Thursday, August 20, 2026

 గత చరిత్ర

“రేపు ఆఫన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు?" కొంచెం కోపాన్ని మిళితం చేసి సంధించిన ప్రశ్నకి నీళ్ళూ, వక్కపొడీ కలిపి నముల్తున్నాను.

“నువ్వలా ఈడీవాళ్ళలా ప్రశ్నిస్తే డాడీ ఏంచెప్తారమ్మా? ఆఫ్ ఎప్పుడు తీసుకోవాలా అని సాయంత్రం దాకా డైలమాలోనే వున్నార్ట!" అప్పుడప్పుడు సపోర్టుకొచ్చే పిల్లలు ఆరోజూ వచ్చారు.

మనం ఆఫ్ తీసుకుంటే ఆరోజు ఇల్లు సర్దుకోవడానికి కేటాయిస్తూవుంటాం. ఇది రామాయణకాలంనించీ జరుగుతున్నదే మాయింట్లో.

ఇల్లు సర్దడం విషయంలో ఎన్టీయార్‌కి లక్ష్మీపార్వతిలా వుంటుంది నా సహాయం. ఆ సహాయం పనికొచ్చేదో, పనికిరానిదో చెప్పడం కష్టం. బయటివాళ్ళకి చూస్తే సాయంలాగే అనిపిస్తుంది. తనకి మాత్రం నేను తన పనికి అడ్డం పడుతున్నట్టు అనిపిస్తుంది.

పిల్లలు ఇప్పుడంటే పెద్దాళ్ళైపోయారుగానీ చిన్నప్పుడు ఏం ఏడిపించారని! స్కూల్నించి రాగానే యూనిఫారాలు మార్చమని చెవినిల్లు కట్టుకుని పోరినా చలించేవారు కాదు. 

ఒకవేళ మార్చినా మా రెండోవాడు పాము కుబుసం విడిచిపెట్టినట్టు ఎక్కడ విప్పితే అక్కడే వదిలేసేవాడు బట్టలు! ఉతకాల్సిన బట్టలకోసం ఓ బుట్టుంటుందనీ, అందులోనే వెయ్యాలని చెప్పి చెప్పి అలిసిపోయాం.

ఇక మన సంగతి. స్వతహాగా పుస్తకాల పురుగునవడంవల్ల ఇంట్లో చాలా పుస్తకాలుంటాయి. వాటిలో పనికిరాని చెత్తంతా ఏరేసి పాత పేపర్లవాడికి ఇచ్చేద్దామని తను, ‘అలా ఎలా ఏరేస్తాం?' అని నేనూ కాశ్మీర్ సమస్యలా చాలాకాలంనించీ నానుస్తున్నాం.

పోనీ కష్టపడుతోందికదా సాయంచేద్దామని చిన్న స్టూల్ తెచ్చుకుని పై అల్మారాలు సర్దుతోంటే...‘పొట్టాడా! పొట్టాడానీ! అవి కూడా అందవు! ఓసారి అద్దంలో చూస్కో!' అంటూ ర్యాగింగ్!

మనకి కొన్ని సరదాలున్నాయి. ఇల్లెప్పుడూ ఒకేలా ఉంటే నచ్చదు నాకు. ఏదో మొనాటనీ కనబడుతుంది. అంచేత తిరపతి కొండమీద ఆఫీసులు మాటిమాటికీ మార్చేసినట్టు మాయింట్లో వస్తువులన్నిటివీ వాటివాటి స్థానాల్ని మార్చేస్తూవుంటాను.

ఓ రెండు నెలలు కంప్యూటర్‌ టేబుల్ హాల్లో ఉంటే తరవాత బెడ్రూంలోకి చేరుతుంది. మాకిద్దరికీ పెద్దగా ట్రాన్స్‌ఫర్లు లేవుగానీ దానికిమాత్రం తరచూ బదిలీలే!

మంచాల్ని వేరే దిశలోకి మార్చడం, ‘అచ్చం నీమొహంలా వుంది!' అని తనన్న తరవాత మళ్ళీ యథాస్థానంలోకి మార్చెయ్యడం చాలాసార్లయింది. అయినా సరదా, దురదా తీరదు మనకి!😜

ఎల్లైసీలు, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులూ...ఇవన్నీ ఇప్పుడంటే టాబ్లెట్లో కట్టిపడేస్తున్నానుగానీ ఒకప్పుడు అవన్నీ గుట్టలుగుట్టలుండేవి ఇంట్లో. ఇక మన ఐటీ రిటర్న్స్, ఆఫీసువాళ్ళిచ్చిన లవ్ లెటర్సూ లక్షల్లో వుంటాయి. ‘ఓసారిలా రండి! నేను మీకు డేట్లవారీగా ఇస్తూవుంటాను. వేటికవి ఒకపక్కగా పెట్టండి!' అన్న పిలుపుతో మనం వింటున్న పాటలు ఆపేసి మొత్తం కాగితాలన్నీ పరుపుమీద పరిచేసేవాణ్ణి.

ఆ పనికి ఎప్పుడూ దుర్ముహూర్తమే సెట్టయేది. మొదలెట్టిన మూడునిమిషాల్లో కేసులున్నాయని ఫోను మోగేది. 

ఆమధ్య మాయింట్లో ఎప్పుడు చూసినా ఒక ఎలక్ట్రీషియనో, ప్లంబరో తిరుగుతూ కనబడేవారు. నేనుకూడా వాళ్ళలో కలిసిపోయి వెనకాల వైర్లవీ మెళ్ళో వేసుకుని చాలా బిజీగా ఇల్లంతా తిరిగేస్తూవుండేవాణ్ణి!

ఇంట్లో రకరకాల లైట్లు, ఫోకస్ లేంప్స్, లేజర్ లైట్లు, ఎల్యీడీ లైట్లు వుంటాయి.....అన్నీ పెడితే దసరాలకి మైసూర్ ప్యాలస్ లావుంటుంది ఇల్లు! అదో సరదా! 

జీవితానికి రంగులద్దుకోమని చెప్పాడుగా అదేదో సినిమాలో! అంచేత మనకి మనమే అలా కలర్‌ఫుల్ గా మార్చేసుకుంటే తుత్తిగావుంటుంది.

ఏఁవంటారు?

                              
..........జగదీశ్ కొచ్చెర్లకోట

No comments:

Post a Comment