Thursday, August 20, 2026

 రోజూ ఊళ్ళోకి సూరీడు రాక మునుపే లేచి పన్లోకి దిగే చెన్నకేశవులు  ఆరోజు మాత్రం బారెడు పొద్దెక్కినా  మంచం దిగలేదు. భార్య రాముడమ్మ లేపినా లేవలేదు. లేసి నేను చేసేదేవుందటా ఇంటిముందు గొడ్డు లేదు. ఊరవతల  పొలమూ లేదు. నేనెక్కడ కష్టపడి పోతానో అని నీ కొడుకులు ఏమీ లేకుండా చేశారుగా. ఇంక లేసి మాత్రం చేసేదేముందంటా అంటూనే లేచాడు

చెన్నకేశవులు కొడుకులిద్దరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. ఊరొదిలి చాన్నాళ్ళే అయింది. ఏ పండక్కో పబ్బానికో  భార్యా బిడ్డలతో  వచ్చి వెళ్తుంటారు. ఈసారి కూడా అలానే వచ్చి వెళ్ళారు. కానీ వెళ్తూ వెళ్తూ ఆస్తులు పంచేసుకుని మరీ వెళ్ళారు. పంపకాల్లో ఎక్కడా గొడవలు లేకుండా చాలా   న్యాయంగా పంచేసుకుని వెళ్ళారు. గొడ్డూగోదా, పొలమూబొట్రా. నగానట్రా, తల్లీదండ్రీ  అన్నింటినీ సమంగా పంచేసుకున్నారు

గొడ్లని అమ్మేశారు. పొలం మగతాకి ఇచ్చేశారు. నగలు కోడళ్ళిద్దరూ,  తల్లీదండ్రిని  కొడుకులిద్దరూ సమంగా పంచేసుకుని ఇంటిని మాత్రం ఉమ్మడిగా  అమ్మకానికి  పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఇంకో నెల్రోజుల్లో ఇద్దరినీ చెరొకరూ వచ్చి తీసుకెళ్తామని చెప్పి వెళ్ళారు.

అదిగో అప్పటి నుండి చెన్నకేశవులుకి మనోవ్యాథి పట్టింది. పుట్టి పెరిగిన ఊరిని దాదాపు నలభై సంవత్సరాలు కలిసి కాపురం చేసిన భార్యనీ వదిలి ఉండలేడు. తల్లి పోయిన తర్వాత తల్లిలా చూసుకుంది.తనతోపాటూ గొడ్డులా చాకిరీ చేసింది. ఇక అంతా సుఖమే అనుకునేంతలో చేరో దిక్కుగా వెళ్ళవలసి వస్తుంది. రావుడూ....రావుడూఅంటూ భార్యని పిలిచాడు ఏందయ్యా  అంటూ వచ్చింది. ఏం చేస్తున్నావ్ అన్నాడు. ఊడుస్తున్నాను అంది. ఏం ఊడుస్తున్నావు ఙ్ఞాపకాలనా. అవి ఎంత ఊడ్చినా అలానే అంటిపెట్టుకుని ఉంటాయి 
గానీ  వాటిని ఊడవటం మానెయ్.
అన్నాడు  
లేదయ్యా ఈ ఇంటితో నాకున్న ఙ్ఞాపకాలను పోగు చేసి మూట* కట్టుకుంటున్నాను. అక్కడ నా ఒంటరితనాన్ని పోగొట్టాల్సింది అవేగా
అంటూ దిగులుగా నవ్వింది.

నా ఙ్ఞాపకాలను కూడా పోగు చేసి మూట కట్టెయ్య లేకపోయావా అన్నాడు చెన్నకేశవులు.
ఈ ఇల్లు నీకేం ఙ్ఞాపకాలను ఇచ్చిందో  వాటిని నువ్వే కదా పోగు చేసు కోవాలి" అంటూ ఇంటిని ఒక్కసారి కలియజూసింది రాముడమ్మ .ఇంట్లోని ప్రతి అడుగు ఒక్కో ఙ్ఞాపకమై కళ్ళ ముందు మెదుల్తుంది 

రావుడూ ! ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం నా చెయ్యి పట్టుకుని నా 
బ్రతుకులో అడుగుపెట్టావు. ఎప్పుడూ ఏదీ కావాలని అడగలేదు. కలిమిలేముల్లో  నా మనసెరిగి మసలుకున్నావు.  ఇప్పుడు దూరం అవుతామనుకుంటే నాప్రాణం నన్నొదిలి వెడుతున్నట్టుంది  అంటున్న చెన్నకేశవుల కళ్ళలో నీటి పొర. 

