*💦భేతాళ కథలు💦*
*🌻4వ కథ 🌻*
*విచిత్రమైన కోరిక*
♦️పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు మీది నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం వైపు నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు,
♦️"రాజా, నీ ఆశయ మేమిటో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. నిన్ను చూస్తుంటే నాకు ఖాండిక్యుడు జ్ఞాపకం వస్తున్నాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆతని కథ చెబుతాను విను,” అంటూ ఈ విధంగా చెప్పసాగాడు.
♦️జనక మహారాజు వంశంలో అమిత ధ్వజుడనే రాజుకు కృత ధ్వజుడనీ, ఖాండిక్యుడని ఇద్దరు కొడుకులు. వారు తమ తండ్రి రాజ్యాన్ని పంచుకుని రాజ్య పాలన చేస్తూ ఉండేవారు.
♦️కృతధ్వజుడికి కేశిధ్వజుడనే కొడుకుండే వాడు. అతను రాజ్యానికి వచ్చి, ఖాండిక్యుడి రాజ్యాన్ని కూడా లాగేసుకున్నాడు. రాజ్యభ్రష్టుడైన ఖాండిక్యుడు తన మంత్రి పురోహతాదులను కొద్ది మందిని వెంట బెట్టుకుని అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ ఉంటూ వచ్చాడు.
♦️కేశిధ్వజుడు యోగవిద్య తెలిసినవాడు. అతను అనేక యజ్ఞాలు చేశాడు. ఒకనాడతను యోగసమాధిలో ఉండగా అతని యజ్ఞధేనువును పులి తిని వేసింది. ఇలా జరిగినందుకు ప్రాయశ్చిత్త మేమిటని అతను యజ్ఞం చేయించే ఋత్విక్కుల నడిగాడు.
♦️"ఈ ధర్మ సందేహానికి మేము సమాధానం చెప్పలేము. కశేరువు అనే మునిని అడిగితే ఆయన చెప్పగలుగుతాడు,” అన్నారు ఋత్విక్కులు.
♦️రాజు అలాగే కశేరు మహాముని వద్దకు వెళ్ళి, “స్వామీ నా యజ్ఞధేనువును పులి తిన్నది. అందుకేమి ప్రాయశ్చిత్తు చెయ్యాలంటారు ?" అని అడిగాడు.
♦️"ఈ విషయం నాకు ఏమీ తెలీదు. శునకుడనే ముని ఉన్నాడు. అతనైతే నీవు చెయ్యవలిసిన ప్రాయశ్చిత్తము ఏమిటో చెబుతాడు," అన్నాడు కశేరు మహాముని,
♦️కేశిధ్వజుడు శునక మహాముని వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి, తాను చేయవలసిన ప్రాయశ్చిత్తము ఏమిటని అడిగాడు.
♦️దానికి శునకుడు, "ఓ రాజా, నీ ధర్మ సందేహం తీర్చ గల శక్తి నాకూ లేదు. కశేరుపుకూ లేదు. అలాంటి శకి గలవాడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. అతను ఖాండిక్యుడు." అని చెప్పాడు.
♦️కేశిధ్వజుడికి పెద్ద సమస్య ఏర్పడింది. తన చేత ఓడి రాజ్యభ్రష్టుడైన వాడి వద్దకు తాను ఎలా వెళ్ళటం? ఎలా సలహా అడగటం ? ఆడిగితే మాత్రం అతను చెబుతాడా ? ఇలాంటి ప్రశ్నలతో కొంత సేపు సతమతమై, కేశిధ్వజుడు ఖాండిక్యుడి వద్దకు వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. " నన్ను చూడగానే ఖాండిక్యుడు శత్రుభావంతో చంపినట్టయితే, యజ్ఞదీక్షలో ఉండి చచ్చి పోతాను గనక నాకు యజ్ఞ ఫలం పూర్తిగా లభిస్తుంది.
