాజ్ క్రిందకు దిగి టైరు పంక్చర్ అయినట్టు గమనించాడు. “పదిహేను నిముషాల్లో టైరు మారుస్తాను” అని చెప్పి పనిలోకి దిగాడు. శివశంకర్ సిగరెట్టు వెలిగించాడు; ఆ చెట్టు కిందనే ఒకతను కొబ్బరిబోండాలను అమ్ముతున్నాడు.
“ఒకటి కొట్టివ్వనా సార్?”
“వద్దు, నాకు తాగాలని లేదు”
“మీకోసమని ఒకటి కొట్టాను సార్”
మరలా అగ్గిమీద గుగ్గిలం అవుతాడని అనుకుంది భాగీరథి, కానీ ఏ కళనున్నాడో సరే అని తీసుకున్నాడు. తీయని కొబ్బరినీళ్లు తాగి, “ఇదొక్కటే ఈ దేశంలో ఇంకా బావుండేది” అన్నాడు.
“పాల్ రాజ్, నువ్వు కూడా ఒక కొబ్బరిబోండాం తీసుకో”
“లేదు మేడమ్, స్వామివారిని దర్శించుకునేదాకా చుక్క నీరు కూడా తాగను”
“మనం వెంట్రుకవాసిలో తప్పించుకున్నాం”
“అంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే” అన్నాడు పాల్ రాజ్.
“అవునా?” తన వ్యంగ్య ధోరణి మారలేదు.
వారు కంచి చేరుకునేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యింది. చెరువుల్లో ఈతకొడుతున్న హంసలు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న తాటి చెట్లు, ఆలయ గోపురాలు కొత్తగా, శోభాయమానంగా ఉన్నాయి. స్వామివారి శతాబ్ధపు ఉత్సవాల కోసం పట్టణం మొత్తం సింగారించుకుంటోంది. ఎక్కడచూసినా చలువ పందిళ్లతో, వెదురు కర్రల బారులతో; గోవులు, ఎద్దులు మరియు కుక్కలు వీధులంతా తిరుగుతున్నాయి. భాగీరథి సంతోషానికి అవధులు లేవు. అక్కడ ఒక పెద్ద పందిరి ఏర్పాటు చేయబడింది.
“ఉత్సవాలు ఇక్కడే జరుగుతాయి మేడమ్”.
“ఈ ప్రాంతాన్ని చూసినవారెవరైనా ఇది పల్లవ రాజుల రాజధాని అంటే నమ్ముతారా? నువ్వు వాటికన్ చూశావు కదా, ఎలా ఉంది అది? వెయ్యి సంవత్సరాల పురాతన ప్రాంతాన్ని అమెరికా ఎలా కాపాడుకుంటుంది?”
“నాకు అది అంతా ముఖ్యం కాదు సార్”
“నేను నీతో మాట్లాడడంలేదు పాల్ రాజ్”
“మనం నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళి, తరువాత ఇతర దేవాలయాలను చూద్దాము” అన్నాడు పాల్ రాజ్.
శివశంకరన్ వెంటనే తిరస్కరించి, “ముందు ఏదైనా హోటల్ కు. తరువాతే ఏ కార్యక్రమమైనా” అని ఖరాఖండీగా చెప్పాడు.
“లేదు, సార్; మనం స్వామివారిని దర్శించడానికి అరగంట చాలు. అందుకనే అంత వేగంగా కారు నడిపాను”.
“వారిని రేపు చూద్దాము, ముందు హోటల్, నాకు చాలా ఆకలిగా ఉంది”
ఒక్కటే మూడు నక్షత్రాల హోటల్ ఉంది. అక్కడికి వెళ్ళి, గదిలోకి వెళ్ళగానే శివశంకరన్ మొదలుపెట్టాడు, “స్నానాల గదిలో బొద్దింకలు, గోడలపై రక్తపు మరకలు, మురికి తువ్వాళ్ళు, ఔషధాల వాసన. అమెరికాలో ఉంటే కొద్ది సౌఖ్యం అయినా ఉండేది . . .”
భాగీరథి ఇక తట్టుకోలేకపోయింది, “దయచేసి రెండు రోజులపాటు మీ అమెరికాను విడిచిపెట్టి, భారతదేశానికి వస్తారా? మనం ఇక్కడకు వచ్చింది పరమాచార్య స్వామివారి దర్శనం కోసం. నల్లులు లెక్కపెట్టడానికి కాదు” అని ఘాటుగా స్పందించింది.
