Sunday, May 24, 2026

 *ఈశ్వరా .. !!!*

నువ్వు ఒసగిన పాత్రలో 
మాయకు వశపడి 

పాత్రౌచిత్యమైన నటనను మరచి 
జీవిస్తున్నాను 
నీ నామము, స్మరణను  మరచి వ్యర్ధ ప్రసంగాలలో 
మునిగి తేలుతున్నాను 
నీ సేవన, ఆరాధన విస్మరించి అన్యమైన కర్మలలో 
నిరంతరము నిమగ్నమైనాను 

జన్మ జన్మల పరంపరలో 
కరుణతో కృపతో ఆదరణతో 
నీవు ఈ జీవునికి ఒసగిన పాత్రలను 
ఈరీతిగానే అవివేకముతో అజ్ఞానముతో  ముగించి 
నీ పదములు పట్టి 
మన్నించమని కోరే 
అర్హతను కూడా  కోల్పోయి ఉండవచ్చు 

ఎవరి పాదముల వాలి  తెలుపను  
ఈ ఆవేదన ?
ఎవరి సేవలు చేసి తెలుపను 
ఈ సంఘర్షణ ?
ఎవరి పదములు కడిగి విన్నవించను 
ఈ ఆర్తిని ?
పశుపతివైన నీకు గాక 

మరొక్క మారు నా అశక్తతను మన్నించి 
మాయను తొలగించి 
నీ పాదముల చెంత శాశ్వత నివాసమిమ్ము 

అలా 
రెప్ప వాల్చక 
ఊపిరి పీల్చక 
ప్రతి క్షణం 
నిన్ను చూసుకొని తరించే
భాగ్యాన్ని ప్రసాదించు
పరమేశ్వరా ...

అసురుల తపములకుప్రసన్నుడవై 
వరములెన్నో ఒసగలేదా ?
సురల అవసరాలని ఆదరించి 
కోర్కెలను తీర్చలేదా ?
మానవుడినైనా 
మహాదేవుడవు నీవేనని, 
నీవు తప్ప ఎవరు లేరని 
విన్నవించిన నా
ప్రార్ధన నీవు ఆలకించవా ??

*శివయ్యా ...!!!*
*శరణు శరణు శరణు*

No comments:

Post a Comment