Monday, May 25, 2026

 *కుల వృత్తి*

శర్మా! నమకం, చమకం వల్లె వేయమన్నాను.
వేసావా? రామావధాన్లు కొడుకుని తెల్లారి లేచాక, మూడోసారి అడిగాడు.
"అదీ...నాన్నగారూ...
నేను పట్నం వెళ్లి.... తండ్రంటే కామేశ్వర శర్మకి చచ్చేంత భయం, వణుకు. చక్కగా ఉన్నూర్లో, ఆరూళ్ల పౌరోహిత్యం వదులుకుని, పట్నంలో అద్దె కొంపల్లో పడి, హోటల్లో ఎవడో వండిన తిండి తిని అఘోరిస్తానంటావేంట్రా
పదో క్లాసు మిణికావు కదా! సరిపోదా ? రామావధాన్లుకి
నలుగురు ఆడపిల్లల తర్వాత వంశోధ్దారకుడు పుట్టాడన్న సంబరం ఎక్కువ ఏళ్లు నిలవలేదు. భార్య సత్యవతి కొడుకుని బడికి పంపించాల్సిందే అని పట్టు పట్టింది.
"వేదం కూడా నేర్చుకుంటేనే పంపిస్తాను" అని 
రామావధాన్లు అన్నా, శర్మకి రెండు పడవల మీద ప్రయాణం కుదరలేదు. హోమ్ వర్కని, ప్రాజెక్ట్ అని ఏదో కారణం చెప్పి, తండ్రి దగ్గిర కూర్చునేవాడు కాదు.
రామావధాని నల్గురు కూతుళ్ళు చూపులకి బాగుండడమే కాకుండా, తల్లి వెనక తిరిగి, మడి, దడి తెలుసుకున్నారు.
దాంతో, నలుగురు పిల్లల్ని ఎదురడిగి, పైసా కట్నం లేకుండా మరీ చేసుకున్నారు.
నలుగురు అల్లుళ్ళు చుట్టుపక్కల ఉన్న దేవస్థానాల్లో అర్చకులుగా పని చేస్తూ, ఖాళీ సమయాల్లో ఒడుగులు, పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు, శ్రీ సత్యనారాయణ వ్రతాలు చేయిస్తూ, నాలుగు చేతులా గడిస్తున్నారు. శర్మ ఏడ్చి, హఠం చేసి పట్నం వెళ్లి, హాస్టల్లో ఉండి చదువుకున్నాడు
అతనికి పైన ఆచ్ఛాదన లేకుండా కండువా కప్పుకుని, పంచె కట్టు తోనే రోజంతా గడిపే బావగార్లంటే కొంచెం తేలిక భావం. డిగ్రీ రాగానే, గ్రూప్ 4 పరీక్షలు పాసై, ప్రభుత్వ ఉద్యోగంలో చేరిపోయాడు.
పెళ్లి అయి, ఒక కొడుక్కి తండ్రి కూడా అయాడు.
పల్లెటూర్లో రామావధాని ఉక్కిరి బిక్కిరిగా వస్తున్న పనులన్నీ ఒంటి చేతి మీద చేసుకుంటూ, మరీ చేతకానప్పుడు, అల్లుళ్లకి అప్పజెప్తున్నాడు.
ఏడో ఏడు వచ్చిన మనవడు భరద్వాజకి పట్టుబట్టి, ఉపనయన సంస్కారం చేయించాడు.
భరద్వాజ సెలవుల్లో వచ్చినప్పుడు, వైదిక విధి విధానాలన్నీ నేర్పిస్తూ ఉన్న విషయం శర్మకి తెలియనే తెలియదు.
తాతా, మనవడు ఎవరికీ చెప్పక్కర్లేదనుకున్నారు.
రోజులు వారాలుగా, నెలలుగా, సం.లుగా రూపాంతరం చెంది, భరద్వాజ పై చదువులకి అమెరికా వెళ్ళాడు. ఒక ఆదివారం గుడికి వెళ్ళిన భరద్వాజ అక్కడ వేద పారాయణ జరుగుతూ ఉంటే, గొంతు కలపడం చూసి, ముచ్చటపడ్డ దేవాలయాధికారి అతనితో మాట్లాడి, పార్ట్ టైం అర్చకుడిగా నియమించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన భరద్వాజ ఉండే కౌంటీలో వేద సభ ఏర్పాటైంది.
ఇండియానుండి ఆసక్తి ఉన్న వేద పండితులు రావచ్చని, భరద్వాజకి తెలియగానే, మా తాత గారు టికెట్ పెట్టుకుంటారు. ఆహ్వానం పంపమని అధికారుల్ని రిక్వెస్ట్ చేసాడు. వాళ్లు సరేనన్నారు. ఈలోపు గ్రాడ్యుయేషన్ తేదీ కూడా దగ్గర్లోనే ఫిక్స్ అయింది. రామావధాని దంపతులు, శర్మ దంపతులు అమెరికాకి వచ్చారు. వేద సభ వివరాలు తాతగారికి పంపిస్తూ, అమ్మా నాన్నకి చెప్పద్దని భరద్వాజ ముందే కోరాడు. గ్రాడ్యుయేషన్ శోభాయమానంగా ముగిసింది. ఆ మర్నాడే వేద సభ!
తాతగారు, మనవడు పట్టుపంచెలు కట్టుకుని విభూతి రేఖలు, కుంకుమ బొట్టుతో సంప్రదాయం ఉట్టి పడుతున్నట్టు తయారైతే, అమెరికా లో ఉన్నట్టు లేదు. అగ్రహారంలో ఉన్నట్టుంది అంటూ అత్తా కోడలు నవ్వేసారు. శర్మ మాత్రం జీన్స్ ప్యాంట్, డార్క్ కలర్ టీ షర్ట్ తో తయారయ్యాడు.
వేదసభ అట్టహాసంగా ముగిసింది. తన తండ్రి, తన కొడుకు ఒకే రాగం, ఒకే స్వరంతో వేద పారాయణ చేస్తుంటే, శర్మ నోరు ఆశ్చర్యంతో తెరుచుకుంది. అక్కడ అందరూ రామావధాని పాదాలకి నమస్కరించి భరద్వాజని భుజం తట్టి అభినందిస్తుంటే, *కులవృత్తికి సాటి రాదు గువ్వలచెన్నా* అనే పద్య పాదం గుర్తుకొచ్చి, శర్మ కళ్ళు చెమర్చాయి.

Lalitha Rayaprolu

No comments:

Post a Comment