“మనం వచ్చాము అనకు. నువ్వు మాత్రమే వచ్చావు, నాకు ఏమాత్రం ఇష్టం లేదు; నేను ఇవన్నీ నమ్మను; నేను ఆయన్ని చూడకపోయినా పర్లేదు; నాకు తలనెప్పిగా ఉంది”
అంతలోనే పాల్ రాజ్ అక్కడకు వచ్చి భాగీరథిని పిలిచి, చిన్న స్వామివారు అమ్మవారి పూజ చేస్తున్నారు అని తెలిపాడు.
“వస్తున్నాం పాల్ రాజ్! హలో, లేవండి, వెళ్దాం”
“నేను రాను; నువ్వు వెళ్ళు; నేను ఈ గదిలోనే ఉంటాను”
“నువ్వు లేకుండా నేను ఒంటరిగా వెళ్ళను”
“పాల్ ఉన్నాడు కదా”
“సార్, నేను లోపలకు రాను; బయటినుండే స్వామివారిని దర్శించుకుంటే చాలు నాకు”
“ఛీ! నీతో ఇదే తలనెప్పి భాగీ”
“ఒక్కరోజు, కేవలం ఒక్క రోజు దయచేసి నీ భౌతిక శాస్త్ర విషయాలు మరచిపోలేవా? నీ మొండితనాన్ని వదిలెయ్యలేవా? ఈ మూర్ఖత్వం వల్లే కదా మన ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్నాము?”
మండే కళ్ళతో, మౌనంగా భాగీరథివైపు చూసి, “నేనా కారణం, అందుకు నేనొక్కడేనా కారణం?” అన్నాడు.
“మరలా అదంతా మొదలుపెట్టొద్దు”.
“చెప్పు, నేనొక్కడేనా కారణం”.
“సరే, నేను కూడా అందుకు కారణమే”.
పాల్ రాజ్ పరిస్థితిని అంచనా వేసి, హోటలు ద్వారం వద్దక కారుతో వేచివుంటానని చెప్పి వెళ్లిపోయాడు.
“సరే! నేను వస్తాను; కానీ, నేను చొక్కా తీయను; అప్పుడప్పుడూ పొగ తాగుతాను; నేను నాస్తికుడిని; మతం అనేది కూడా ఒక మత్తుమందు, మోసపూరితమైన ఒక ఆట అని నమ్మేవాణ్ణి”
“నాతోపాటు వస్తే చాలు” అన్నది భాగీరథి. మోకాళ్ళదాకా ఉండే నిక్కరుతో, విశ్వవిద్యాలయ టీ షర్టు వేసుకుని, తలపై బేస్ బాల్ టోపీ పెట్టుకుని “సరే పద వెళ్దాం” అన్నాడు.
భాగీరథి తన కన్నీళ్లను ఆపుకోలేక ఆలోచిస్తోంది, “ఎందుకు ఈయన ఇంత మొండిగా ప్రవర్తిస్తాడు? ఏదైనా చెడు జరగబోతోందా?” అని.
హాలులో వందలమంది భక్తులు కూర్చుని పూజను తిలకిస్తున్నారు.
“ఈ పిల్లాడు ఎవరు?”
“చిన్న స్వామి”
“ఏంటీ పిచ్చి? నేను ఇప్పుడు అతని కాళ్లపై పడాలా?”
“అవసరం లేదు”
“ఇతను నంబర్ మూడా? మరి రెండో నంబరు ఎక్కడ?”
“దయచేసి కాసేపు ఊరికే ఉంటారా?”
చాలాసేపటి తరువాత, గోడవారగా వరుసలో వెళ్ళి స్వామివారిని సమీపించారు.
శివశంకరన్ మూలలో నిలబడున్నాడు, “ఎందుకు నిలబడున్నారు? కూర్చోండి? ఏమిటి పేరు?” అని అడిగారు జయేంద్ర స్వామివారు.
“శివశంకరన్”
“ఎక్కడినుండి?”
“అమెరికాలోని ప్రిన్స్టన్, నేను భౌతికశాస్త్ర ఆచార్యుడిని”
“మఠానికి చాలా దగ్గరి వ్యక్తి అయిన జయరామన్ కూడా ప్రిన్స్టన్ లోనే ఉంటారు, కదా?”
“నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ప్రిన్స్టన్ లో ఒకప్పుడు ఐన్ స్టీన్ అనే గొప్ప వ్యక్తి ఉండేవాడు”
“నీ భౌతిక శాస్త్రం ఏమని తేల్చింది? ఆదిశంకరులు చెప్పినదే కదా?”
