Thursday, August 20, 2026

 లేదు అనలేకపోవడం బలమా, బలహీనతా?


దేహీతి వచనం కష్టం,
నాస్తీతి వచనం తధా,
దేహినాస్తీతి మద్వాక్యం,
మాభూజ్జన్మజన్మనీ "

" దేహి అనడం ఎంత కష్టమో, లేదు అనడం కూడా అంతే కష్టం. జన్మజన్మలకు ఈ రెండుపదాలు నా నోటినుంచి రాకుండా చూడు ( తండ్రీ పరమేశ్వరా )" అని అర్ధం.

దేహీ అనేది లేకుండా చూడమని కోరుకోవడం బాగానే ఉంది కాని, లేదు అన్నది అనడం సుఖమయ జీవితానికి కొంత అవసరమే.

దేహీ అన్నది చాలామంది జీవితాల్లో వాడకం తక్కువే కానీ ఈ " లేదు " అనే పదం చాలా సందర్భాల్లో అవసరమవుతుంది.

ప్రవచనకర్తలు తరచుగా చెబుతూంటారు " లేదు అన్నది మనిషికి చాలా అవసరమైన పదం. అవసరమైనచోట లేదు అని చెప్పగలిగే ధైర్యం అలవరుచుకోవాలి, అప్పుడే జీవితం ఆనందదాయకమవుతుంది " అని.

అది నిజమని అందరికీ తెలిసిన విషయమే. దైనందిక జీవితంలో " లేదు " అని చెప్పవలసి ఉన్నా చెప్పలేక చాలా సతమతమవుతాం. శక్తికి మించిన బరువుని తలపై వేసుకుంటాం. ఇంట్లోవారికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాం. ఇంట్లో మాటా మాటా పెరగడం కూడా జరగవచ్చు. చివరకి ఆశ్చర్యకరంగా సహాయం పొందినవారు " నువ్వు ఆరోజు లేదు అని ఉంటే ఈరోజు నేను హాయిగా ఉండేవాడిని ( పరిస్థితుల కారణంగా ) " అన్నా వింతగా అనిపించదు.

ఇది బ్యాంకువారికి కొందరికి బాగా అనుభవం. అప్పు ఇవ్వగానే " మీరు దేముడుసారు, ఎవరూ ఇవ్వడం కుదరదంటే మీరు ఇచ్చి సహాయం చేయడమే కాకుండా నా పరువు కూడా నిలబెట్టారు " అంటాడు. తరువాత ఖ( క )ర్మకాలి ఆ అప్పు అతను కట్టలేకపోతే తీసుకున్న చర్యలకు అదేమనిషి " మీరుకూడా అప్పుడు అప్పు ఇవ్వను అని ఉంటే నాకీ దరిద్రం తప్పేది ఇప్పుడు " అని తిడతాడు. ఇక్కడ విషయం మానవనైజం గురించి, అప్పు గురించికాదు.

అందుకేనేమో " అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు " అని కూడా సెలవిచ్చారు పెద్దలు. లేదు, నావల్లకాదు అనే మాటలను కూడా నేర్చుకోవాలి సుఖమయ జీవితానికి.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు.

శుభమస్తు

No comments:

Post a Comment