Thursday, August 20, 2026

 "కష్టనష్టాలు"

   రామనాధుడు ఆ ఊళ్లో మోతుబరి రైతు. అతని ఏక పుత్రుడు సోమనాధుడు పెద్ద చదువులు చదివి, ఇంటికి తిరిగివచ్చాడు. వ్యవసాయం తన కొడుక్కు అప్పగించి తాను విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు రామనాధుడు.

కాని సోమనాధుడికి వ్యవసాయం చేయాలని లేదు. అతను తన తండ్రితో, "వ్యవసాయం అంత లాభసాటి కాదు. కష్ట పడినందుకు తగిన ఫలితం ఉంటుందనుకోవటానికి వీలులేదు. అతివృష్టి, అనావృష్టి ఏర్పడి శ్రమ అంతా బూడిద పాలు కావచ్చు.'' అన్నాడు.

కొడుకు మాటలకు నివ్వెరపోయి రామనాధుడు, ' అయితే ఏం చేయాలని నీ ఉద్దేశం?'' అని అడిగాడు.

సోమనాధుడు ఆ ఊళ్ళోనే లక్షల మీద వ్యాపారం చేస్తున్న ఒక ప్రముఖుణ్ణి కలుసుకుని, "ఏవిధమైన వ్యాపారం లాభసాటిగా ఉంటుందంటారు?'' అని అడిగాడు.

వ్యాపారి నిట్టూర్చి, " ఏం వ్యాపారం, నాయనా? చదువుకున్న వాడివి. చూస్తూ, చూస్తూ, ఈ రొంపిలో ఎందుకు దిగు తావు? వ్యాపారం వెనకటి అంత లాభసాటిగా ఉండటం లేదు. వ్యాపారస్థులు జాస్తి అయారు, పోటీ హెచ్చింది. వ్యాపారం చేసుకునే వాడికి సుఖం లేదు, శాంతిలేదు." అన్నాడు.

వ్యాపారంలోగల కష్టనష్టాలను గురించి వివరంగా విన్నాక సోమనాధుడికి వ్యాపారం మీద విముఖత్వం పుట్టింది.

అతను అక్కడి నుండి తిన్నగా నగరానికి వెళ్ళి, అక్కడ ఉన్న ఒక ప్రముఖ రాజోద్యోగిని కలుసుకుని, తన విషయమంతా చెప్పి, రాజుగారి కొలువులో తనకు ఏదన్నా ఉద్యోగం ఇప్పించ మన్నాడు.

రాజోద్యోగి ఇలా చెప్పాడు:

"ఎందుకు, నాయనా, రాజుగారి కొలువు చేస్తానంటావు? రాజుగారి దివాణంలో ఉద్యోగం చెయ్యటమంటే కత్తి మీద సామే ! రాజుగారికి అనుగ్రహం కలిగినా, ఆగ్రహం కలిగినా మనకు ప్రమాదమే. ఆత్మాభిమానం చంపుకుని నౌకరీ చెయ్యాలి. ఎంత చేస్తే మాత్రం ఊరా? పేరా? చదువుకున్నావు తెలివి తేటలున్నాయి, భూములున్నాయంటున్నావు! నీ తెలివితేటలు వ్యవసాయంలో చూపావంటే, నువ్వింత తిని, పదిమందికి ఇంత పెట్ట గలుగుతావు. ఉద్యోగాల బతుకులు చాలీ చాలని బతుకులు! గాడిద బతుకులు! ఇంతాచేసి ఉద్యోగం దొరకటమంటే మాటలుకాదు ! ''

రాజోద్యోగి చెప్పిన మాటల్లో నిజం ఉన్నదని సోమనాధుడికి తోచింది. అతను ఇంటికి తిరిగి వచ్చాడు.

ముఖం వేలాడ వేసుకుని వచ్చిన కొడుకును చూసి రామనాధుడు. విషయం అడిగి తెలుసుకుని, ఇలా అన్నాడు :

“నువు ఒక్క వ్యవసాయంలోనే కష్ట నష్టాలు ఉన్నాయనుకున్నావు. అది నీ తప్పుకాదు. నీకు వ్యవసాయం గురించి మాత్రమే అనుభవం ఉన్నది. వాస్తవం ఏమంటే, ఎకడ లాభమనేది ఉంటుందో అక్కడే అంతో, ఇంతో నష్టంకూడా ఉంటుంది. అలాగే సుఖం ఉండే చోటనే ఎంతో కొంత కష్టంకూడా ఉంటుంది. పూర్తి సుఖంతోకూడి, అచ్చoగా లాభమే ఇచ్చే పని ఎక్కడా ఉండదు. జీవితంలో కష్టనష్టాలు అడుగడుగునా ఉంటాయి. మనిషికి కావలసినది దీక్షా, ఆత్మస్థయిర్యమూనూ! ఇవి ఉంటే ఎక్కడ కష్టనష్టాలు కలిగినా వాటిని ఎదుర్కొని జయించవచ్చు."

సోమనాధుడి మనసు తండ్రి మాటలతో దృఢపడింది. అతను వ్యవసాయమే చేపట్టి, సమర్థుడనిపించుకున్నాడు.

No comments:

Post a Comment