రాముడమ్మ పరిస్థితీ అంతే .ఎప్పుడూ పన్నెత్తు మాట అనెరుగడు. దేనికీ లోటు చేసెరుగడు. రెండ్రోజులపాటు ఇల్లు దాటి ఎక్కడికైనా వెళ్ళినా పసిబిడ్డ లాగా తనకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలాంటి మనిషి బ్రతికినన్నాళ్ళూ తనని వదిలి ఉండగలడా.

   
ఈ ఇల్లు తనని కొత్త *పెళ్ళి కూతురుగా చూసింది. నిండు చూలాలిగా చూసింది. ఇద్దరు పిల్లల తల్లిలా చూసింది*. అది తనకి ఇల్లులా అనిపించదు. దగ్గరకు తీసుకునే తల్లి లా అనిపిస్తుంది. ఇంటిని వదిలి పెట్టడం చాలా కష్టం. అంతకంటే కష్టం భర్తని వదిలి పెట్టి ఉండటం

కొడుకులు పెట్టిన ముప్పై రోజుల గడువు ముప్పై నిమిషాలై తిరిగివచ్చి ఇంటి ముందు వాలాయి. పంపకాల్లో చిన్నకొడుకు తల్లిని పెద్దకొడుకు తండ్రిని పంచేసుకున్నారు
చిన్నకొడుకు వచ్చేశాడు. అన్నకి సెలవు దొరకలేదు కాబట్టి తనే తండ్రిని  అన్న దగ్గర వదిలేసి అమ్మని మాత్రం తనింటికి తీసుకెళ్ళాలి. అదీ వాళ్ళ ఒప్పందం. వస్తూఉంటే అమ్మ, నాన్న  దగ్గరలో ఉన్న గుడికెళ్ళారని ఎదురుగా ఉన్న బడ్డీకొట్టు సీను చెప్పాడు

ఇంటి వీథి తలుపు తీసి లోనికొచ్చాడు . ఇంటి వైపు చూశాడు. ఎప్పుడూ చూసే ఇల్లే అయినా చాలా అపురూపంగా అనిపిస్తుంది . బహుశా కొన్నాళ్ళ తర్వాత తమది కాకుండా పోతుందన్న బాధవలనేమో. విశాలమైన ప్రాంగణంలో  నిలిచిన గుడిలా గంభీరంగా ఉంది ఇల్లు. బిడ్డల్ని కడుపులో పెట్టుకుని చూసుకునే తల్లిలా నిండుగా ఉంది. ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్టు గుడి లోని ద్వజస్తంభంలా ఠీవిగా ఉంది .ఆ ఇంటికి రక్షణ ఇచ్చే తండ్రిలా హుందాగా ఉంది. కొబ్బరి చెట్టు చూడగానే చిన్నప్పుడు నాన్న ఆ ఆకులు చీల్చి అన్నయ్యకి తనకి వాచ్, ఉంగరాలూ చేసి పెట్టడం గుర్తొచ్చొంది.

ఇంటికి మూలగా గిలకబావి. అమ్మ తలంటుకు రమ్మంటే దొరక్కుండా బావి  చుట్టూ అమ్మని పరిగెత్తించడం గుర్తొచ్చింది. అక్కడి ప్రతి అంగుళం ఓ ఙ్ఞాపకమై పలకరిస్తుంటే  ప్రాంగణం దాటి వసారాలోకి వచ్చి ఆగాడు. అక్కడే నాన్న తనకీ, అన్నయ్యకీ కొత్త పుస్తకాలకీ అట్టలు వేసిస్తున్న ఙ్ఞాపకం వసారా దాటి తలుపు తీశాడు

           ఇంట్లోకెళ్ళగానే ఏదో పవిత్రమైన భావన. బహుశా అది పూజ గదిలో నుండి వచ్చే అగరొత్తుల వాసన వలనో లేక ఆ ఇంటి మీద ఉన్న మమకారం వలనో.  ఎదురుగా గోడవైపు చూశాడు. అమ్మనాన్న ఫొటో. షష్టిపూర్తి నాటిది. ఇద్దరి ముఖాల్లోనూ సంతోషం . అలానే నిలబడి ఫొటో వైపు చూస్తున్నాడు. మెళ్ళో పూల మాలలతో గర్భగుడి లోని దేవతామూర్తుల్లా ఉన్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం
ఒకరుంటే ఇంకొకరికి థైర్యం.

