Thursday, August 20, 2026

 కథా శీర్షిక: *వ్యామోహ నివృత్తి*

(ఇది నా స్వీయ రచన-భవాని కుమారి బెల్లంకొండ )

ప్రభావతి, భూపతి రాక కోసం ఎదురు చూస్తోంది. వాళ్లకి ఇద్దరు కూతుళ్లు. భూపతి కిరాణా షాప్ ఉండేది ఇద్దరికీ పెళ్లిళ్లు జరిపే వరకు ఆయన ఆర్ధిక పరిస్థితి బాగానే ఉంది కానీ క్రమంగా భూపతి వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. దానికి కారణం అది వరికిలా కాకుండా, ఇప్పుడు అతని షాప్ ఉన్న సెంటర్లో చాలా షాపులు వేలిశాయి. మోర్ లాంటి సూపర్ మార్కెట్ల పోటీ తట్టుకోవటం కష్టంగా మారింది.

మారుతున్న కాలంతో పాటు మారలేక భూపతి, పాత పద్ధతులే అనుసరిస్తూ జనాలని ఆకట్టుకోలేక పోతున్నాడు ప్రభావతి ఏదైనా సలహా చెప్పబోతే కసురుకుంటున్నాడు అందుకే అతని విషయాలలో కలగజేసుకోవటం సలహాలు ఇవ్వడం మానేసింది ప్రభావతి.

కిరాణా కొట్టు మూయక తప్పలేదు ప్రస్తుతం హోల్ సేల్  విత్తనాల షాపులో పది వేల శాలరీకి ఒప్పుకున్నాడు. అది వరకు ఇంటిని అమ్మేసి ప్రభావతి మేనమామ ఇంకా కొంతమంది దగ్గర బంధువులు ఉన్న చోట మూడు గదుల ఇల్లు ఒకటి కొన్నాడు. కూతుళ్ళ రాకపోకలు తక్కువే, అంతంత మాత్రంగా వున్న తండ్రి ఆర్ధిక పరిస్థితి తెలిసి, ఏమీ ఆశించకపోయినా, వస్తే తండ్రికి బరువుని రాకపోకలు తగ్గించారు. మరీ కష్టకాలంలో వాళ్లకు తోచినంత సాయం చెయ్యటం అలవాటు చేసుకున్నారు.

అనారోగ్యం, మోకాళ్ళ నొప్పులు, ఊబకాయం పర్యవసానంగా భూపతి లో అసహనం పెరిగింది. అంతకుముందు జీవితమంతా హ్యాపీగా సాగిందని కాదు కానీ. ఓ మాదిరి జీవితమే ఉండేది. మంచి, చెడు వయసులో ఉన్నప్పుడు ఉండే పదనిసలు వెనక్కి తిరిగి చూసుకుంటే పర్వాలేదు మంచిగానే జీవితం గడిచిపోయిందని అనుకుంటుంది ప్రభావతి.

ఆమె ఒకరకంగా అల్ప సంతోషి, భూపతికి మాత్రం సాయంత్రం తను వచ్చేసరికి రాత్రి 7:30 వరకు వీధిలో ముచ్చట్లు పెట్టుకుంటూ, రికామీగా కాలం గడిపే ప్రభావతిని చూస్తే చాలా కోపంగా ఉండేది ఆ కోపాన్ని ఏదో రూపంలో చూపించేవాడు.

ప్రభావతి అతని అసహనం బాధ కలిగించినా, దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితి ఆందోళన కలిగిస్తూనే ఉంటుంది. అందరితో అలా ముచ్చట్లు పెట్టుకుంటే మనసు కొంచం సేద తీరుతుందని భావిస్తుంది. ఆ వీధిలో అంతా ఆర్ధికంగా బాగున్న వాళ్ళే, ప్రభావతి అవసరమైనప్పుడు పిండి వంటలు, పచ్చళ్ళు పెట్టటంలో అందరికీ  సాయం చేస్తూ ఉంటుంది. దాని పర్యవసానమే  ఆమెకు చుట్టుప్రక్కల వాళ్ళలో మంచి పేరు, స్నేహం కలిగింది.

అంతా కొత్త కొత్త పట్టు చీరలు కొనుక్కుంటున్నారు కూతుర్ల పెళ్లిళ్లకు కొన్న రెండు పట్టు చీరలు మార్చి మార్చి కట్టడంతో కొంచెం ఎలాతెలా పోతున్నాయి. ఒక చీర మడతల్లో చివికి, చినగటానికి సిద్ధంగా వుంది. 

