Thursday, August 20, 2026

 *🌻🌹 గరుడ పంచమి🌹🌻*

శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో “గరుడ పంచమి” ఒకటి. గరుత్మంతుడు సూర్యరథసారథి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలననే అతడికి “సువర్ణుడు” అనే పేరు కూడా ఉన్నది.

గరుడ పంచమికి సంబంధించి భవిష్య పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమథనంలో “ఉచ్చైశ్రవం” అనే గుర్రం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు, వినతల కుమారుడు గరుడుడు. ఒక రోజు వినత, ఆమె తోడికోడలు కద్రువ విహరిస్తున్న సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు. కద్రువ, వినతతో గుర్రం తెల్లగా ఉన్నా, దాని తోక మాత్రం నల్లగా ఉందని చెప్పగా, వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉందని చెప్పింది. వాళ్లిద్దరూ ఒక పందెం వేసుకున్నారు. గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని, గుర్రం మొత్తం తెల్లగా ఉంటే కద్రువ వినతకు దాస్యం చేయాలని పందెం.

కద్రువ తన కపటబుద్ధితో తన సంతానమైన నాగులను పిలిచి, అశ్వవాలాన్ని పట్టి వేలాడమని కోరగా, దానికి వారెవ్వరూ అంగీకరించలేదు. కోపగించిన కద్రువ “జనమేజయుని సర్పయాగంలో నశించాలి” అని శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వేలాడి, తల్లి పందాన్ని గెలిపించాడు.

కొద్దికాలం తరువాత గర్భవతి అయిన వినత, తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బయటకు రాగానే, “అమ్మా! నీ తొందరపాటు వలన నేను అవయవాలు పూర్తిగా ఏర్పడకుండానే జన్మించాను. కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు” అని చెప్పి, సూర్యభగవానుడి రథసారథిగా వెళ్లిపోయాడు.

కొద్దికాలం తరువాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినత క్షేమం కోసం, తల్లి ఋణం తీర్చుకోవాలని, ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెస్తానని కద్రువకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని, నిప్పులు వెదజల్లుతూ, ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు.

ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి, అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు. దేవతాశ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు యుద్ధం చేశారు. పేట్రేగిపోయిన గరుడుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి, తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు.

వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు, కుబేరుడు, వాయువు, యముడు అందరినీ ఎదుర్కొని, ఓడించి అమృతాన్ని సమీపించాడు. అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు.

గరుత్మంతుడు అమృతాన్ని తీసుకెళ్తుండగా, విష్ణువు అతడిని సమీపించి, “నీ విజయసాధనకు మెచ్చాను. ఏమి కావాలో కోరుకో” అన్నాడు.

“నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామీ” అంటాడు గరుత్మంతుడు.

తనకు వాహనంగా, జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు.

ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక, అతడి పరాక్రమాన్ని కొనియాడాడు.

“అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు. నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో! అమృతం సేవిస్తే వారు జయించలేనివారవుతారు. దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే, నీవు ఏం కోరినా బహుమతిగా ఇస్తా” అని అన్నాడు.

“నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి, నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే, నువ్వు వెళ్లి దానిని దొంగిలించు. మనిద్దరి కోరికలు నెరవేరతాయి” అని అనగానే, అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు.

గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి, పాములకు ఆ పాత్రను ఇచ్చి, “చాలా శ్రమపడి తెచ్చాను. మీరు తృప్తిగా ఆరగించి, అమరులవ్వండి” అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకుని వాయు, మనోవేగాలతో ఉడాయించాడు.

నియమనిష్ఠల పేరుతో పాములను స్నానమాచరించిన తరువాతే అమృతం తాగాలనే నిబంధన పెట్టి, ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం.

తల్లి ఋణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి, అనుసరించాలి.

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*🌻 నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడ పంచమి. 🌻*

గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠంపై అరటి ఆకును పరచి, బియ్యం పోసి, వారి శక్తి మేరకు బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్ఠించి, పూజ చేసి, పాయసం నైవేద్యంగా పెడతారు. మరికొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు.

ఇలా మన పూజలందుకునే గరుడుని వంటి మాతృప్రేమ కలిగిన కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగజేస్తుంది.

🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️

No comments:

Post a Comment