పర్యావరణం బాగుంటేనే… (కథ) నారంశెట్టి ఉమామహేశ్వరరావు
రామన్నగూడెంలో ఉండే రాజయ్య మాస్టారు, రామయ్య తాతలకు పచ్చదనం, పర్యావరణం అంటే పిచ్చి ప్రేమ. స్వయంగా మొక్కల్ని నాటడమే కాకుండా మిగతావాళ్ళకి చెప్పేవాళ్లు. వాళ్ళ మాటలతో ఇంటి ముందు, పెరటిలో మొక్కలు నాటేవారు గ్రామస్తులు. ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ మొక్కలు నాటించేవాళ్ళు ఇద్దరూ.
అదలా ఉండగా ఆ ఊరుకి దగ్గరలో ఒక కర్మాగారం స్థాపిం చాలని నిర్ణయించింది ప్రభుత్వం. యంత్రపరికరాలు, సరుకులు పంపడానికి వాహనాలు తిరగడానికి వూరు మధ్య ఉన్న రహదారి విస్తరించాలని, తారు రోడ్డు వెయ్యాలని అధికారులు వచ్చారు. అలా చేస్తే చాలా వేప చెట్లు, చింత చెట్లు తొలగించాలి. ఆ చెట్లను నరికించడానికి సిద్ధమయ్యారు. ఊరిలోని యువకులు “అభివృద్ధి అంటే రోడ్లే కదా” అనుకుని పట్టించుకోలేదు.
రామయ్య తాత మాత్రం చెట్ల నీడలో నిలబడి బాధగా చూసాడు. సరిగ్గా అప్పుడే రాజయ్య మాష్టారు వచ్చారు. జరుగుతున్నది ఆపాలని నిర్ణయించుకుని “ఇన్ని చెట్లు నరికేసి రోడ్డు విస్తరణ చెయ్యాలా? దానికి బదులు వూరు చుట్టూ ఉన్న మరో దారిని వాడుకోవచ్చు కదా. పచ్చదనాన్నిచ్చే చెట్లను నరికేసి చేసే అభివృద్ధి వద్దండి” అన్నారు.
అక్కడున్న అధికారులు “కర్మాగారం ప్రారంభిస్తే మీ వూరి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. మీరు అడ్డుకుంటే ఎలా” అన్నారు.
“ మీ పనులకు అడ్డు రావడం లేదు. మరొక దారిని అభివృద్ధి చేసి దీన్ని వదిలెయ్యమని , చెట్లను నరికే పని ఆపమని అడుగుతున్నాము “ అన్నారు మాష్టారు.
“అది మా చేతిలో లేదు. మీరు చెప్పినంత సులువు కాదు. కావాలంటే మంత్రిగారిని లేదంటే కలెక్టర్ గారిని కలిసి మీ సమస్య చెప్పండి. రెండు మూడు రోజులు పనులు ఆపుతాం. అప్పటికి ఆదేశాలు రాకపోతే దీన్నే అభివృద్ధి చేస్తాం” అన్నారు అధికారులు.
సరేనని చెప్పి ఊరందరినీ సమావేశపరచారు మాష్టారు. “అంతెత్తు ఎదిగిన చెట్లను నరకడమంటే అంది వచ్చిన పిల్లలను చంపుకోవడమే . మనమంతా కలసి ఒకే అభిప్రాయంతో ఉండాలి. చెట్లను నరకడం ఆపాలి. ఇప్పటికే భూతాపం పెరిగిపోయింది. వాతావరణంలో వేడి పెరిగి ఉక్కపోత ఎక్కువయింది.అప్పటితో పోల్చుకుంటే వర్షాలు తగ్గాయి. చెరువుల్లో, బావుల్లో నీరు అప్పటిలా నిండుగా లేదు. అందుకని మన వూరు ప్రక్క నుండి వెళ్లే మరో దారిని అభివృద్ధి చెయ్యమని అడుగుదాం. నేను దరఖాస్తు రాస్తాను. మీరంతా సంతకాలు చేయండి. సర్పంచ్ , పంచాయతీ మెంబర్లతో కలసి నేను వెళతాను. పెద్దలని ఒప్పిద్దాం “ అన్నారు.
చాలాసేపు తర్జన భర్జనలు జరిగాక మాష్టారి ఆలోచనను సమర్ధించారు గ్రామస్తులు. అనుకున్నట్టే విజ్ఞాపన పత్రం రాసి మంత్రిగారికి , కలెక్టర్ గారికి ఇవ్వడంతో గ్రామస్తుల కోరిక తీరింది. రాజయ్య మాష్టారు , రామయ్య తాతల సంతోషానికి అంతులేకపోయింది.
