*భట్టివిక్రమార్క కథలు-15*
(శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రం)
88/374
*శూర, జ్ఞాని, సూత కల్పనుల కథ*
(కార్యకారణసంబంధం)
పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోంచి భేతాళుడు, "విక్రమార్కమహారాజా! నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. విను. అంటూ ఇలా ప్రారంభించాడు.
మహిర అనే గ్రామంలో అర్జునశర్మ అనే విప్రుడికి కళ్యాణి అనే అతి చక్కని అమ్మాయుండేది.
ఆమె చక్కదనానికి మెచ్చి శూరుడు, జ్ఞాని, సూత్ర కల్పనుడు - అనే ముగ్గురు బ్రాహ్మణ కుమారులు అర్జునశర్మ యింటికి వచ్చి కళ్యాణినిచ్చి వివాహం చేయమని అతనిని కోరారు. అందుకా -పిల్ల తండ్రి "ఒకడికి పలువురు పత్నులుండవచ్చుకాని ఒకతెకు ఎక్కువమంది పతులుండడం ధర్మవిరుద్ధం, ప్రమాదకరం.
ద్రౌపదికి లేరా అంటే దానికి కారణంవేరు. మీలో ఎవరికైనా సరే ఒకరికి మా కళ్యాణినిస్తాను. ఎవరు అనేది మీరు నిశ్చయించుకుని చెప్పండి.” అన్నాడు.
వాళ్ళు ముగ్గురూ నా కంటే నాకని కలహించుకోసాగారు.
అంతలో ఆకస్మికంగా ఆకాశంలోంచి ఒక రాక్షసుడొచ్చి కళ్యాణిని ఎత్తుకుపోయాడు. అది చూసి ఆమె తల్లితండ్రులు రోదించసాగారు. ఆమెను వివాహమాడాలని వచ్చిన వారు విచారించసాగారు.
వారిలో - జ్ఞాని - " ఆ రాక్షసుడామెను ఎక్కడ పెట్టాడో నేను జ్ఞాన దృష్టితో కనుక్కుని చెప్పగలను. కాని ఆమెని తీసుకురావడం మాత్రం నావల్ల కాదు." అన్నాడు.
అదివిన్న సూత్రకల్పనుడు "అలా అయితే - ఆకాశంలో వాయువేగంతో వెళ్ళగల మాయారథాన్ని నేను సృష్టించి యివ్వగలను. అంతే తప్ప రాక్షసుణ్ణి' జయించడం నా తరం కాదు." అన్నాడు.
వారిద్దరి మాటలూ విన్న శూరుడు - "మీరు ఈ సాయాలు చేస్తే నేను రాక్షసుణ్ణి జయించి కళ్యాణిని తెస్తాను." అన్నాడు.
వాళ్ళు సరే అన్నారు.
జ్ఞాని యోగ దృష్టితో రాక్షసుడున్న చోటు చెప్పగా సూత్రకల్పనుడు ఆకాశంలో వెళ్ళే రథాన్ని సృష్టించాడు. శూరుడు ఆ రథమెక్కి రాక్షసుడున్న చోటుకి వెళ్ళి రాక్షసుణ్ణి చంపి కళ్యాణిని తెచ్చి ఆమె తల్లితండ్రుల వద్ద వదిలాడు.
ఆమెను పెళ్ళి చేసుకుందు కాముగ్గురిలోనూ ఎవరు తగినవారనే నిర్ణయం ధర్మజ్ఞులకే వదిలిపెట్టబడింది.
భేతాళుడు. విక్రమార్కమహారాజా! నువ్వు ఆలోచించి చెప్పు.” అన్నాడు
అందుకు విక్రమార్కుడు - "భేతాళుడా! జ్ఞాని, సూత్రకల్పనుడు తమ విద్యాప్రభావాన్ని కనబరిచారుకాని మరేమీ వారివల్ల కాలేదు.
కాని శూరుడు ప్రాణాలకు తెగించి ఘోరంగా పోరాడి రాక్షసుణ్ణి చంపి కళ్యాణిని తెచ్చాడు. కనుక అతనే ఆమెను చేపట్టదగినవాడు.” అని చెప్పాడు.
విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగుచెట్టు కొమ్మకి తలకిందులుగా వ్రేలాడసాగాడు.
విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.
*సత్యవంతుని కథ*
పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి భేతాళుడిని తాళ్ళతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోంచి భేతాళుడు, "విక్రమార్కమహారాజా! నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. విను. అంటూ ఇలా ప్రారంభించాడు.
అబ్జపురమనే పట్నం ఉండేది. వంశకేతుడనేవాడు దానికి రాజు.
ఆ పట్నానికి దగ్గరలో ఉన్న భద్రకాళి గుడికి ఆరాజు గోపురం, మంటపం, ప్రాకారాలూ కట్టించి ప్రతిసంవత్సరమూ మహావైభవంగా ఉత్సవం జరిపించేవాడు. ఆ ఉత్సవానికి చుట్టుపక్కల చాలా దూరం నుంచి వేలకొద్దీ జనం చూడడానికి వచ్చేవారు.
అలా చాలా సంవత్సరాలు గడిచాక ఒకసారి ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎప్పటికంటే చాలా ఎక్కువమంది జనం వచ్చారు.
