*సత్సాంగత్యంతోనే జీవన్ముక్తి*
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తి
‘మోహముద్గరం’గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లో తొమ్మిదో శ్లోకమిది. సత్పురుషుల సాంగత్యం వల్ల ఈ ప్రాపంచిక విషయాల పట్ల సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది.
మోహం తొలగిపోతే మనసు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతుంది (నిశ్చలతత్వం). అలా మనసు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతే ఇక సమస్త కర్మబంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం. జీవన్ముక్తి అని ఈ శ్లోకం అర్థం.
మానవుడు ఈ ప్రపంచంలో జీవించినంతకాలం సుఖాలను, భోగాలను, ఆనందాన్ని కోరుకుంటారు. లోకంలో కనిపించే వస్తువుల ద్వారానే ఆనందాన్ని, సుఖాన్ని పొందగలననుకుంటాడు. ఇలా వస్తువుల ద్వారా విషయాల ద్వారానే ఆనందం పొందగలుగుతామనుకోవడమే మోహం.. భ్రమ. ఎందుకంటే ఈ లోకంలో ఏ వస్తువూ ఏ విషయమూ ఎల్లప్పుడూ ఆనందాన్నే ఇస్తుందనే నమ్మకం లేదు. ఏదైనా కొంతకాలం సుఖాన్ని ఇస్తే ఇవ్వవచ్చు. కానీ, అదే దుఃఖాన్ని కూడా ఇస్తుంది. వస్తువు ద్వారా వచ్చే సుఖం.. ఆ వస్తువు పోయినా, చెడిపోయినా పోతుంది. అప్పుడు దుఃఖం కలుగుతుంది.
కనుక ఏ వస్తువు ద్వారానైనా అనిత్యమైన ఆనందమే తప్ప నిత్యమైన ఆనందం రాదు. ఇది తెలిసీ వస్తువుల ద్వారా కోరుకున్న ఆనందాన్ని పొందగలమనుకోవడమే భ్రమ. మనిషిని భ్రమలోనూ మోహంలోనూ ముంచెత్తివేసే విషయవస్తువుల మాయాజాలం నుంచి, ఆకర్షణల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే గొప్ప ఉపాయం ఏదో కావాలి. అట్టి ఉపాయాన్ని శంకరులు ఈ శ్లోకంలో ఇచ్చారు. ఎలా మనం ఉన్నతమైన జీవన్ముక్త స్థితిని పొదుతామో తెలియజేశారు. ఆ ఉపాయమే సత్సంగత్వం. అంటే.. సత్పురుషులతో సంగభావం. సత్పురుషులంటే సత్ పదార్థాన్ని అన్వేషించే సాధకులు, భగవత్ భక్తులు, సత్కార్యాలు ఆచరించేవారు.
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు, సాధుపురుషులు, జ్ఞానులు. వారితో మాట్లాడటం, వారి మాటలను వినడం, వారి ద్వారా సందేహాలను తీర్చుకోవడం, వారిని అనుసరించడం.. ఇదే సత్సంగత్వం అంటే. ఒకవేళ అలాంటివారు లభించకపోతే సద్గ్రంథాలతో స్నేహం చేయాలి. అందులోని విషయాలను గ్రహించి ఆచరణలో పెట్టాలి. తద్వారా.. అనిత్య వస్తువులు మనకు నిత్యమైన ఆనందాన్ని ఇవ్వలేవని, నిత్యమైన ఆనందం పరమాత్మ వల్లనే లభిస్తుందని తెలుస్తుంది. మనలో మానసిక ప్రశాంతత కలిగి మనసులో విషయవస్తువుల పట్ల నిస్సంగ భావం వస్తుంది. ఆ భావం వాటి ఆకర్షణ నుంచి మాయాజాలం నుంచి రక్షిస్తుంది.
No comments:
Post a Comment