“కాదు స్వామి! భౌతిక శాస్త్రం చాలా చాలా అభివృద్ధి చెందింది. ఈ విశ్వమంతా ఒకే పరమాణువు, ఒకే శక్తి; అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు”
“దాన్నే ఇక్కడ శివుడు, శక్తి ఇద్దరూ ఒక్కటిగా అర్ధనారీశ్వరులు అయి ఉన్నారని చెబుతున్నారు”.
“కాదు, మేము చెబుతున్న విషయం ఇది కాదు”
“అది ఆంగ్లము; ఇది సంస్కృతము. భావానీత్వమ్; “నేను నీవు అవుతున్నాను; ‘నేను’ మరియు ‘నాది’ నీలో కలిసిపోతున్నాము” ఇదే వారు చెప్పింది”.
“అది ఇలా కాదు”
భాగీరథి మధ్యలో అందుకుని “పదండి వెళ్దాం” అన్నది.
“నీవు అద్భుతాలను నమ్మవా?”
“లేదు”
“పాల్ బ్రంటన్, అర్థర్ కోస్లర్ లాంటివారు దీని గురించి చాలా రాశారు. వారి గురించి నువ్వు వినలేదా?”
“లేదు”
“చాతుర్మాస్యం కోసం పరమాచార్య స్వామివారు మహబూబ్ నగర్ లో మకాం చేస్తున్నప్పుడు, నీలాగే అమెరికా నుండి ఒకతను దర్శనానికి వచ్చాడు. బస్ స్టాండు నుండి రిక్షాలో వచ్చాడు. స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు. అప్పట్లో స్వామివారు అందరితో మాట్లాడేవారు. నుదుటిపై కుంకుమ ధరించాడు, స్వామివారు ఆపిల్ పళ్ళు ప్రసాదంగా ఇచ్చారు. మఠంలోనే భోజనం చేసిన తరువాత, కొంత డబ్బు ఇవ్వాలని తన పర్సు కోసం చూశాడు. కానీ దాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. పర్సు మాత్రమే కాదు, పాస్ పోర్టుతో పాటు పదిహేను వేల డాలర్ల ట్రావెలర్స్ చెక్ కూడా! అతడు నిశ్చేష్టుడయ్యాడు. వెతకడానికి ఎక్కడికని వెళ్లగలడు? భోజనశాలలోనూ లేదు, రిక్షా అతని ఇంట్లో కూడా లేదు. చివరకు అది ఎక్కడ దొరికిందో తెలుసా? బస్ స్టాండులో అతను కూర్చున్న సీమెంటు బెంచీపై. అప్పటికి వేలమంది ఆ దారిలో వెళ్లివుంటారు. దీన్ని ఏమని అంటావు శివశంకరన్? ఇది అద్భుతం కాదా? దీన్ని మీ భౌతికశాస్త్రం ఏమని నిర్వచిస్తుంది?”
“దాన్ని అద్భుతం అని మీరు అనవచ్చు; కానీ నేను దాన్ని ‘సంభావ్యత’ లేదా ‘అవకాశం’ అంటాను. దర్శనం అయ్యిందా, మనం ఇక వెళ్దామా భాగీ”.
స్వామివారు చిరునవ్వుతో వెళ్లడానికి అనుమతిచ్చారు. బయటకు వచ్చిన తరువాత, “ఆయనతో కూడా వాదనేనా?” అని అడిగింది భాగీరథి.
“ఎందుకు కూడదు? ఆయన కూడా నాలా ఆత్మే కదా? అద్వైతం చెప్పేది అదే కదా?”
బయట కాచుకున్న పాల్ రాజ్ “రండి! స్వామివారి దర్శనం చేసుకుందాం. బహుశా ఇంకొక అరగంట ఉంటారు” అన్నాడు.
భక్తుల వరుస వీధి చివరి దాకా ఉంది; భాగీరథి పరిగెత్తుకుంటూ వచ్చి వరుసలో చివర చేరింది. అన్నిటినీ మరచిపోయింది. పళ్ళపుడి రంగు చీర కట్టుకున్న ఒక విదేశీ వనిత ధ్యానంలో కూర్చుని ప్రవేశ ద్వారం వైపు చూస్తోంది. లోపల కొద్దిగా చీకటిగా ఉంది. నిదానంగా అక్కడకు చేరుకున్నారు.