♦️అలా కాక, అతను నా సందేహం తీర్చి పంపిస్తాడా, యజ్ఞం నిర్విఘ్నంగా కొన సాగి అలా కూడా నాకు యజ్ఞ ఫలం దక్కుతుంది. అందుచేత అతని వద్దకు వెళ్ళటం వల్ల నా కేమీ నష్టం ఉండదు," అని కేశిధ్వజుడు అనుకున్నాడు. అతను తన రథ మెక్కి ఆరణ్యంలో ఖాండిక్యుడుండే చోటికి బయలు దేరి వెళ్ళాడు.
♦️ఖాండిక్యుడికి అతన్ని చూడగానే పట్టరాని కోపం వచ్చింది. అతను తన బాణాన్ని ఎక్కు పెట్టి, " ఓరీ, కృష్ణాజినం ధరించినా నీ పాపిష్టి బుద్ధి మారలేదు. నన్ను చంపటానికి ఇక్కడికి కూడా వచ్చావా? పై పెచ్చు దొంగ వేషం వేశావా? నీవు నిజంగానే లేడి తోలు కప్పుకున్న పులివి గదరా ! అనవసరంగా ఒక సారి నాతో యుద్ధం పెట్టుకుని నా రాజ్యం అపహరించావు. అంతటితో తృప్తి లేక నా ప్రాణాలు తీయటానికి మళ్ళీ వచ్చావు. నా రాజ్యాన్ని హరించిన వాణ్ణి నేనెందుకు చంపగూడదూ? ఇప్పుడే నిన్ను సంహరిస్తాను," అన్నాడు.
♦️ఈ మాట విని కేశిధ్వజుడు ఖాండిక్యుడికి నమస్కారం చేసి, "బాబూ, నేను నిన్ను చంపటానికి రాలేదు, ఒక ధర్మసందేహం తీర్చుకోవటానికి వచ్చాను. నా సందేహమే తీర్చుతారో, బాణంతో కొట్టి చంపుతారో మీరే తేల్చుకోండి. నేను రెంటికీ సిద్ధంగానే ఉన్నాను,” అన్నాడు.
♦️కేశిధ్వజుడిలా అనే సరికి ఖాండిక్యుడు రహస్యంగా మంత్రి పురోహితులను సమావేశం చేసి వారి సలహా కోరాడు. "వీడు నీకు ప్రబల శత్రువు. వీణ్ణి చంపేసినట్టయితే నీవు నిరాటంకంగా దేశమంతా ఏలుకోవచ్చు,” అని వారు సలహా ఇచ్చారు.
♦️కాని ఈ సలహా ఖాండిక్యుడికి నచ్చ లేదు. యజ్ఞదీక్ష పూని ఉన్న వీణ్ణి నేనిప్పుడు చంపినట్టయితే వీడు శాశ్వతంగా పరలోక సుఖాలన్ని అనుభవిస్తాడు. బతికి ఉండనిస్తే వీడికి ఇహలోక సుఖాలు తప్ప మరేమీ ఉండవు. అందుచేత వీడిని చంపను,” అన్నాడతను.
♦️అతను కేశిధ్వజుడి వద్దకు తిరిగివచ్చి, " నీవేదో ధర్మసందేహంతో వచ్చానంటివే, ఏమిటది ? ఆడుగు, చెబుతాను," అన్నాడు.
♦️కేశిధ్వజుడు తాను ఆచరించవలిసిన ప్రాయ చిత్ర విధి ఏమిటని అడిగాడు.
♦️ఖాండిక్యుడు. అతను కోరిన ప్రాయశ్చిత్త విధి తెలిపి పంపేశాడు.
