విదేశీ గడ్డపై స్వదేశీ పండగ
Lalitha Rayaprolu
"అమ్మాయ్ ! పొద్దెక్కుతోంది లే!లేచి, వీరిగాడి కొట్టంనుండి ఆవుపేడ తీసుకురా. పొద్దెక్కితే, ఆ లచ్చి కాస్తా ఆవుపేడ, గేదెపేడ కలిపి, గుచ్చెత్తుతుంది."
"ఏమండీ ! అరిసెలు చెయ్యాలి. దగ్గరుండి, ఆ రోళ్లు బాగా దులిపించి, నానేసిన బియ్యం మెత్తగా పట్టించుకు రండి.
ఈ కరెంటు రోకళ్లు వచ్చి, బతికిపోయాను లేకపోతే, గూళ్ళు పడేలాగా, దంచలేక అణగారే వాళ్ళం!"
"అత్తయ్యగారు ! ఒకసారి అరిసెల పాకం చూడండి. ఇంక దించెయ్యనా ?"
"ఒరేయ్! పొద్దస్తమానం ఆ గాలి పటాలేనా ? కాస్త ఆ మైల గుడ్డలు విడిచి, తలస్నానం చేసి రారాదురా ! బాబ్బాబు పుణ్యం ఉంటుంది."
"కోడలు పిల్లా ! చుక్కలు తప్పెట్టి, ముగ్గు రాలేదని గింజుకుంటే,
ఎట్టా? అదిగో ఆ మూల ఒక చుక్కెట్టు. అన్నీ చచ్చినట్టు కుదురుతాయి."
"ఒరేయ్ అబ్బీ ! ఆ టైలర్ సత్యం ఇవాళ నీ పొడుగు కాళ్ళ పంట్లాము, పొడుగు చేతుల బుష్ కోటు కుడతానన్నాడు. ఓసారి వెళ్లి చూసిరా !
అసలు ఇంతవరకూ మనం ఇచ్చిన సంచీలోంచి బట్టే తీసి ఉండడు."
"అయ్యో! సీతారాముల విగ్రహాలు రంగులు పోయి, వెలాతెలా పోతున్నాయి. బొమ్మల కొలువులో ముందు అవే పెట్టాలి. పారేసి కొత్తవి కొంటానంటారా ? తప్పు తప్పు. మీ నాన్నమ్మగారు కాపురానికి వచ్చినప్పుడు కొన్నారట. ఆ బాండుమేళం సెట్టులో ఒకడి మెడ విరిగింది, ఇంకోడి చెయ్యి విరిగింది.
యుధ్ధంలో సైనికుల్లా క్షత గాత్రులయాయేమిటి అక్కయ్యా! అని మా తమ్ముడు ఒకటే నవ్వు."
"ఈసారి పేటేరు వెళ్ళినప్పుడు, మిరప్పండు రంగు చుట్టు జరీ చీరలు నేయమని చెప్పండి. ముక్కుపొడుం రంగువి కిందటి సారే ఆడబడుచులకి పెట్టాము. మళ్లీ అదే రంగు ఎట్టా పెట్టాలి?"
డిమెన్షియాతో బాధ పడుతున్న, తొంభై ఏళ్ల వర్ధనమ్మగారి ధోరణి అలా సాగుతూనే ఉంటుంది.
ఆవిడకి పది కాన్పులు అయాక దక్కిన పురుషోత్తంగారికి ఒక్కడే కొడుకు రవి.
ఎమ్ ఎస్ చేయడానికి అమెరికా వెళ్లి, ఉద్యోగంతో బాటు లీసాని చేపట్టాడు.
పెద్దలు ముగ్గురూ ఏమనలేక, సరిపెట్టుకున్నారు.
రవి తనకి సిటిజన్ షిప్ రాగానే తల్లిదండ్రుల్ని అమెరికా వచ్చేయమన్నాడు.
"మామ్మ ని వదిలిపెట్టి, రాలేమురా. "అని పురుషోత్తంగారు అంటే, ఆవిడతో సహా ముగ్గురూ రావడానికి అన్ని ఏర్పాట్లు చేసాడు రవి.
ఇక్కడికి వచ్చిన మూడు నాలుగేళ్లు, వర్థనమ్మ గారు బాగానే ఉన్నారు.
మెల్లిగా మతిమరుపు జబ్బు మొదలైంది.
ఏ పండక్కి ఏం చెయ్యాలో అదే మాట్లాడుతూ ఉంటారు.
మతిమరుపు జబ్బులో ఇదొక లక్షణం అయుండచ్చు.
ఆవిడకి ఎనిమిదో ఏట పెళ్లయింది.
దూరపు బంధువులు కావడం తో చేతికింద పని, పాటా చేస్తుందని, ఆ పసిపిల్లనే చీర సారె ఇచ్చి, దింపమన్నారు.
మాఘమాసంలో పెళ్లయి, అత్తారింటికి వచ్చాక, అత్తగారి వెనకాతలే ఉండి, అన్ని పనులూ చేసారు.
పెద్ద మనిషై కాపురానికి వచ్చాక, అత్తగారు గరిటె చేతికిచ్చి, కర్ర పెత్తనం మొదలుపెట్టారు. ఏటా పెద్ద పండగ వచ్చేముందే అరిసెలు, చక్కిలాలు చేసి, డబ్బాలకెత్తాలి.