వారిలో సత్యవంతుడనే వాడు - అక్కడికి వచ్చిన రత్నాంగిని చూశాడు. ఆమెదీ అతని కులమే. చాలా అందగత్తె. అవివాహిత. దానిని పెళ్ళి చేసుకుని కామభోగాలనుభవించని వాడిదేం జన్మ?' అనుకుని - కాళికి నమస్కరించి “ఓ ఆదిశక్తీ! వన్నెలాడి రత్నాంగి నాకు భార్యఐతే నా కంఠం తెగవేసి నీకు బలి అవుతాను." అని ప్రార్థించాడు.
తరవాత రత్నాంగి వెంట ఉన్నవారి ద్వారా ఆమె నివాసమూ, తల్లితండ్రుల వివరాలు తెలుసుకుని తన యింటికి వెళ్ళాక తగిన వారిని రత్నాంగి తల్లితండ్రుల వద్దకు పంపాడు.
రాయబారులు చక్కగా మాట్లాడడంతో, వారు తమ కూతురి నివ్వడానికి అంగీకరించడమేకాక అప్పుడే ముహూర్తం పెట్టేశారు. సత్యవంతుడామెను పెండ్లాడి ఒకనెల - అత్తవారింట్లో ఉండి భార్యని వెంటపెట్టుకుని తనవూరు వచ్చేశాడు.
కొన్నాళ్ళు గడిచాక రత్నాంగి తల్లితండ్రులు తమయింట్లో ఏదో పండుగ చేయదలచి తమ కుమారుడు భద్రుడనేవాడిని "వెళ్ళి అక్కాబావలని తీసుకురా.” అని పంపారు.
అతను వెళ్ళి వారిని తీసుకువస్తూండగా మునుపటి కాళికాలయం వద్దకు వచ్చేసరికి ఎండ ఎక్కువగా ఉండి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టునీడన ఆగారు.
అప్పుడు సత్యవంతుడికి తాను మునుపు చేసిన ప్రార్ధన, మొక్కుచెల్లించాలని గుర్తుకొచ్చి నీళ్ళు తాగివస్తానని భార్యకీ, బావమరిదికీ చెప్పి ఆలయంలోకి వెళ్ళి బలిపీఠం వద్ద నిలచి “ఓ పరాశక్తీ! ఇదుగో... నీ మొక్కు చెల్లిస్తున్నాను." అంటూ మెడ నరుక్కుని నేల కూలిపోయాడు.
బావవెళ్ళి ఎంత సేపయినా తిరిగి రాకపోడంతో అతన్ని తీసుకురాడానికి గుడికి వచ్చి.. అక్కడ తల తెగిపడున్న బావని చూసి -"అయ్యో ఈ దుఃఖవార్త అక్కకి నేనెలా చెప్పగలను?" అంటూ అతను కూడా అదే కత్తితో తల నరుక్కుని ప్రాణాలు వదిలాడు.
వాళ్ళిద్దరూ ఎంతసేపటికీ తిరిగిరానందుకు కారణం తెలియని రత్నాంగి గుడికి వచ్చి - అక్కడ ప్రాణం పోయిపడున్న వారిని చూసి - 'ఛీ! ఇంక నాకీ బతుకెందుకు? ప్రియమయిన భర్తా, ముద్దుల తమ్ముడూ పోయిన చోటుకే నేనూ పోతాను.' అని నిశ్చయించుకుని వారు తలలు నరుక్కున్న కత్తితోనే తానూ కంఠం ఖండించుకోబోయింది.
ఆ సమయంలో కాళికాదేవి ప్రత్యక్షమై.. "వద్దు.. సాహసింపకు.” అంటూ ఆమె చెయ్యి పట్టుకుని.. ఆమె నోదార్చి.. "కావలసిన వరం అడుగు." అంది.
రత్నాంగి సంతోషిస్తూ ." . "నా మగడూ, తమ్ముడూ మళ్ళీ జీవించేటట్లూ చెయ్యి
అని కోరుకుంది
కాళిక కనికరించి.. "అలాగే వారి శిరస్సులనీ శరీరాలనీ కలిపి ఉంచు." అంది.
తొందరలో తడబడి రత్నాంగి తమ్ముడి తలని మగడి శరీరానికీ, మగడి తలను తమ్ముడి శరీరానికీ చేర్చింది. వాళ్ళని బతికేలా చేసి కాళిక మాయమైపోయింది. తరువాత రత్నాంగి వాళ్ళని చూసి తాను చేసిన తెలివి తక్కువ పనిని గుర్తించి ఎంతో చింతించింది.
విక్రమార్కమహారాజా! వారిలో రత్నాంగికి ఎవడు మగడవాలి?" అని అడిగాడు భేతాళుడు.
విక్రమార్కుడు కొంచెం ఆలోచించి - "భేతాళా! శరీరానికి ప్రధానమయినది శిరము. వాళ్ళిద్దరిలో ఎవడు రత్నాంగిని చూసి భార్యగా భావిస్తాడో వాడే ఆమె భర్త అవుతాడు.” అన్నాడు.
విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి మోదుగచెట్టు కొమ్మకి తలకిందులుగా వ్రేలాడసాగాడు.
విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.
(సశేషం)
No comments:
Post a Comment