Friday, August 28, 2026

 *మీరెప్పుడైనా అజీవకుల గురించి విన్నారా ?*
...........................
*ఆజీవకులు ప్రాచీనభారతదేశంలో ఉద్భవించిన ఒక ముఖ్యమైన శ్రమణ సంప్రదాయానికి చెందినవారు.ఇక్కడ శ్రమణ అనే పదానికి తపస్సు,ఆత్మనిగ్రహం, వైరాగ్యం ద్వారా ఆధ్యాత్మిక సాధన చేసే వ్యక్తి అనే అర్థం ఉంది. BCE 6వ శతాబ్దంలో బుద్ధుడు మరియు మహావీరుని కాలంలోనే వీరు ప్రాచుర్యంలో ఉండేవారు.*

*ఆజీవకులు ప్రాచీన భారతదేశంలోని ఒక నాస్తిక అంటే వేద ప్రామాణికతను అంగీకరించని మతతెగ. వీరి ప్రధాననాయకుడు మక్ఖలి గోశాలుడు.ఈయన మహావీరునికి కొంతకాలం శిష్యుడిగా ఉండి,ఆ తర్వాత విడిపోయి ఈ సంప్రదాయాన్ని స్థాపించినట్లు జైన,బౌద్ధగ్రంథాలు పేర్కొంటాయి.వీరు బౌద్ధ,జైన మతాలకు సమకాలీనులు. ఆ కాలంలో భారతదేశంలో వేదమతానికి ప్రత్యామ్నాయంగా ఉద్భవించిన అనేక శ్రమణ సంప్రదాయాలలో ఆజీవక సంప్రదాయం కూడా ఒకటి.*
ఆజీవకుల ప్రధాన సిద్ధాంతం నియతివాదం (Fatalism). విశ్వంలో జరిగే ప్రతి సంఘటన ముందే నిర్ణయించబడిందని, మానవ ప్రయత్నంతో దాని మార్పు సాధ్యంకాదని వీరు నమ్మేవారు. ప్రపంచంలో ప్రతిదీ నియతి (విధి) ద్వారానే నడుస్తుందని వీరి విశ్వాసం.ప్రతిజీవి ముందే నిర్ణయించబడిన జనన మరణ చక్రాన్ని అనుభవించిన తర్వాతే విముక్తిని పొందుతుందని వారు బోధించారు.
కర్మసిద్ధాంతాన్ని వీరు వ్యతిరేకించారు.మనిషిచేసే పనులు ఫలితాలను ప్రభావితం చేయవని,అన్నీ విధినిర్ణీతమని వీరు వాదించారు. ఈ కారణంగానే బౌద్ధ,జైనతత్వవేత్తలు ఆజీవకుల సిద్ధాంతాలను తీవ్రంగా విమర్శించారు.అయినప్పటికీ, వారి తత్వశాస్త్రం ప్రాచీన భారతీయ తాత్త్వికచర్చలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
మనిషి తనవిధిని పూర్తిచేసిన తర్వాతే మోక్షాన్ని పొందుతాడని, అది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని వీరు భావించేవారు.జీవులు అనేక లక్షల జన్మల ద్వారా ప్రయాణించి చివరకు విముక్తిని పొందుతాయని వారు విశ్వసించారు.
ఆజీవకులు తమ కఠినమైన జీవనశైలికి ప్రసిద్ధి. వీరిలో కొందరు దిగంబరులుగా ఉండేవారు. కొందరు ఆజీవకులు అతి తక్కువ దుస్తులు ధరించేవారు. వీరు సంచారజీవులు.ఇంటిని, సంసారాన్ని వదిలేసి కఠినమైన తపస్సుచేసేవారు. వీరు ప్రజలనుండి భిక్షాటనచేస్తూ జీవించేవారు. వీరు చాలా నిరాడంబరంగా ఉండేవారు. సమాజంలో మతపరమైన ఆచారాలను పెద్దగా పట్టించుకోకుండా తమ తత్వశాస్త్రానికి కట్టుబడి ఉండేవారు.వీరి జీవనవిధానం కొంతవరకు జైనదిగంబర సంప్రదాయాన్ని పోలి ఉండేది.
మౌర్య చక్రవర్తి అశోకునికాలంలో ఆజీవకులకు రాజ్యాదరణ ఉండేది. అశోకుడు అతని మనుమడు దశరథుడు ఆజీవకుల కోసం బీహార్ రాష్ట్రంలోని బరాబర నాగార్జునికొండల వద్ద గుహలను నిర్మించారు.బరాబరగుహలు భారతదేశంలో లభించిన అత్యంత ప్రాచీనగుహ నిర్మాణాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందాయి.ఆజీవకుల ప్రభావం ముఖ్యంగా మగధ, కోసల, అవంతి మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కనిపించింది. అయితే కాలక్రమేణా బౌద్ధం,జైనం హిందూమతాల ప్రభావం పెరగడంతో వీరి మత ప్రభావం తగ్గిపోయింది. సుమారు 14వ శతాబ్దం నాటికి ఆజీవక సంప్రదాయం స్వతంత్ర మతంగా అంతరించిపోయి, ఇతర మత సంప్రదాయాలలో కలిసిపోయింది.       *ఆధ్యాత్మిక కుటుంబం*                      

No comments:

Post a Comment