Wednesday, August 21, 2024

 నిత్యం లౌకిక ప్రపంచంలోని సంబంధ బాంధవ్యాలతో కొట్టుమిట్టాడే వాళ్లకు, సంపద అంటే భౌతిక సుఖాలను అందించే ధన, కనక, వస్తు, వాహనాలు గుర్తుకు వస్తాయి. మాయామేయ జగత్తులో వీటికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పూజలు, వ్రతాలు పూర్తయ్యాక పెద్దలు కూడా తమ దీవెనలో పైవన్నీ భక్తులకు పరిపూర్ణంగా సంప్రాప్తించాలని కోరుకుంటారు. ధన సంబంధమైన వెంపర్లాట ఉన్నంతకాలం మనిషి సుఖాల మరీచికల వేటలో కడదాకా, కాలం తెలియకుండా సాగిపోతూనే ఉంటాడు. *సంపాదన రుచి మరిగినవాడు జీవితకాలమంతా వెచ్చించి ధనరాశులు పోగేసినా సంతృప్తి చెందడు.* దేహంమీద ధ్యాస వదిలి దైవంమీద పెట్టమని- పురాణవాజ్మయాన్ని ఆపోసన పట్టి, సర్వం మిథ్య అని తెలుసుకున్న విజ్ఞులు చెవినిల్లు కట్టుకుని చెప్పినా వినిపించుకోని అవస్థలో ఉంటాడు. ధనార్జనలో గానుగెద్దులా శారీరకంగాను, అనవరతం అదే ఆలోచనలతో మానసికంగాను నలిగిపోతుంటాడు. కష్టపడి సంపాదించింది ఎవరికంటా పడకుండా దాచుకోవడానికి అతడు పడే బాధ వర్ణనాతీతం. *శరీరం నశ్వరమని, ప్రాణం ఎప్పటికైనా ఆరిపోయే దీపమని తెలుసుకోరు.* మనిషి జననం అయాచితంగా లభించిందేమీ కాదని, కొన్ని జన్మల పుణ్యఫలమని, దీన్ని ధన సంపాదన రంధిలో పడి వ్యర్థం చేసుకోకుండా, ముక్తిమార్గంలో ప్రయాణించి, ఆధ్యాత్మిక సంపాదన పెంచుకొమ్మని ప్రాజ్ఞులు హెచ్చరిస్తూనే ఉంటారు. మాయామోహంలో పడిన మనిషికి ఆ మాటలు రుచించవు.
ఆధ్యాత్మిక సంపాదన మనిషికి నిండుదనాన్నిచ్చి సద్గతిని కలగజేస్తుంది. దైవీ సంపద కలిగినవారి లక్షణాలు ఎలా ఉంటాయి? నిర్భయత్వం, నిష్కల్మషమైన మనసు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల దృఢ సంకల్పం, దానగుణం, ఇంద్రియ నిగ్రహం ప్రస్ఫుటమవుతాయి. యజ్ఞయాగాలు చేస్తారు. సద్గ్రంథ పఠనం కొనసాగిస్తారు. *ధ్యానం అవలంబిస్తారు. అహింసను ఆచరిస్తారు.* సత్యసంధత, క్రోధం లేకపోవడం, పరుషంగా మాట్లాడకపోవడం వారి లక్షణాల్లో ముఖ్యమైనవి. త్యాగం, శాంతి, ఎప్పటికప్పుడు *తన తప్పులు తెలుసుకుని సంస్కరించుకోవడం, ఇతరుల్లోని లోపాలను ఎంచకపోవడం*... వారి ఒరవడి. సర్వప్రాణులపై దయార్ద్రతృష్టి కలిగి ఉంటారు. దురాశ కనిపించదు. మాటల్లో సౌమ్యత ప్రదర్శిస్తారు. క్షమాగుణం గోచరిస్తుంది. డాంబికాన్ని ప్రదర్శించరు. మోసం చేయాలన్న తలంపే వారికి రాదు. అజాతశత్రువు అనిపించుకుంటారు. వీరికి వ్యతిరేక లక్షణాలు కనబరచేవారు ఆసురీసంపద కలిగినవాళ్లు. జనన మరణ పరిభ్రమణంలో చిక్కుకుంటారు. ఎత్తయిన బంగారు నాణాల గుట్టమీద కూర్చున్న వ్యక్తికన్నా, ఆధ్యాత్మిక సంపద ద్వారా అలవడిన గుణసంపదతో అలరారే మనిషి ఉన్నతమైనవాడు. ధనమున్న వ్యక్తికి అది ఉన్నంతవరకే గౌరవ మర్యాదలు. దైవీ సంపదకలిగిన వ్యక్తి అహరహం ఆదర్శనీయుడు. తన దగ్గరున్న ధనాన్ని పదిమందికీ పంచిన దాత రిక్తహస్తాలతో నిలుచుంటాడు. *జ్ఞానసంపద ఎంత పంచినా తరగదు.* ఆ వితరణ అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంటుంది.
ధనవంతుడి ప్రాపకం కోరి అతణ్ని పొగుడుతూ పలువురు దగ్గరవుతారు. జ్ఞాని మాటలు వినడానికి జనులు తండోపతండాలుగా, తామంతట తాముగా ఆయన వద్దకు చేరతారు. ఉత్తముణ్ని దర్శించి, మాటలు విని, చేతలు చూసి లోకం    నడవడిక మార్చుకుంటుంది. నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా తెలుసుకొమ్మంటాడు త్యాగరాజు. నిధి కన్నా దైవ సన్నిధి జీవితానికి పెన్నిధి అని తెలుసుకోవడమే మానవజన్మను ముక్తిమార్గాన నిలుపుతుంది!     
                                                      
🪷⚛️✡️⚛🪷

No comments:

Post a Comment