*మోక్షం -2*
(రావిశాస్త్రి గారి కథలు)
చీకటిగదిలో చీమల ఏడుపు.
వాటి గురించి తేళ్ళు జెర్రులు.
నరకం ఎలా వుంటుంది?
తేళ్ళతో, జెర్రులతో అతి చీకటిగా....
అక్కడ ఏముంటాయి?
పగబట్టిన చలి చీమలు!!!
నా చేతులు నల్లతాచులు
నా చేతుల మూతుల్లో అయిదేసి నాలికలు, అన్నేసి కోరలు.
ఈ సిరాలో విషం.
నా కాలంలో కాటు!
“తరవాత కేసు, వేగిరం పిలుపు. అడ్మిషన్ కేసులన్నీ ముందర్రానీ!
అయిదు గంటల్దాటితే జెయిల్లోకి తీసుకోరు?
జెయిలుకి పగలు వెళ్ళాలి - పిల్లల్తో సహా!
అడివికంటే జెయిలే మెరుగు.
"ఈ కేసేమిటి?"
"తాగుడు".
"తాగేవా?"
"తాగేను సార్."
"డబ్బు కట్టుకుంటావా?"
"నూకాలమ్మ జాతరకి తాగేనుసార్."
"డబ్బుకట్టుకుంటావా??"
"పండుక్కూడా తగ్గూడదా సార్?"
"డబ్బుకట్టుకుంటావా లేదురా రాస్కెల్!"
"జోబీల ఖాళీసార్."
"నాలుగు వారాలు."
జెయిలు జెయిలు!!
"తరవాత వాడు వేగిరం పిలువు, ఎవడువాడు"
పద్దెనిమిదేళ్ళవాడు. పడుచుతనం లేనివాడు. లోతుకుపోయిన కళ్ళు, చొచ్చుకుపోయిన దవడలు, మాడిన ముఖం ఎండిన గుండెలు.
"ఏం కేసు?"
"చోరీ"
"కాయితాలిచ్చేరా?"
"ఇచ్చేరండి."
"నిన్న సంబరంలో జేబు కొట్టేవులట-నిజమేనా"
"నిజమేనండి."
"చోరీ నేరం చేసేవా?"
“చేసేనండి."
"నిన్నెప్పుడో చూసినట్టుంది. ఇదివరకో సారి వచ్చేవు కదూ?"
"సారా కేసులో మీరే రెణ్ణెల్లు జై లేసేరు"
"బైటకొచ్చి ఈ పనెందుకు చేసేవు? సారానే అమ్ముకో లేకపోయావా?"
"మదు పెవడెడ తాడండీ? మదుపు లేని బిజినేసేటంటే జోబీలు కొట్టడ మేనన్నారండంతాను.'
"ఎవరన్నారు?"
"జెయిల్లో అందరూ,"
"చోరీ చెయ్యకూడదు. తప్పు"
“సారాకి జెయిలే! చోరీకి జై యిలే! ఏదైతేనేండి?"
“ప్రథమ తప్పుకిద వదుల్తాను. జామీను కెవరైనా వున్నారా?"
"లేరండి"
"ఈ సారొచ్చేవంటే ఆర్నెల్లు! నీ మంచికి చెప్తున్నాను ఈ సారికి నెల పో!"
నేరాలకి తేడాలేదు. దేనికైనా జెయిలే.
"తరవాత కేసు పిలువు. తరవాత్తరవాత."
మామూలుగానే వున్నాను. మరేం భయంలేదు. మనసు సర్దుకొంటుంది. అనవసరంగా గాభరా పడ్డాను.
ఈ ముసలమ్మెవరు? పాత ముసలమ్మే.
"ముసలమ్మా! కోర్టులో కనిపించొద్దని నీ కెన్నిసార్లు చెప్పేను!"
"జరుగుబాటెలా బాబూ మరీ?"
"ఈసారీ సారా నేనా?"
"ఈ పాలి అబద్దం కేసు బాబూ."
"సారా కేసేనా?"
"సారా. తప్పితే కల్లు. అయినాక నాకింకేటుంటుంది బాబూ! అన్ని సుట్లొచ్చేను. ప్రాయిబిసన్ కేసల్ల తప్ప మరెందలైనా ఒచ్చేనా? ఈ సుట్టు కూడా సారాయే కాని బాబూ ఒట్టబొద్దం కేసు బాబూ!"
"వాదించుకుంటావా?"
"నా నెప్పుడైనా ఓదించానా? కడితే జలిమానా కాకపోతే జెయిలు. నా నెప్పుడు వోదించను బాబూ! కేసు కొప్పేసుకుంటాను బాబూ."
"సారా దొరికిందా?"
"దొరికింది."
"నేరం చేసేవా?"
"ఏదీ! సేసేనని సెపున్నాగదా!!"
"డబ్బు కడతావా? టైమిస్తాను."
"మూణ్ణెల్లు."
జెయిలు జెయిలు!
"అదే పదేలు బాబూ!.... కానీ సూడు బాబూ! ఒణ్నం రాయించు బాబూ! ముసిల్దాన్ని. ఆ జొన్నకూడు తిన్లేను. సచ్చిపోవాలన్నమాట. ముసిల్దాన్ని సం పేక! ఒణ్నం రాయించు బాబూ! వచ్చే జన్మల నీ కడుపున పుడతాను. ముసిలి ముండ కూతుర్ని."