గదిలోపల శతాయుశ్కులైన పరమాచార్య స్వామివారు జేరగిలబడి కూర్చున్నారు. స్వామివారి తలపై, కాషాయ వస్త్రంపై ఆకులతో చేసిన కిరీటం పెట్టుకున్నారు. మోకాళ్ళు ముడుచుకున్నారు. స్వామివారు ఎవరినీ ప్రత్యేకంగా గమనించడంలేదు. స్వామివారికి దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు భక్తుల వరుసను నియంత్రిస్తూ, అప్పుడప్పుడు స్వామివారి మెడలో పూలమాలలు వేస్తున్నాడు. అతను పాల్ రాజ్ ను గుర్తుపట్టి, “ఇది ఎన్నోమారు?” అని అడిగాడు.
“తొంభయ్యోసారి! ఈయన అమెరికా నుండి వచ్చారు”
“అమెరికా నుండి చాలామంది వస్తుంటారు. రండి మామి, దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోండీ” అని వారిని ఆహ్వానించాడు. భగీరథి తనను తాను సంభాళించుకోలేక కన్నీరు పెట్టుకోవడం మొదలుపెట్టడంతో, అవి ఆమె చీరపై పడి కిందకు పడ్డాయి.
“పరమాచార్యకు చెప్పండి, కేవలం ఈ క్షణం కోసమే మేము పదివేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాము. మా ఆయన ఎంత వాదించినా, లోలోపల, ఎక్కడో కాస్త నమ్మకం ఉంది. మాకు ఒక్కడే కుమారుడు; బాలాజీ అని పేరు పెట్టుకున్నాము. పన్నెండేళ్ళ వరకు బాగానే ఉన్నాడు. కానీ ఆ చెడ్డ దేశంలో, తండ్రికీ కుమారునికి అభిప్రాయ భేదాలు వచ్చి, ఒకరోజు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. నేపాల్, సిలోన్, జపాన్ ఇలా ప్రపంచమంతా తనకోసం వెతికాము. ఏమైనా జరగరానిది జరిగి చనిపోయాడో లేక బ్రతికే ఉన్నాడో కూడా తెలియదు. మా ఒక్కగానొక్క కుమారుణ్ణి పోగొట్టుకున్నాము. ఈనాటికీ మనసుకు ప్రశాంతత లేదు”.
“స్వామివారిని ప్రార్థించండి; సార్ మీరు కూడా”. ఆ యువకుడు స్వామివారి వద్దకు వెళ్ళి, చెవిలో విషయమంతా చెప్పాడు. స్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించారు. పెద్దకళ్లతో కళ్ళజోడులో నుండి ఒకసారి భాగీరథిని చూశారు స్వామివారు. భాగీరథి మనస్సు సంతోషంతో పొంగిపోయింది. ఆ యువకుడు రోజాపూవ్వులను, ఆపిల్ పండును ఇచ్చి, “అంతా సరిపోతుంది. దిగులు పడకండి. పిల్లాడి పేరు ఏమని చెప్పారు?” అని అడిగాడు.
“బాలాజి”
వారు బయటకు వచ్చారు. “ఎందుకు చిన్నపిల్లలా ఏడుస్తున్నావు” అని అడిగాడు శివశంకరన్. “సినిమాలలో జరిగినట్టు మన అబ్బాయి మన ముందు ప్రత్యక్షమవుతాడు అనుకుంటున్నావా?”.
కానీ తను తట్టుకోలేక ఏడుస్తోంది. “భాగీ, ఎంటిది పిచ్చిదానిలా! అందరిముందు ఏమిటిది! రా వెళ్దాం”, మొదటిసారి సానుభూతితో చూపిస్తూ, ఆమెను అనునయిస్తూ, భుజం చుట్టూ చేతులు వేసి తీసుకెళ్తున్నాడు.
వారి వెనకాల ఒక సేవకుని గొంతు “మామి, మామి! పరమాచార్య స్వామివారు మీకోసం ఒకరిని పంపారు” అని వినబడింది.
“ఎవరది?”
ఆ సేవకుని జతలో ఒక యువకుడు కూడా ఉన్నాడు. “ఏయ్! బాలాజీ! నిన్న స్వామివారు చెప్పలేదా రేపు వాళ్ళు వస్తున్నారని? వారు వీరే కదా?”
“అవును. మా నాన్న మరియు అమ్మ వచ్చారు!”
ఇక రాయడానికి ఏమి లేదు.

No comments:

Post a Comment