Thursday, August 20, 2026

 *🧘‍♂️వేదాంతం బోధించే జీవన రహస్యం🧘‍♀️*
🧘‍♂️🧘‍♀️

*జీవుడు ఏమి తీసుకెళ్తాడు? — ధనం కాదు... వాసనలే!*

*జీవుడు దేహంలోకి ఎలా ప్రవేశిస్తాడు?* *అతనికి వాసనలు ఎలా ఏర్పడతాయి?*

*ఇది వేల సంవత్సరాలుగా వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు వివరిస్తున్న అత్యంత గంభీరమైన ఆధ్యాత్మిక విషయం.*

*వేదాంతం ప్రకారం జీవుడు నాశనం కానివాడు. శరీరం మారుతుంది కానీ జీవుడు మారడు. జీవుడు తన పూర్వకర్మల ప్రకారం అన్నం ద్వారా తండ్రి శరీరంలోకి ప్రవేశించి, శుక్రకణం ద్వారా తల్లి గర్భంలో చేరి, తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలో జన్మిస్తాడు.*

*పుట్టిన శిశువుకు ఈ జన్మలోని తల్లిదండ్రులు, బంధువులు, ఆస్తులు, పరిచయాలు ఏవీ తెలియవు. అయినప్పటికీ ఆ జీవుడు పూర్తిగా కొత్తవాడు కాదు. అనేక జన్మలలో సంపాదించుకున్న సంస్కారాలు, అభిరుచులు, భయాలు, ఆకర్షణలు, ద్వేషాలు, ఆశలు, అలవాట్లు సూక్ష్మరూపంలో అతనితో పాటు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.*

*అందుకే ఒకే ఇంట్లో, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో కూడా స్వభావం, అభిరుచులు, ఆలోచనా విధానం, ప్రవర్తన పూర్తిగా వేర్వేరుగా కనిపిస్తాయి.*

*సంస్కారం అంటే ఏమిటి?*

మనం చూసే ప్రతి దృశ్యం...
వినే ప్రతి మాట...
చేసే ప్రతి పని...
తినే ప్రతి ఆహారం...
కలిసే ప్రతి వ్యక్తి...
అనుభవించే ప్రతి సుఖదుఃఖం...

*మనస్సుపై ఒక ముద్ర వేస్తాయి. ఆ ముద్రలనే సంస్కారాలు అంటారు. ఒక ఆలోచనను పదేపదే మనస్సులో తిరగబెడితే అది ఇష్టంగా మారుతుంది.*

*ఇష్టం పెరిగితే మమకారం అవుతుంది. మమకారం బలపడితే అది వాసనగా మారుతుంది. ఈ వాసనే మరణం తరువాత కూడా జీవునితో పాటు ప్రయాణిస్తుంది.*

*భగవద్గీత ఏమి చెబుతోంది?*

*శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు.*

*"యం యం వాపి స్మరన్ భావం* *త్యజత్యంతే కలేవరం*
*తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః." (గీత 8.6)*

అంటే...

*జీవుడు చివరి క్షణంలో ఏ భావంతో శరీరాన్ని విడిచిపెడతాడో, అదే భావానికి సంబంధించిన గతిని పొందుతాడు.*

*అంతిమ సమయంలో మనస్సులో ఏది బలంగా ఉంటుందో, అది యాదృచ్ఛికంగా రాదు. జీవితమంతా మనం దేనిపై ఎక్కువగా ధ్యాస పెట్టామో అదే చివరికి గుర్తుకు వస్తుంది.*

*అందుకే జీవితం మొత్తం ఎలా గడిపామన్నదే చివరి క్షణాన్ని నిర్ణయిస్తుంది.*

ఒక కుటుంబ ఉదాహరణ:-

ఒక యువకుడు, యువతి ప్రేమతో వివాహం చేసుకున్నారు.
కొంతకాలానికి భార్య గర్భవతి అని తెలిసింది.
ఆ క్షణం నుంచే ఇంకా జన్మించని బిడ్డపై ప్రేమ మొదలవుతుంది.
నెలలు గడుస్తున్న కొద్దీ ఆ ప్రేమ పెరుగుతుంది.
బిడ్డ పుట్టిన తర్వాత ఆ ప్రేమ మరింత బలపడుతుంది.

మొదటి నవ్వు...
మొదటి అడుగు...
మొదటి మాట...
మొదటి పాఠశాల...
మొదటి విజయం...

ప్రతి అనుభవంతో మమకారం మరింత గాఢమవుతుంది.

ఈ ప్రేమ సహజమైనదే. కానీ అది దైవార్పణ భావంతో లేకుండా "ఈ బిడ్డే నా ప్రపంచం" అనే స్థాయికి చేరితే, అదే బలమైన వాసనగా మారుతుంది.