 ప్రభావతికి తన ఇంటి పరిస్థితి తెలుసు కానీ ఫ్రెండ్స్ వాయిదాల పద్ధతిలో చీరలు లెక్కకు మించి లేటెస్ట్ రకాలు కొనుకుంటున్నారని తను అలాగే కనీసం ఒక చీర అయినా ఈ శ్రావణ మాస నోముకి కొనుక్కోవాలని మహా కోరికగా ఉంది. కానీ ఒకవేళ ఆ పద్ధతిలో కొత్త చీర తీసుకున్నా, డబ్బు కట్టే సమయానికి భూపతి ఇవ్వాల్సిందే. ఇప్పుడున్న కండిషన్ లో అది సాధ్యం కాదని ఆమే మనసుకు తెలుసు ఏదో ఆశ. కనీసం పూజా సామాగ్రి అయినా కొనుక్కోవాలి అనీ, నలుగురిని పిలిచి నానబెట్టిన సెనగలు, పళ్ళు, తాంబూలం వాయినంగా ఇవ్వాలని కోరికగా ఉంది కానీ అతన్ని అడగాలంటే భయంగా ఉంది.

కలశం అమర్చుకోవడానికి వెండి రాగి ఇత్తడి వాటిల్లో ఏదో ఒకటి ఎంచుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఇత్తడి పాత్రతో, బంగారంలా మెరిసేలా తోమి చేసుకోవచ్చని అనుకుంది

పెద్ద ఆడంబరంగా చేయకపోయినా, వ్రతానికి కావలసిన సామాగ్రి పసుపు కుంకుమ అయితే ఇంట్లో ఉన్నాయి తమలపాకులు ఎదురింట్లో తీగనుంది తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం తింటున్నది  రేషన్ బియ్యం కాబట్టి, అవి ఉన్నాయి కనీసం రెండు కొబ్బరి కాయలు కొనాల్సి ఉంటుంది, అంటే 70 రూపాయలు పరిమళభరితమైన మంచి అగరబత్తులు, కర్పూరం, శుక్రవారం రోజు విపరీతంగా పెంచి అమ్మే పూలు ఖరీదెక్కువైనా కొనాల్సి ఉంటుంది,  నైవేద్యానికి పాయసం బూరెలు పులిహోర ఇలాంటివి చేయాల్సి ఉంటుంది వీటికి తోడు పంచామృత ద్రవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి తేనె చక్కెర అన్ని తెప్పించాల్సి ఉంటుంది.

కొత్త చీర ఒకటి కావాలి, నాలుగైదు ఏళ్ళు అయింది కొత్త చీర కొనక ముఖ్యంగా పట్టుచీర ఇవన్నీ కొనాలంటే డబ్బు కావాలి.

ఆ తర్వాత వరలక్ష్మి వ్రత విధానం, అష్టోత్తర శతనామావళి చదివి తోరణా పూజించి, అమ్మవారికి ఆవాహన చేసి, ప్రసాదాలు సమర్పించి తోరణం చేతికి కట్టుకొని, మంగళ హారతి ఇచ్చి వచ్చిన ముత్తయిదువులకు వాయనం ఇవ్వాల. ఇంత తతంగం ఉంది, భూపతి ఒప్పుకుంటాడా ? అన్న సంశయం. కనీసం కావలసిన ద్రవ్యాలన్నీ కనీసం ఒక చిన్న పట్టు వస్త్రం కలశానికి అలంకరించటానికి కావాలి. 

అంటే 2000 తక్కువలో తక్కువ అవుతాయి ఇప్పుడు అన్ని లైట్ వెయిట్ పట్టు చీరలు నాలుగైదు వాయిదాలలో కొనుక్కోవచ్చు అని తెలుసు కానీ భూపతి ఒప్పుకుంటాడా అన్న సందేహం ఉండనే ఉంది.

అనుకున్నంత అయింది, ఆ సాయంత్రం భూపతి వచ్చాక, భోజనం చేశాక సమయం చూసుకొని నెమ్మదిగా తన కోరిక బయట పెట్టింది

ఖర్చుకి, 2000 పైగా వాయిదాల పద్ధతిలో తనకోసం ఒక పట్టు చీర అని చెప్పగానే విరుచుకుపడ్డాడు భూపతి, నీకేం తెలుస్తోంది ? వానలు పడక ఒకటే ఉక్క పోత విత్తనాల సీజన్ మొదలుకాక ప్రస్తుతానికి సెలవు తీసుకోమని ఇవ్వాలే సెలవిచ్చాడు మా ఓనర్. పోయిన నెల జీతం ఇచ్చి, ఇంట్లో కూర్చోమన్నాడు. నువ్వెంత ఆర్భాటంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఆ డబ్బుతోనే మళ్ళీ సీజన్లో మొదలయ్యే వరకు గడుపుకోవాలి, ఏదో మామూలుగా రోజువారి పూజలా చేసుకుని సవ్యంగా పూజ చేయలేకపోతున్నానని అమ్మవారి ముందు చెంపలు వేసుకో " అని సెలవిచ్చారు.

