*బ్రహ్మ శాపం*
రచన : అందవల్లి కొండలరావు
అది బ్రహ్మలోకం! ఆ రోజు, బ్రహ్మ సృష్టి నిర్మాణంలో లీనమై వున్నాడు. అతడికి ఎదురుగా పద్మాశీనయైన సరస్వతి మధుర మోహనంగా వీణను వాయిస్తోంది. మహర్షులు, దేవతలు బ్రహ్మను అనేక రీతుల స్తుతిస్తున్నారు. హఠాత్తుగా కమ్మని ఆ వీణానాదం ఆగిపోవడంతో బ్రహ్మ తృళ్ళిపడి భార్య వైపు చూశాడు. సరస్వతి ఎందుకో దిగాలుగా వుంది. మాటిమాటికి వేడి నిట్టూర్పులు విడుస్తోంది. తాను తయారు చేసిన మట్టి విగ్రహాల వైపు గుచ్చి గుచ్చి చూస్తూ వుంది.
“దేవీ! మధ్యలో వీణను ఆపేశావేం? నీ ముఖం వాడిపోయినదేం? ఎందుకు వేడి నిట్టూర్పులతో ఆ బొమ్మల వైపు దీక్షగా చూస్తున్నావు?” అని అడిగాడు బ్రహ్మ.
“నాథా! ఎల్ల వేళలా మీరు ఇతరులను సృష్టించే పనిలోనే లీనమవడం తప్ప మన విషయం ఆలోచించారా? శివ పార్వతులకు, లక్ష్మీనారాయణులకు, ఇంకా చాలామంది దేవతలందరికీ పిల్లలు వున్నారు. కనీసం మనకి ఒక మగపిల్ల వాడైనా వున్నాడా! పిల్లలు లేని ఇల్లు సున్నం లేని ఇంటిలా వెలవెలబోతూ వుంటుంది. మీరు కనీసం మనకి ఒక్క మంచి అబ్బాయినైనా సృష్టించి ఇవ్వండి. అప్పుడు మనకు పిల్లలు లేరనే లోటు తీరుతుంది. మనస్సు కూడా సంతృప్తి చెందుతుంది" అని వాణి తన కోరిక వెల్లడించింది.
ఆమె కోరిక న్యాయమే అన్పించింది ఆయనకి. "ఒక చక్కని మంచి అబ్బాయి నీకు కలుగు గాక" అని వాణీనాథుడు కనులు మూసుకొని తన మనస్సులో సంకల్పించాడు.
తక్షణం "కేర్ కేర్" అని ఏడుస్తూ అతడి ఒడిలో ఒక పసిబాలుడు అవతరించా డు. ఆ పిల్లవాడిని చూసీ చూడ్డంతోనే సరస్వతిలో మాతృ ప్రేమ పెల్లుబికింది. చేతితో ఆ పిల్లవాడిని తీసుకొని తన హృదయానికి హత్తుకొని ఆనందంతో పాలివ్వసాగింది. ఆ ఇద్దర్నీ చూసి బ్రహ్మ కూడా సంతోషం చెందాడు. ఈసారి అత్యుత్సాహంతో అతడు తిరిగి తన సృష్టి నిర్మాణంలో లీనమయ్యాడు.
ఆ పిల్లవాడిని అతి గారాబంగా పెంచు కుంటూ “మానసపుత్రుడు” అని పేరు పెట్టారు ఆ దంపతులు.
మానసపుత్రుడు విశాలమైన కన్నులతో, స్ఫురద్రూపంతో చాలా అందంగా ఉన్నాడు. అతడికి పది సంవత్సరాల వయసు వచ్చింది.
మానసపుత్రుడు ఎంత అందంగా వుంటాడో అంత ఆకతాయి పిల్లవాడిగా తయారయ్యాడు. ఇంటా బయటా కూడా అల్లరి పనులు చేయసాగాడు.
లేనిపోని కబుర్లు చెప్పి ఇతరులు ఒకరితో ఒకరు కలహించుకొనేలా చేసి ఆనందించే వాడు. "హి- హీ" అంటూ చప్పట్లు చరిచే వాడు. రాను రాను అతడి ఆగడాలు బయటి వారికే కాక తల్లిదండ్రులైన సరస్వతికి, బ్రహ్మకు కోపతాపాల్ని కలిగించసాగాయి.
ఒక రోజున మానసపుత్రుడు తన మాటలతో, చేతలతో తన తల్లిదండ్రుల ను ఒకరితో ఒకరు కలహించుకొనేలా చేశాడు. పతి మీద అలకతో సరస్వతి అతడితో కొన్నాళ్ళు మాట్లాడడం మాని వేసింది. కోపంతో బ్రహ్మ కూడా ఆమెను పలకరించడం లేదు. ఇలా కొన్ని రోజులు జరిగాక అసలు విషయం తెలిసింది. తమ దెబ్బలాటకు కారకుడు తమ మానసపుత్రుడే అని బ్రహ్మకు అతడి మీద అమితమైన ఆగ్రహం కలిగింది.