పండగ మూడు రోజులు వాటితో సంబంధం లేకుండా, మళ్లీ పిండివంటలతో వంట, అటకమీద ఎక్కించిన బొమ్మలు దింపి, తుడిచి, తొమ్మిది మెట్లతో బొమ్మల కొలువు పెట్టడం, కనుమనాడు పొట్టు మినప్పప్పు నానేసి, ఆ పొట్టంతా తీసి, పెద్ద రోట్లో రుబ్బి, గారెలు, ఆవడలు చేసి,
పాలేళ్లకి వాళ్ళు తెచ్చుకున్న గిన్నెలు పిండివంటలతో నింపడం, కొత్త అమావాస్య నాడు బూర్లు, పులిహారతో సహా అమ్మవారికి ఉపారాలు, మర్నాడు మళ్లీ అంత పెద్దవంట, దసరా పదిరోజులు లలితా సహస్ర పారాయణ, ముత్తైదువులకు అలంకారాలు, మడితో చేసిన నవకాయ పిండివంటలతో భోజనాలు, మిగుళ్లు, తగుళ్లు పందారాలు, దీపావళికి రెండు రోజులు పిండివంటలు, మధ్యలో వైశాఖమాసంలో కామేశ్వరి చల్లదనం, శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఇలాగే ఆవిడ జీవితం గడిచింది.
రవికి ఇద్దరు కవల కొడుకులు.
ఒకడేమో రామ్. తల్లిలాగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు.
ఇంకొకడు లక్ష్మణ్. తండ్రిలాగా మంచికళగా ఉంటాడు.
ఇప్పుడు అమెరికా ఇల్లినాయిస్ లో పరుగుల ఉరుకుల జీవితంలో ఉదయాన్నే భోగిమంట వేస్తే, ఫైర్ అలారం గణగణ మోగుతుంది.
టెట్రా పేకులు, ప్లాస్టిక్ కేన్స్ లో పాలుతప్ప డైరీ ఫారం ఏ మూల ఉందో ఎవరికి తెలియదు.
ఏదో ఇండిపెండెంట్ ఇల్లు కనక, ముగ్గు వేసుకుంటే,
ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, గడ్డ కట్టుకుపోయే చలిలో కారు షెడ్లో పెట్టి, ఇంట్లోకొస్తే బాగానే ఉంటుంది కానీ గుమ్మంలో దిగితే, పళ్ళు టకటక లాడతాయి.
ఇంక భోగిపళ్ళు పోయాలంటే, రేగిపళ్లు వెతుక్కుంటూ, ఎక్కడికో వెళ్ళాలి.
ఎండబెట్టిన బెర్రీస్, శనగలు, చిల్లర కలిపి పోయాల్సిందే.
ఆ చిల్లర తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు.
పూలకేం కొదవ లేదు.
ఫ్లవర్ వాజుల్లో అలంకరించుకోవాలి కనక, ఇండియన్ స్టోర్ వెతుక్కుంటూ తిరగక్కర్లేదు.
గుమ్మడికాయలు తెగ పండిస్తారు గానీ, హాలోవీన్ కి అందులో దీపాలు పెడతారు కనక, ఆ టైంకే కాపు వచ్చేట్టు చూసుకుంటారు.
లీసాతో ఆడవాళ్ళిద్దరికీ బధిరుల భాషే.
పురుషోత్తంగారు మాట్లాడగలిగినా, మామా కోడళ్ళకి ఎక్కువేమీ ఉండవు.
డుప్లే ఇంట్లో వంటింటి రాజ్యం స్వరాజ్యానిదే.
రవి కావాల్సినవి అన్నీ తెచ్చి పడేస్తాడు.
ఒడియాలు, అప్పడాలు లాంటివి, ఫ్రెండ్ ద్వారా కురియర్లో తెప్పిస్తాడు.
ఆ కారాలు, మిరియాలు పోసిన వంటలు మొహం ఎర్రబడేలా తిని, రెండు బాటిల్స్ నీళ్ళు తాగుతుంది లీసా.
ఆమె బాధ చూడలేక, వాళ్ళింటికి వెళ్లి తిని రమ్మను అని స్వరాజ్యం, వర్ధనమ్మ గారు చెప్తూనే ఉంటారు.
ఆ రోజు భోగి.
పొద్దున్నే మనవలిద్దరికీ మాడున చమురుపెట్టి, హారతి ఇచ్చింది స్వరాజ్యం.
ఇంట్లో హీటర్ దగ్గిర చలి కాచుకోమని, తరవాత సున్ని పిండితో నలుగుపెడితే, ఒకడు భయం వేసేంత ఎర్రగా అయిపోయాడు.
వేడినీళ్ళతో తలంటి, కొత్త బట్టలు వేసింది.
కందా బచ్చలి ఆవపెట్టిన కూర, వేయించి వండిన పప్పు, ముక్కల పులుసు, దోసకాయ చింతకాయ కలిపి నూరిన పచ్చడి, పూర్ణం బూరెలు, పులిహార, పిల్లలకోసం బంగాళాదుంపల వేపుడు చేసి, ముందు అత్తగారికి భోజనం వడ్డించింది స్వరాజ్యం.
"అమ్మాయ్ నువ్వెవరో కానీ, అచ్చం మా కోడల్లాగే వండావు. కాసిని చక్కిలాలు కూడా చేసావా? పంటి కిందకి ఉంటాయి" అని మెచ్చుకుంటూ, తింటున్న అత్తగార్ని చూసి, మనుషుల్ని కూడా మర్చిపోయారు కానీ పండగల్ని, పిండివంటల్ని మాత్రం మర్చిపోలేదు అనుకుంటూ, ఆవిడ మాటలకి నవ్వువచ్చి, పక్కకి మొహం తిప్పుకుంది స్వరాజ్యం.
No comments:
Post a Comment