ధనం విషయంలో కూడా ఇదే జరుగుతుంది కొంతమంది జీవితమంతా డబ్బు సంపాదించడానికే వెచ్చిస్తారు. ధనం అవసరమే. కానీ "ఇదంతా నాదే" అనే భావం పెరిగితే అది ధనాసక్తిగా మారుతుంది.

శరీరం విడిచినప్పుడు బ్యాంకు ఖాతాలు రావు. బంగారం రాదు.
భూములు రావు. కానీ ధనంపట్ల ఉన్న మమకారం మాత్రం జీవునితో పాటు వెళ్తుంది. ఆస్తి విషయంలో కూడా ఇదే . "ఈ ఇల్లు నాది."
"ఈ పొలం నాది.", "ఈ స్థలం నాది." . ఈ భావన ఎంత బలపడితే అంత బలమైన వాసన ఏర్పడుతుంది.. 

అందుకే వేదాంతం "ఉపయోగించు... కానీ బంధించుకోకు" అని చెబుతుంది.

వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది వాసనలే. సంగీతం మీద ఆసక్తి ఉన్నవారికి సంగీత వాసన. పుస్తకాలు చదివేవారికి జ్ఞాన వాసన.. ఎప్పుడూ దైవస్మరణ చేసేవారికి భక్తి వాసన.. ఇతరులకు సహాయం చేసేవారికి సేవా వాసన. కోపాన్ని పెంచుకున్నవారికి కోప వాసన. మద్యానికి బానిసైనవారికి వ్యసన వాసన. లోభం పెంచుకున్నవారికి లోభ వాసన. అందుకే మన అలవాట్లే మన భవిష్యత్తును నిర్మిస్తాయి.

ఒక అద్భుతమైన ఉపమానం

ఒక గుడ్డలో ఎండుచేపలు నాలుగు రోజులు కట్టి ఉంచండి. తర్వాత చేపలను తీసేయండి. చేపలు లేవు. కానీ వాసన మాత్రం లాగే ఉంటుంది. ఎన్నిసార్లు ఉతికినా వెంటనే పోదు. మళ్లీ మళ్లీ శుభ్రం చేసినప్పుడు మాత్రమే క్రమంగా తగ్గుతుంది. 

అలాగే జీవుడు కూడా కోట్లాది జన్మలుగా ఎన్నో వాసనలను మోస్తూ వస్తున్నాడు. అవి ఒక్కరోజులో పోవు. మరి వాటిని శుభ్రం చేసే సబ్బు ఏమిటి? అది బాహ్య సబ్బు కాదు. అది జ్ఞానం.

భగవద్గీత. వేదాలు. ఉపనిషత్తులు. రామాయణం. మహాభారతం., భాగవతం. సత్సంగం. దైవనామస్మరణ., ధ్యానం., నిష్కామకర్మ., ఆత్మవిచారం. ఇవే మనస్సును క్రమంగా శుద్ధి చేస్తాయి.

మన జీవిత లక్ష్యం ఏమిటి?

కుటుంబాన్ని ప్రేమించాలి. కానీ బంధించుకోకూడదు, ధనాన్ని సంపాదించాలి. కానీ ధనదాసుడిగా మారకూడదు.

ఆస్తిని కాపాడాలి, కానీ అహంకారానికి కారణం చేయకూడదు. పదవిని నిర్వహించాలి. కానీ దానితో తన వ్యక్తిత్వాన్ని కొలవకూడదు. 
ప్రేమ ఉండాలి., మమకారం తగ్గాలి. కర్తవ్యం చేయాలి. ఫలితాన్ని భగవంతునికి అర్పించాలి.

చివరికి మనతో వచ్చేది ఏమిటి?

శరీరం కాదు... ధనం కాదు... ఆస్తి కాదు... పేరు కాదు... పదవి కాదు., బంధువులు కాదు...

మనతో వచ్చే ఒక్కట, మన కర్మలు... మన సంస్కారాలు... మన వాసనలు. అందుకే ప్రతిరోజూ ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి...

"నేను ఈ రోజు ఏ వాసనను పెంచుకుంటున్నాను? భక్తి వాసనా? జ్ఞాన వాసనా? సేవా వాసనా? లేక లోభం, కోపం, అహంకారం, మమకారమా?"

ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగిన రోజే ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమవుతుంది.

వాసనలు క్రమంగా క్షీణించినప్పుడు మనస్సు నిర్మలమవుతుంది.

నిర్మలమైన మనస్సులోనే ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది.

ఆత్మజ్ఞానం కలిగిన జీవుడికి జననమరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది.

అందుకే శాస్త్రాలు ఒకటే చెబుతున్నాయి...

"ప్రపంచంలో జీవించు... కానీ ప్రపంచం నీ మనస్సులో నివసించనివ్వకు."

*ఇదే వేదాంతం బోధించే జీవన రహస్యం.*
 *ఆధ్యాత్మిక కుటుంబం*                      

No comments:

Post a Comment