"ధర్మరక్షణ"
అవి ద్వాపర యుగం ముగుస్తున్న రోజులు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. కౌరవులంతా నశించారు. పాండవులు స్వర్గం చేరి పోయారు. శ్రీకృష్ణ పరమాత్మ ఉండడంవల్ల ద్వారక సుభిక్షంగా ఉంది. యాదవులందరికీ గర్వం పెరిగిపోయింది. వారు కొందరు మునీశ్వరులు వస్తుంటే ఒక మగవాడికి స్త్రీ వేషం వేసి గర్భం ధరించినట్లు ఆకృతి సృష్టించి వారి దగ్గరకు తీసుకువెళ్ళి "మునీశ్వరులారా...ఈ స్త్రీకి మగబిడ్డ పుడతాడా, ఆడబిడ్డ పుడుతుందా?" అని ప్రశ్నించారు.
అందులో ఒక ముని వారి అహంభావం గుర్తించి బుద్ధి చెప్పాలనుకుని నిర్ణయించుకుని "మూర్ఖులారా! వీడికి ముసలం పుడుతుంది. ఆ ముసలం మీ యాదవ కులాన్ని నాశనం చేస్తుంది!" అని శపించాడు.
వాడి కడుపున రోకలి పుట్టింది, వాడు చచ్చి పోయాడు. యాదవులంతా కంగారు పడిపోతూ మహారాజు అయిన బలరాముడి వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా వివరించారు. బలరాముడు ఆ ముసలాన్ని అరగదీసి సముద్రంలో కలిపివెయ్యమని ఆజ్ఞాపించాడు.
అలా అరగదీస్తూ వారిలో వారికి కలహాలు పుట్టి యుద్ధం చేసి యాదవులంతా చని పోయారు. రోకలి అరిగిపోయి చిన్న ఈటెగా మిగిలింది.
ఆ విషయం తెలిసిన బలరాముడు ఏం చెయ్యాలో తెలియక శ్రీకృష్ణుడిని పిలిచి "శ్రీకృష్ణా! ఇప్పుడు ఏం చెయ్యాలి?" అని అడిగాడు.
శ్రీకృష్ణుడు చిరునవ్వుతో "అన్నయ్యా! మనం వచ్చిన పని అయిపోయింది. నువ్వు వైకుంఠం వెళ్ళిపో" అన్నాడు.
"మరి నువ్వు...?" అడిగాడు బలరాముడు ఆశ్చర్యంగా.
"నాకు ఒకే ఒక కర్తవ్యం మిగిలి వుంది అన్నయ్యా! అది పూర్తిచేసి నేను వస్తాను" అని చెప్పాడు శ్రీకృష్ణుడు.
బలరాముడు 'సరే'నని నాగరాజుగా మారి పోయి వైకుంఠం వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక తోటలో కాలుమీద కాలువేసి తన కాలి బొటనవ్రేలు ఆడిస్తూ వేచి ఉన్నాడు.
ఒక వేటగాడు సముద్రపు ఒడ్డున నడిచి వస్తుంటే అరిగిపోయి ఈటెగా మిగిలిన ముసలం కనబడింది. మంచి ఈటె దొరికింది అనే ఉత్సాహంతో అది తన అమ్ములపొదిలో పెట్టుకుని వేటకు బయలుదేరాడు. అతనికి తోటలో ఉన్న కృష్ణుడి కాలి వ్రేలు కదులుతున్న పక్షిలా కనబడింది. వెంటనే బాణం వేశాడు. అది పరమాత్మకు గ్రుచ్చుకుంది. పక్షి చిక్కింది అనే ఉత్సాహంతో అక్కడకు వెళ్ళిన ఆతను పరమాత్మను చూసి నిర్ఘాంతపోయాడు.
వెక్కి వెక్కి ఏడుస్తూ "పరమాత్మా...! నే నెంత పాపాత్ముడిని! శ్రీమన్నారాయణుడి అవతారమైన నిన్ను బాణంతో కొట్టానా!!" అంటూ ఆయన పాదాలమీద పడ్డాడు.
శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, లేదు నాయనా! ఏడవకు! నేను నీ గురించే వేచిచూస్తున్నాను” అన్నాడు.
“నా గురించా? ఎందుకు స్వామీ?" అడిగాడు వేటగాడు.
"పూర్వజన్మలో నువ్వు వాలివి. నిన్ను ఎదురుగా ఎవరూ జయించలేరు. మృగయా వినోదం క్షత్రియ కులధర్మం అనే నెపంతో శ్రీరాముడిగా చాటునుంచి నేను సంహరించాను. ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత నాది. అలా ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మంగా నిన్ను చంపాను, కనుక ఈ అవతారంలో నీ చేతే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఈ పాపం నిన్ను అంటదు. రామావతారంలో నాగరాజు నాకు తమ్ముడు లక్ష్మీణుడిగా పుట్టి సేవలు చేశాడు. అందుకే కృష్ణావతారంలో నాగరాజు బలరాముడిగా జన్మిస్తే తమ్ముడిగా నేను పుట్టి సేవలు చేశాను" అని వివరించాడు పరమాత్మ.
ఆ వేటగాడు పరమాత్మలో ఐక్యమయ్యాడు. శ్రీకృష్ణ నిర్యాణంతో ద్వాపర యుగం ముగిసింది.
No comments:
Post a Comment