"పోపో బైటకి పో"
"బాబ్బాబు! ఒణ్నం!"
“చూస్తాను. బైటకెళ్ళు. ఓయ్ తీసుకుపొండి."
వీళ్ళందరికి తమాషాగా వుంది! పుట్టింటికెళ్ళినట్టు వెళుతుంది ముండ! వీళ్ళని స్పేర్ చెయ్యకూడదు! అబద్దం కేసట. వప్పేసుకొంటుందిట.
అబద్ధం కేసులో జెయిలేసి నందుకు ఆ పాపం నాకు అంటుకోవాలని దొంగముండ దురుద్దేశం. రాస్కెల్స్. అంతా రాస్కెల్స్! అనవసరంగా వీళ్ళని చూసి కనికరిస్తున్నాను. వెధవల్ని పాతేయాలి, పాతేస్తే చస్తారు. కాటేస్తే చస్తారు, పగపడతారు రాస్కెల్సు!
తరవాత వాళ్ళని రమ్మను. ఆ కేసు! మరోటి! మరోటి!
మరొకరు పన్నెండేళ్ళ పిల్ల; 'యాభై కట్టు!'' నీబాబొచ్చాడా? ఇలా రమ్మను' 'టైమివ్వను' కట్టకపోతే స్కూలుకి పంపించేస్తాను. రెండేళ్ళుంటుంది చూసుకో మరి, వేగిరం కట్టి'
ఇరవయ్యేళ్ళ పడుచు, అరవై జరిమానా! వేగిరం కట్టు. కట్టకపోతే ఆర్నెల్లు. కట్టేస్తావుకద! కట్టకపోతే తెలీదా?" కాటేస్తాను.
వేళ్ళు పోయిన ముసలాడు. 'నీ రోగం చూసి జాలిపడను. రెండు వందలు . కడితే కట్టు. లేకపోతే జైలుకి పో.
నీ షావుకారేడీ, రమ్మనిలా రమ్మను. వేగిరం కట్టీ.
కట్టవా? నాలుగునెల్లుండయితే! అన్నం రాయను పో!'
మరొక పడుచువాడు.
"నాలుగు గేలన్ల సారా దొరికిందా?"
"దొరికింది,"
"అయిదు నెల్లు."
జెయిలు జెయిలు!!
"జెరిమానా కడతాను బాబో!"
"వీల్లేదు."
"మొన్న అప్పారావుకి పది గేలన్లకి రెండొందలేసేవు బాబూ!"
"నోర్ముయ్యరా. రాస్కెల్!"
"డబ్బు తెచ్చాడుబాబూ, షావుకారు."
"వీల్లేదు."
"రెడీగుంది బాబూ."
"వీల్లేదు."
"బాబూ బాబూ"
"ఆయిదు నెల్లుండు."
"బాబో బాబో!"
"రాసేసేను"
"బాబో బాబో! జెయిలొద్దు బాబో! జెరిమానా కడతాను బాబో! జెయిల్లో చంపేస్తారు బాబో! నన్ను చంపేస్తారు బాబో! జరిమానా కడతాను బాబో!"
చంపేసినా సరే.
"వీల్లేదు."
"బాబో బాబో! నా కేసుకాదు బాబో, షావుకారుకి బదలా నా నొప్పుకున్నాను
బాబో! ఆడి కేసు బాబో! డబ్బుతెచ్చాడు బాబో! పోలీసోళ్ళ నడగండి బాబో! ఆడికేసు బాబో నా నొప్పుకోను బాబో! జెరిమానా ఎయిస్తాం అన్నాడు బాబో! జెయిలెయ్యకు బాబో! నా సారాకాదు బాబో! జవాను బాబును అడగండి బాబో! జెయిలెయ్యకు బాబో!
"వీల్లేదు పో!"
"బాబో! బాబో! నా నొప్పుకోను బాబో! ఏస్తే జెరిమానా ఎయించుబాబో."
"లేదు వీల్లేదు!"
"బాబో! బాబో! సచ్చిపోతాను బాబో! పోలీసోళ్ళెనకాల తిరిగేను బాబో! ఆళ్ళకి ఇన్ పర్ మేషనిచ్చేను బాబో!
కేడిగాళ్ళందరికీగుర్రు, నామీద గుర్రు బాబో! బాబో బాబో! జెయిల్లో కేడిగోళ్ళు నన్ను బతకనివ్వరు బాబో! ఎఁవిఁకలిరిసేస్తారు. ఆశిద్ధం తినిపిస్తారుబాబో! పేనాలు తీసేస్తారు బాబో! వోర్డర్లు నిల్చొని సూస్తారు బాబో ! కలగజేసుకోరు బాబో! జెయిలొద్దు బాబో! సంపేస్తారు బాబూ! బాబో! బాబ్బాబు! బాబ్బాబు!"
"వీణ్ని తీసుకుపోండి."
హాల్లో గలాటా. కిటికీలదగ్గర జనం, అల్లరి, కేకలు. పెద్దగా ఏడుపు. ఆఖరికి చల్లారింది.
పగలు పగలు రాక్షసప్పగలు!
(సశేషం)
No comments:
Post a Comment