Thursday, August 20, 2026

 *_ఆమె నట ప్రయాణం.._*
*_నటనతో ప్రణయం.._*
*_పాత్రలతో పరిణయం..!_*

(మహానటితో
మాటా మంతి..)

*ఎలిశెట్టి సురేష్ కుమార్*
        విజయనగరం

సినిమా కళాకారులు
తెరపై కనిపించే బొమ్మలు కాదు..
ఒక దీక్ష..
ఒక సంకల్పం..
ఒక తపన..
ఒక అంకితభావం..
వీటన్నిటినీ మించి
తనను తాను కళామతల్లికి
సమర్పణ చేసుకోవడం..
ఇవన్నీ నేను చేసాను గనుకనే..జీవిత పర్యంతం
పాటించాను గనుకనే
కథానాయికగా అన్ని సినిమాలు చేసి..అంతకాలం పాటు తారాపధంలో కొనసాగగలిగాను..

చిత్రపరిశ్రమలోకి నాయికగా
వెళ్లాలనుకునేవారికి..అక్కడ 
స్థిరపడాలని లక్ష్యంగా
పెట్టుకునే వారికి ఒక 
పాఠంగా అనిపించే
ఈ గొప్ప అనుభవాన్ని
చెప్పింది ఎవరో తెలుసా..

మరపురాని కథ..
సుఖదుఃఖాలు..
కృష్ణవేణి..ప్రేమనగర్..దసరాబుల్లోడు.. జీవనజ్యోతి
వంటి ఎన్నో అద్భుత సినిమాలలో నటించి..
సావిత్రి తర్వాత అంతటి మహానటిగా పేరుగాంచిన
ప్రేమనగర్ లత..
దసరాబుల్లోడు రాధ..
*వాణిశ్రీ..!*

అంతటి మహానటితో
సుమారు గంటసేపు
టెలిఫోన్లో మాట్లాడే అదృష్టం ఈ స్వాతంత్ర్యదినోత్సవం నాడు నాకు కలిగింది.
ఈ సంభాషణ సందర్భంగా వాణిశ్రీ ఎన్నో విషయాలు..
సినిమాలు చేస్తున్నప్పుడు
తనకు ఎదురైన అనుభవాలు..పాత్రపోషణ కోసం తీసుకున్న జాగ్రత్తలు..
పాత్రలో లీనమై నటి కనిపించకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా 
తీసుకున్న జాగ్రత్తలు..
వంటి ఎన్నో గొప్ప విషయాలను..
చెక్కు చెదరని 
తన స్వరంలో..
ఇప్పటికీ మారని 
ఆ చిరస్మరణీయ మాడ్యులేషన్లో ..
ఒక్క చిన్న విషయం కూడా మరిచిపోని అద్భుతమైన
జ్ఞాపక శక్తితో చెబుతూ ఉంటే..ఫిదా..!

ఆ రోజుల్లో స్టూడియోల్లో
ఇన్ని సౌకర్యాలు ఉండేవి కావు..ఇంత కృత్రిమత కూడా లేదు..దర్శకుడు చెప్పింది వినడం..ఆయన 
ఆశించిన దాని కంటే..
చుట్టూ ఉన్న సహనటులు..
టెక్నీషియన్లు ఊహించిన దాని కంటే ఎంత గొప్పగా
చెయ్యాలి..ఇదే లక్ష్యం..
అదే దృష్టి..

దిగ్దర్శకులైన 
కె ఎస్ ప్రకాశరావు..
వి మధుసూదన రావు..
విశ్వనాథ్..బాపూ
వంటి వారు చెప్పిన సూచనలు నా నట జీవితంలో నన్ను ఎంతో ముందుకు తీసుకువెళ్లాయి.
వాటితో పాటు..నా దీక్ష.. పట్టుదల..సినిమాని ఒక యజ్ఞంలా భావించి..
ప్రతి పాత్రను ఒక వరంగా
పరిగణించి ముందుకు సాగిన విధానమే నేను
అంత సుదీర్ఘ కాలం పాటు 
కథానాయికగా కొనసాగేలా చేశాయి..షూటింగ్ కి వెళ్ళి..
పాత్రలోకి ప్రవేశిస్తే నాలోని
వాణిశ్రీ నా నుంచి మాయమై పోయేది..అప్పుడు కృష్ణవేణి..లత..భాను..రాధ
మాత్రమే.. 
మిగిలిన ప్రపంచాన్నే మరచిపోయేదాన్ని..
ఇంకా చెప్పాలంటే 
కృష్ణవేణి వంటి
పాత్రల ప్రభావం ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు ఉండేది..