 ఆ ఇంటిని రూపాయికి రూపాయి పోగేసి కష్టపడి కట్టుకున్నారు . కట్టేటప్పడు ప్రతి ఇంటిని ఇటుకలతోనే కడతారు .కానీ కొన్నాళ్ళాయ్యాక ప్రతి ఇటుక ఓ ఙ్ఞాపకంగా మారిపోతుంది. ఆ ఇంట్లోని ప్రతి అంగుళం వాళ్ళకి అపురూపమే. వాళ్ళకే కాదు తనకీ కూడా. ఆ విషయం ఇప్పుడే తెలుస్తుంది. నాలుగు గోడల మథ్య  ఉన్న శూన్యంలో కూడా ఎన్నో ఙ్ఞాపకాలు  నిక్షిప్తమై తనని ప్రేమగా నిమురుతున్నట్టున్నయ్.

ఇంటి నుండి బయటకొచ్చి గుడికి వెళ్ళాడు అమ్మని నాన్నని కలవడానికి. దైవ దర్శనం చేసుకుని చూస్తూఉంటే ఇద్దరూ  గుడి మెట్లు దిగుతూ కనిపించారు . గర్భగుడి లోని దేవతామూర్తులు నడిచి వస్తున్నట్లనిపించింతనికి.

గర్భగుడిలోని దేవతలు నమ్మకం  . గర్భగుడి దాటి బయటకు వచ్చిన ఈ దేవతలు నమ్మకం కాదు. నిజం. భగవంతుడు కూడా కాదనలేని నిజం. పుట్టుకకు కారణమైన వాళ్ళు, పోషణకు కారణమైన వాళ్లు. ఎదగడానికి కారణమైన వాళ్ళు. అలాంటి వాళ్ళని వేరుచేయడమంటే...
గర్భ గుడిలోని అన్యోన్య దంపతుల విగ్రహాలని కదిపి, కుదిపి, పెళ్ళగించి బయటకు తీసి వేరుచేయడమంత మహాపాతకం  అనిపించింది  తనకి. మనసులో అలజడి మొదలైంది .* 

*వాళ్ళిద్దరూ కొడుక్కి దగ్గరగా వచ్చారు. వాళ్ళ వైపు అలానే *చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ వేదనతో కనిపించలేదు  అతనికి. వేదనలా* *కనిపించారు. ఇదివరకైతే "ఒరే చిన్నోడా" అంటూ నవ్వుతూ పలకరించే వాళ్ళు. ఇప్పుడు తనవైపు దిగులుగా చూస్తున్నారు. కొడుకు ఎదురైనట్లుగా లేదు. రాకూడని కష్టమేదో ఎదురైనట్లుగా ఉంది వాళ్ళకు. ముగ్గురూ మౌనంగానే ఇంటికి నడిచారు.* 
*ఇంటికి రావడమే ఆలస్యం. నేను వెళ్ళొస్తాను అంటూ అతను బయల్దేరుతుంటే  వాళ్ళిద్దరూ తెల్లబోయి "మరి మేము" అంటుండగానే  వద్దు మా బాథ్యతలను పూర్తి చేసుకుని మేమే వస్తాం మీ దగ్గరకు. అందాకా మీకు ఎప్పుడు రావాలని అనిపిస్తే అప్పుడు ఇద్దరూ కలిసి వస్తూ ఉండండి అంటూ ఆశీర్వాదం కోసం తల్లీ తండ్రీ పాదాలు తాకాడు. అంతే ఒక్కసారిగా వాళ్ళ కళ్ళనుండి పెల్లుబికిన ఆనందం అక్షింతలై కొడుకును మనస్పూర్తిగా* 
*ఆశీర్వదించాయి.*

Gopireddy JReddy

No comments:

Post a Comment