పాపం! ప్రభావతి మరేమీ మాట్లాడలేక పోయింది. డబ్బు లేకపోతే అతను మాత్రమే ఏం చేస్తాడు ? ఉన్న డబ్బు నెల అంతా వాడాలి, రైతులు వర్షం కోసం ఎదురు చూసినట్టు, తామిద్దరు కూడా వర్షం కోసం, విత్తనాల సీజన్ మొదలవ్వాలని ఆశించాలేమో! అనుకుని  బాధపడింది . ప్రభావతి.

శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కాదు కదా, పూజ వరకు ఏదో మమ అనిపించి, చారుమతి కథ చదువుతుంటే నవ్వొచ్చింది ప్రభావతికి ఎన్నేళ్ళ నుండో చేస్తోంది. చారుమతితోపాటు  వ్రతం చేసుకున్న వారందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభించాయని చదివి నవ్వుకుంది ప్రభావతి. తనకు కొత్త నగలు దేవుడెరుగు, పట్టీలతో సహా అన్ని పోయాయి, ప్రస్తుతం పసుపు తాడుతో మిగిలింది.

ఏదో తన పూజ ముగించుకుని, పాత పట్టు చీర కట్టుకొని ఉడుకులెత్తిపోతున్న వాతావరణంలో వాయనాలు తీసుకోవడానికి పేరంటానికి పిలిచిన వాళ్ళ ఇళ్ళకి బయలుదేరింది ప్రభావతి.

***

ఈపాటికి వర్షం పడాల్సిందే, కనీసం జల్లు కూడా లేదు. రోజంతా ఎండ, ఉక్క పోత చెమటతో తడిసిపోయిన పాత చీరతోనే పిలిచిన ఇళ్లన్నీ తిరిగి, వాయనం పుచ్చుకొని ఇంటికి వస్తూ ఉంటే , హఠాత్తుగా మబ్బులు కమ్మి హఠాత్తుగా పెద్ద వర్షం కురవసాగింది. ఒక ఇంట్లో ఆగిపోయి, వర్షం వెలిసేదాకా ఆగి బయలుదేరుదామని అనుకుంది. కానీ ఎంతసేపటికి వర్షం తగ్గదే, పైగా కరెంట్ ఒకటి పోయింది.

ఇంత దూరం రాకుండా ఉండాల్సింది అనుకుంటూ ప్రభావతి బయలుదేరింది. వర్షంలోనే తడుచుకుంటూ మిగతా వాళ్లతో పాటు నడవసాగింది. హోరున కురుస్తున్న వర్షంలో ఆమెతో పాటు ఉన్న వాళ్లు కొత్త పట్టు చీరలు తడిసిపోయాయని బాధపడుతూ ఇళ్లకు వెళ్లారు. ప్రభావతి కి ఆ  బాధ లేదు. ఒంటి మీద నగలు లేవు కాబట్టి, చీకట్లో ఎవడోనాగాలు  గుంజుకు పోతాడన్న భయంలేదు. బురద మయమైన దారిలో తట్టుకుంటూ, తారుకుంటూ నెమ్మదిగా ఇల్లు చేరింది.

పాత పట్టు చీర పూర్తిగా తడిసిపోయింది. స్నానం చేస్తే గాని సుత రాయించేలా లేదని స్నానానికని బాత్రూంలోకి వెళ్ళింది పాత పట్టు చీర తొలగిస్తున్నప్పుడు  పర్రు మని శబ్దం వచ్చింది, ప్రభావతికి నవ్వొచ్చింది. ఒకటి ముందే పోయింది, ఇప్పుడు ఇది కూడా పోయింది, పొడిచీర కట్టుకుని అమ్మవారికి నమస్కరించింది. అమ్మ నవ్వుతూ" నీ వ్యామోహ నివృత్తి అయిందా, నేను ఆడంబరాలు ఆశించానా" అని నవ్వుతున్నట్టుగా తోచి, కొన్ని రోజులుగా తనలోని దుగ్ధ మాయమైనట్టుగా అనిపించి, చెంపలు  వేసుకుంది ప్రభావతి.   

(సామాప్తం )

No comments:

Post a Comment