Thursday, August 20, 2026

 *_రామమిలాయ రాజపదదీన్హా..!_*

**********************

_తులసీదాసు జయంతి_

✍️✍️✍️✍️✍️✍️✍️

వాల్మీకి రామాయణానికి
నువ్వూ నేనూ చదువుకునే 
రూపమిచ్చి..
సంస్కృతం సంస్కృతి 
చెదరనీయక...
మహర్షి ఇచ్చిన ఆకృతి
చెడిపోకుండా..
అందించిన రామదాసు
మన తులసీదాసు..!

అదెంత భాగ్యం చేసుకుందో
ఆ సరయూ తీరం..
బుల్లి రామయ్య ఆటపాటలకు
అదే మైదానమైంది..
రామరాజ్యానికీ
తానే సాక్ష్యమైంది..
ఆ అలలకు తెలుసు 
రాముని లీలలు..
అక్కడి రేణువులు 
రామయ్య వనవాస నిర్ణయంతో స్థానువులు..
ఆ జలం దాశరథి స్పర్శతో
గంగాజలం..
అలాంటి సరయు ఒడ్డున 
తులసీదాసు చేతి ఘంటం..
కళ్లకు కట్టేసింది
రామాయణంలోని 
ప్రతి ఘట్టం..
అంతటి పట్టాభిషిక్తుడికి 
మరోసారి కడుతూ పట్టం!

_శ్రీ గురుచరణ సరోజరజ_
_నిజమన ముకుర సుదారి.._
ఇలా మొదలయ్యే *హనుమాన్ చాలీసా..*
పాపపంకిలమైన
కలియుగాన 
భక్తి సామ్రాజ్యానికి
_సరిగాపదనిసా..!_
భాషతో ప్రమేయమే లేని
అప్రమేయం..
ఎవరు చదివినా వారి భాషే..
గుండె ఘోషే..
తెలియని భాషే అనుకున్నా
చదువుతుంటే అర్థం అవుతున్నట్టు..
అనర్థాలు తేలిపోతున్నట్టు..
రామయ్యకు చేరువవుతున్నట్టు..
_అందాక హనుమయ్యే_
_చేయి పట్టి నడిపిస్తున్నట్టు.._
*తులసీదాస సదా హరిచేర*
*కీజేనాధ హృదయమహడేరా*
చదివించేది..నడిపించేది
ఆ రాముడేరా..!

ఆలి ప్రేమకు దాసుడై 
గంగనే దాటిన దాసు..
_ఆస్థి చర్మమయ దేహ_
_మను తామేజైసీప్రీతితైసి_
_జో శ్రీరామ_ 
_మహహోతవతౌభవతి.._
*నా దేహమందు చూపే ప్రీతి*
*రామునియందుంటే* 
*భీతి ఉండదుగా* 
అన్న సతి బోధనతో 
_తెలిసి నిరతి.._
_జీవితమే సీతాపతి హారతి!_

వ్యాకులం చెందిన 
ఆ కలం కదిలితే 
*వరవై రామాయణం..*
విరాగి అయిన దాసు
ఆలపిస్తే అది
*వైరాగ్య సందీపనీ..*
*రామచరితమానసం*
తులసీదాసు హృదయోల్లాసం..
భక్తిరసభరితం..
ప్రతి అక్షరం 
రామయ్యకే అంకితం..!

***********************

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
         9948546286
         7995666286

No comments:

Post a Comment