అభినయంతో పాటు పాత్రకు తగిన అలంకరణ..
ఆహార్యం..వీటన్నింటిపై
మనసుని లగ్నం చేసినందు వల్లనే అంత సుదీర్ఘకాలం పాటు నాయికగా కొనసాగి..
ఎన్టీఆర్..అక్కినేని,జగ్గయ్య
కృష్ణ..శోభన్ బాబు..
కృష్ణంరాజు..హరనాథ్ వంటి గొప్ప నటులతో సమానంగా తెరను పంచుకునే అదృష్టం కలిగిందని వాణిశ్రీ చెప్పారు.
సెట్లోకి వెళ్తే అందరం కలిసి కూర్చుని ఉన్నా..పెద్దగా మాటాడుకోడానికి సమయం ఉండేది కాదని..దర్శకుడు చెప్పింది ఎలా చెయ్యాలి..
ఎంత బాగా ఒప్పించాలి..
వీటిపైనే అందరి దృష్టి ఉండేదని ఆమె చెప్పారు.
రామారావు..శివాజీగణేశన్..
కృష్ణ..శోభన్ బాబు వంటి హీరోలు ఎక్కువగా మాట్లాడేవారు కాదు..
అక్కినేని మాత్రం కలివిడిగా
ఉంటూ ఏం వాణి..ఇలా చేద్దామా..సీన్ ఖచ్చితంగా
బాగుండాలి అనే వారు.

ఒక మహానటిగా అంత కాలం అన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు కదా..
ఈ ప్రయాణంపై మీరు ఏమని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు..ఇదేమి నా గొప్ప కాదు..ఒకరకంగా కళామతల్లి తన చల్లని కరుణను నాపై ఎక్కువగా
చూపించింది.సావిత్రి.. జమున..భానుమతి..
అంజలీదేవి.. బి సరోజ వంటి సీనియర్లు హీరోయిన్ పాత్రలకు దూరంగా జరిగిన 
సమయానికి నేను హీరోయిన్ అయ్యాను..
వచ్చిన అవకాశాన్ని ఒక అదృష్టంగా..కళామతల్లికి చేసే సేవగా భావించి
నిబద్ధతతో నటించడం వల్లనే అంత గొప్ప పాత్రలు 
నన్ను వెతుక్కుంటూ వచ్చాయి..అలా వచ్చిన ప్రతి పాత్రకు శక్తివంచన లేకుండా న్యాయం చేయడం వల్లనే ప్రజల అభిమానాన్ని చూరగొనగలిగాను..

తెలుగు ప్రేక్షకులు సంవత్సరాల పాటు..
ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ
నాపై అభిమానం చూపిస్తున్నారంటే అది
నా సుకృతం..కళామతల్లి
నాకు ఇచ్చిన గొప్ప వరమని 
వాణిశ్రీ అన్నారు.

నిజానికి ఇది ఇంటర్వ్యూ కాదు..ఒక అభిమాని తాను చిన్నతనం నుంచి ఆరాధించిన గొప్ప నటీమణితో జరిపిన
ఆత్మీయ సంభాషణ..
అంత గొప్ప నటి..ఎటువంటి భేషజం లేకుండా మాట్లాడిన తీరు అద్భుతం..
ఆమె మాట గలగలా గోదారి..మనసు నిష్కల్మష గంగ.. నైజం అలివేణి..
విరిబోణి కృష్ణవేణి...
అంత పెద్ద ఆర్టిస్ట్ ఇంట్లో మనిషిలా మాటాడడం నిజంగా అబ్బురం అనిపించింది..

No comments:

Post a Comment