♦️కేశిధ్వజుడు తన స్వస్థలానికి తిరిగివచ్చి, ప్రాయశ్చిత్తం చేసుకుని, యజ్ఞం జయప్రదంగా పూర్తిచేసి, ఋత్విజులను పూజించి, సదస్యులను యథావిధి సన్మానించాడు. కాని తాను ఖాండిక్యుడికి గురు దక్షణ ఇవ్వలేదన్న బాధ కేశిధ్వజుడికి పట్టుకున్నది. అందుచేత అతను రథ మెక్కి మళ్ళీ ఖాండిక్యుడి వద్దకు బయలు దేరి వెళ్ళాడు. అతను మళ్ళీ వస్తూ ఉండటం చూసి ఖాండిక్యుడు ఆయుధాలు చేతబట్టి, యుద్ధసన్నద్ధుడై నిలబడ్డాడు.
♦️" బాబూ, నేను యుద్ధం చెయ్యటానికి రాలేదు. గురుదక్షిణ సమర్పించుకుందామని వచ్చాను. మీ దయ వల్ల నా యాగం పూర్తి అయింది. గురుదక్షిణగా ఏమి కావాలో కోరండి,” అన్నాడు కేశిధ్వజుడు. ,
♦️ఖాండిక్యుడు మళ్ళీ మంత్రి పురోహితులతో ఏకాంతాలోచన చేశాడు. "వీడు మనకు బాగా చిక్కాడు. సంకోచించకుండా రాజ్యం అడిగి పుచ్చుకోండి. యుద్ధం అవసరం లేకుండా, పోయిన రాజ్యం తిరిగి సంపాదించు కోవటానికింతకంటే మంచి అవకాశం మళ్ళీ దొరకదు," అని మంత్రి పురోహితులు సలహా ఇచ్చారు.
♦️ఖాండిక్యుడు వారి సలహా విని నవ్వి, కేశిధ్వజుడి వద్దకు వెళ్ళి, “ నాకు నీ నుంచి మరేదీ అవసరం లేదు గాని నీకు తెలిసిన యోగ విద్య నాకు చెప్పి, నీ దారిన నీవు వెళ్ళు," అన్నాడు.
♦️ఈ కోరిక విని కేశిధ్వజుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, అతను కూడా ఖాండిక్యుడు రాజ్యం ఇవ్వమంటాడనే అనుకున్నాడు. అతను ఖాండిక్యుడికి గురుదక్షిణ కింద తన యోగ విద్య ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
♦️బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నా కొక సందేహం. ఖాండిక్యుడు మంత్రి పురోహితులు సలహా చెప్పిన మీదట కూడా తన విరోధి నుంచి రాజ్యం ఎందుకు కోరలేదు ? వారి సలహా విని ఎందుకు నవ్వాడు ? ఆతనికి రాజ్యం మీద ఇష్టం లేకనా? లేక కేశధ్వజుడి పట్ల శత్రుభావం లేకనా ? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు.
♦️దానికి విక్రమార్కుడు, " ఖాండిక్యుడు సుక్షత్రియుడు. అందుచేత అతనికి రాజ్య కాంక్ష పోవటమంటూ ఉండదు. తన రాజ్యం అపహరించిన వాణ్ణి మిత్రుడుగా చూడటమంటూ కూడా ఉండదు. ఆతను సుక్షత్రియుడు కనకనే తన శత్రువును రాజ్యం అడగలేదు. రాజ్యం భుజ బలంతో గెలిచేడే గాని, యాచించి దానం పుచ్చుకునేది కాదు. తనకు రాజ్యాన్ని నిలబెట్టుకునే శక్తి చాలనందుచేతనే కేశిధ్వజుడు అతని రాజ్యాన్ని లాక్కున్నాడు. దాన్ని గురు దక్షిణగా స్వీకరించినా, రేపు ఆ కేశధ్వజుడే మళ్ళీ తనను జయించి ఆ రాజ్యాన్ని కాజేయవచ్చు. ఈ సంగతి మంత్రి పురోహితులకు తట్టలేదు, యాచన క్షత్రియ ధర్మం కాదని కూడా వారు ఆలోచించలేదు, అందుకే వారి సలహా అతను విని నవ్వాడు.” అన్నాడు.
♦️రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టు ఎక్కాడు.
🌼🌼🍒🍒🍒🌻🍒🍒🍒🌼🌼
No comments:
Post a Comment