*_సామరస్యమే అభి"మతం"..!_*
ఈ మతం పాలకుల ఎత్తు..
చరిత్రని తిరగరాయమని
అధికారం చేతికిస్తే..
చరిత్రనే మార్చేసే
యుక్తులు..
దేశాన్ని విచ్చిన్నం చేసే
ఈ దుష్టశక్తులు..
నాడు విభజించి పాలించారేమో తెల్లోళ్ళు..
నేడూ అదే పంథా..
మత ప్రాతిపదికన
మనుషుల్ని వేరు చేస్తూ
పబ్బం గడుపుకుంటున్న
ఏలికలు..
మతం ముసుగులో
అధికార కలుగు నుంచి
వినోదం చూసే ఎలుకలు..
నిజానికి భూమి ఎప్పుడు
పుట్టిందో మతం
అప్పుడు పుట్టలేదు..
మొదటగా జన్మించిన
మనిషికి మతం
వాసన లేనేలేదు..
మరి ఈ మతమెప్పుడు
పుట్టిందో..
అదెప్పుడు
విస్తరించిందో...
మనిషి మనిషిని
వేరు చేసింది..
సరే..ఏది ఎలా ఉన్నా..
నాగరికతతో పాటు
పెరిగింది సామరస్యత..
సమభావం..సమధర్మం..
సమన్యాయం..
ఎవరి మతమూ..
అభిమతము
వారివే అయినా..
నా దేశం సర్వమత సమ్మేళనం..
మేరా భారత్ మహాన్..
అయితే..
రాజకీయం..ఓట్ల వేట..
అధికారకాంక్ష..
మతాల మధ్య చిచ్చు పెట్టి..
ఒక మతంతో ఇంకో మతానికి ముప్పంటూ
విద్వేషాలు రెచ్చగొట్టి..
దూరం పెంచి..
మమతను తుంచి..
పబ్బం గడుపుకుంటున్న
ముష్కరులు..
పండితుల ముసుగు తొడిగిన పామరులు..
నిలువెల్లా విషం
నింపుకున్న పాములు..
ఇదిలా సాగితే..
కులం పేరిట..
మతం ముంగిట..
మనుషులు ఇలా వేరైపోతే..
మనసులు ఇరుకైపోతే..
ఒకనాటికి ఏమి జరిగేనో..
ఊహకు అందని
ఉత్పాతం కాకున్నా..
భయోత్పాతం..
అందుకే..అందుకే..
ఈ అధికార పిపాసులు..
స్వార్థ రక్కసులు..
మతోన్మాద ముష్కరులు..
దేవుడి పేర రాజకీయం
చేసే కుహానా ఆధ్యాత్మికులు..
తలుపు తడితే..
జేబు తడిపితే..
ముద్ద పెడితే..
మోసపోకు..
మమత ముసుగులో మతం..
వేదం చెబుతూ
వేర్పాటువాదం..
రెప్పమాటున రెచ్చగొట్టే
డేగ రెక్కల దగాకోరులు..
నమ్మొద్దు నమ్మొద్దు..
మన మతం మానవత్వం..
మన దేశం అమృతాంతరంగ..
మన అంతరంగం
పవిత్ర గంగ..
ఎవరో చెప్పారని..
కలుషితం కానీయకు
నీ మనసుని..
చేతులారా చంపుకోవద్దు
నీలోని మనిషిని..!
*_సురేష్ కుమార్.._*
No comments:
Post a Comment