కొన్నాళ్ల తరువాత ఆ వూళ్ళో కమ్యూనిటీ హాల్ కట్టాలని పెద్దలు నిర్ణయించారు. దానికి అడ్డంగా రామయ్య తాత నాటిన చెట్టు ఉండటంతో తొలగించాలని చూసారు. దానికి అడ్డుపడ్డ రామయ్య తాతతో “ఒక్క చెట్టు పోతే ఏమవుతుంది? హాల్ వస్తే అందరికీ ఉపయోగం కదా!” అని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.
తాత ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లి తన పాత డైరీ తెచ్చి చూపించాడు. అందులో చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి చెట్టు నాటిన ఫోటో ఉంది. “ఇది నా తండ్రితో కలసి నాటిన చెట్టు. దీనిని ఇలాగే ఉండనివ్వండి. కావాలంటే చెట్టు చుట్టూ మీరనుకున్న హాలు నిర్మించండి” అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు.
రాజయ్య మాస్టారు “అతను చెప్పినట్టు చెయ్యండి. చెట్లు నరికితే, రేపు ఎండలు ముదిరినప్పుడు ఏ.సీ. లు కాపాడతాయా? మీ నాన్నలు ఇక్కడే ఆడుకున్నారు. మీరు కూడా చెట్టు చుట్టూ ఉన్న కమ్యూనిటీ హాలులో చదువుకోండి. ఆడుకోండి” అనడంతో ఆయన మీదున్న గౌరవంతో ఒప్పుకున్నారు.
మరోసారి ఊర్లో చిన్న పిల్లవాడికి శ్వాసకోస సమస్య వచ్చింది. ఆక్సిజన్ సిలిండర్ కోసం పట్టణానికి పరిగెత్తారు.
రామయ్య తాత అక్కడున్న పిల్లలను పిలిచి “చూశారా, ఒక్క సిలిండర్ కోసం పట్టణానికి వెళ్తున్నారు. మనం నాటిన చెట్లు ఉచితంగా ఎన్ని సిలిండర్లు ఆక్సిజెన్ ఇస్తున్నాయో. అందుకే చెట్లను నరకకూడదు అని చెబుతుంటాను. చెట్లు నరుక్కుంటూ పొతే భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కోవాలి” అని చెప్పారు.
ఆ మాటలు వారిని ఆలోచనలో పడేశాయి.
“అయితే మనమంతా కలసి చెరువు గట్టు మీద వంద మొక్కలు నాటుదాం” అన్నారు పిల్లలు. వాళ్లంతా కలసి మొక్కలని నాటారు.
శ్రద్ధగా వాటిని సాకడంతో కొన్నాళ్లకే మొక్కలు పెరిగి ఆ ఊరు పచ్చని తోటలా మారింది.
మరి కొన్నేళ్ళలో వూళ్ళో చాలా మార్పులు వచ్చాయి.
తరచూ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, బావుల్లో నీళ్లు పెరిగి పొర్లాడుతున్నాయి.ఎక్కెడిక్కడి నుండో రకరకాల పక్షులు వచ్చి ఊరి వాళ్లకి సందడితో బాటు కనువిందు చేస్తున్నాయి. నీరు పుష్కలంగా ఉండడంతో పంటలు బాగా పండుతున్నాయి.చల్లదనం పెరగడంతో విద్యుత్ ఉపకరణాలు వాడకం తగ్గింది. డబ్బు పొదుపు అయ్యేది. స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల రోగాలు తగ్గాయి.
ఒక సాయంత్రం వేళ రాజయ్య మాస్టారు, రామయ్య తాతలు చెట్ల కింద కూర్చుని అక్కడ ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ “చూడండర్రా ! మనం నాటిన మొక్కలే ఇంత పెద్ద చెట్లు అయ్యాయి. వర్షాల్ని తెచ్చాయి. పచ్చదనం పెరగడంతో పక్షులు వస్తున్నాయి. కమ్యూనిటీ హాల్ సభలు కూడా చెట్టు నీడలోనే జరుగుతున్నాయి. అభివృద్ధి అంటే చెట్లతో కలిసి పెరగడమే అని తెలుసుకోండి” అన్నారు.
అవునన్నట్టు పిల్లలు తలాడించారు.
—--*****------
No comments:
Post a Comment