“ఓరీ! నీ ఆకతాయి పనులు ఇంత వరకూ సహించాను. కన్న తల్లిదండ్రులకే పోరు కల్పించి వినోదిస్తావా? ఇక నుండి ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. ముల్లోకాలూ తిరుగుతూ ఇతరులకు కలహం కలిగిస్తూ ఆనందిస్తూ వుండు. అదే నీకు భోజనం. కలహ భోజనుడిగా పిలవబడతావు, ఫో” అంటూ శపించాడు బ్రహ్మ.
మానసపుత్రుడు తన తప్పిదం గుర్తించి శాపవిమోచనం కలిగించమని బ్రహ్మను బ్రతిమాలాడు. తండ్రి అయిన బ్రహ్మ తన కోపం తగ్గించుకోలేదు.
"బ్రహ్మ శాపం తిరుగులేనిది. నువ్వు అనుభవించక తప్పదు ఫో” అని కసిరాడు.
“నారాయణా.. వైకుంఠ వాసా నువ్వు అయినా నన్ను కాపాడు. శంభోశంకరా,
కైలాస వాసా, పాహిమాం. పాహిమాం!" అంటూ మానసపుత్రుడు భక్తితో హరి హరులను స్తుతించాడు. తక్షణమే చిరు నగవులతో, వారు ఇద్దరూ అక్కడ ప్రత్యక్షం అయ్యారు.
“మహానుభావులారా, దేవాదిదేవుళ్ళారా. హరి హరుల్లారా, నన్ను కరుణించండి.
బ్రహ్మ శాపం తొలగించండి. ఇలా కలహ భోజనుడిగా నేను ఆపకీర్తితో బ్రతుకలేను. పాపాత్ముడినై ఉండలేను. అనుగ్రహిం చండి" అంటూ వేడుకున్నాడు.
"మానస పుత్రా! విచారించకు. బ్రహ్మ శాపం అమోఘం. నువ్వు ఆయన శాపాన్ని భరించక తప్పదు. అయినా నీకు అది వరం గానే మారుతుంది. నిరంతరం నా నామస్మరణ చేస్తూ త్రిలోక సంచారం కావించు. నీవు ఇతరులకు తెచ్చే కలహం లోక కళ్యాణంగానే మారుతుంది. తపస్సు చేసి ఇతరులకు జ్ఞానబోధ కావిస్తూ 'నారద మహర్షి ' విగా అంటే జ్ఞానమును ప్రసాదించేవాడివిగా ప్రఖ్యాతి బడయగలవు" అని వరం అనుగ్రహించా డు నారాయణుడు.
“మానసపుత్రా! నేటి నుండి నువ్వు అందరికీ పుత్ర సమానుడివే. ఎటువంటి సమయంలోనైనా ఎవరి ఇండ్లలో కైనా నువ్వు నిరభ్యంతరంగ వెళ్ళవచ్చు. కామ, క్రోధాది అరిషడ్వర్గములు నిన్నంటవు” అని శంకరుడు వరం ఇచ్చాడు.
బ్రహ్మ కూడా పశ్చాత్తాప పడి “నాయనా, నీవు చిరంజీవివై చక్కని పేరు తెచ్చుకుం టావు. బ్రహ్మచారిగా ఉంటూ లోక కళ్యాణం కోసం శ్రమిస్తావు" అని వరం అనుగ్రహించాడు కొడుక్కి.
“ఇంకేం కావాలి?” అన్నట్టు చూశారు హరి హరులు మానసపుత్రుని వైపు.
అంతటా తల్లి సరస్వతిదేవి పుత్రుడికి ఒక చక్కని వీణని చేతికి అందించింది.
“మహానుభావులారా ! నాకు మంచి వరాలే అనుగ్రహించారు. ధన్యుడిని. నా కింకేం కావాలి? దేవాది దేవుడయిన శ్రీ మన్నారాయణుని స్మరిస్తూ ముల్లోకాలు తిరిగేందుకు నాకు అనుమతిని అను గ్రహించండి” అని నమ్రతతో నమస్కరిం చాడు బ్రహ్మ మానస పుత్రుడు వారికి.
“తథాస్తు” అని ఆశీర్వదించి అంతర్థాన మయ్యారు హరిహరులు.
తల్లిదండ్రుల అనుమతి పొంది మానస పుత్రుడు నారదుడిగా త్రిలోక సంచారం ప్రారంభించాడు.
*సమాప్తం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆
No comments:
Post a Comment