🪷🙏🏻🪷🙏🏻🪷
*శ్రీ గురుభ్యోనమః*
పక్షులు పైకి ఎగురుతాయి. పక్షులు ఎగరటం వలన వాటికి ప్రాణం ఉందని, కూరగాయలు వంటివి ఎగరటం లేదు కనుక వాటిలో ప్రాణం లేదని అనుకోకు ! సూక్ష్మాతిసూక్ష్మంగా వాటిలో కూడా ప్రాణం ఉంది. గోడకి ప్రాణం ఉన్నప్పుడు, స్తంభానికి ప్రాణం ఉన్నప్పుడు కూరగాయలకి ప్రాణం లేకుండా ఎలా ఉంటుంది ?
ఇందుగలడు .. అందులేడని .. చక్రి అంతటా వ్యాపించి ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పినప్పుడు, హిరణ్యకసిపుడు ..
అంతటా ఉన్నప్పుడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడిగితే,
ప్రహ్లాదుడు .. ఉన్నాడు, చక్రి అంతటా ఉన్నప్పుడు ఈ స్తంభంలో కూడా ఉండడా అనగానే,
ఎక్కడ ఉన్నాడంటూ హిరణ్యకసిపుడు స్తంభాన్ని గదతో కొడతాడు. అప్పుడు స్తంభంలోంచి లక్ష్మినరసింహస్వామి ఉగ్రరూపంలో వస్తాడు. అలా ఎందుకొచ్చాడంటే, ప్రహ్లాదుని మాట నిజం చేయటానికి అందులోంచి వచ్చాడు. భక్తుని మాట నిజం చేయటానికి వచ్చాడు, భక్తుని మాట గౌరవించటానికి వచ్చాడు. *నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము !*
నీ మనసు ఎక్కడ ఆణుగుతోందో, నీకు ఎవరు ఇష్టమైతే, ఎవరి పేరు తలపెట్టుకుంటూ ఉంటే నీ మనసుకు ఏకాగ్రత కలుగుతోందో, ఎక్కడ నీ బుద్ది శాంతిగా ఉంటోందో, నీ బుద్ధి బాగుపడుతోందో వాడినే గురువుగా చేసుకో ! గురువు ఎవరైనా సరే .. నువ్వు బాగుపడటం ముఖ్యం. నువ్వు గోదుమ అన్నం తిను, వరి అన్నం తిను, ఇంకో అన్న తిను .. తినటం ముఖ్యం ! నువ్వు బాగు పడటం నీకు ముఖ్యం ! నీ మనసు బాగుపడాలి, నువ్వు సంస్కరింపబడాలి.
అవిద్య ఉన్నంత కాలం, అజ్ఞానం ఉన్నంత కాలం లోపల క్షోభ ఉంటుంది. అందుచేత నీకు తపన ముఖ్యం. *మోక్షం పొందాలి, మోక్షం పొందాలి అనే తపన ముఖ్యం !* అన్నిటికంటే మనకి ఆ ముముక్షత్వం రావాలి, ఆ జిజ్ఞాస రావాలి, జ్ఞానం సంపాదించాలి. మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి. పని మానేస్తే జ్ఞానం రాదు, పని మానేస్తే సోమరితనం వస్తుంది. మీ పని మీరు చేసుకుంటూ పని ద్వారా భగవంతుడిని ఆరాదించండి. మీ ఇంట్లో వృద్దులు ఎవరైనా ఉన్నారనుకోండి .. వాళ్ళకి అన్నం పెడుతున్నారనుకోండి .. మీరు వాళ్ళ రూపంలో ఉన్న, వాళ్ళ హృదయంలో ఉన్న ఈశ్వరుడికే పెడుతున్నామనుకోండి, వాళ్ళని ఆరాధించండి.
*పని ఇష్టంతో చేస్తే అది సేవ ! అయిష్టంతో చేస్తే అదే చాకిరీ !* ఎందుచేత అంటే .. దేశ జనాభా వందకోట్లు ఉంటారు. వందకోట్ల మంది మనింట్లో ఉన్నారా .. పూర్వజన్మ సంబంధాన్ని బట్టి, మన ప్రారబ్ధాన్ని బట్టి వాళ్ళలో నలుగురో, ఐదుగురో మనింట్లోకి సిద్ధం అవుతారు. వాళ్ళు మనల్ని చూడడమో, లేక మనం వాళ్ళని చూడటమో అనేది భగవంతుడు కేటాయించాడు. అదంతా ఇష్టంతో అనుభవిస్తే రాబోయే జన్మలో ఆ కర్మ రాదు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఇంట్లో వాళ్ళతో కొంచెం సర్దుబాటు చేసుకోవాలి. వాళ్ళేదైనా మంచి చెపితే మనం వినాలి, మనం ఏదైనా మంచి చెపితే వాళ్ళు వినాలి. అన్నీ మనకే తెలుసని అనుకోకూడదు.
సర్దుబాటు చేసుకోకపోతే ప్రధానమంత్రికి కూడా రోజులు వెళ్ళవు.
*శ్రీ నాన్నగారి అనుగ్రహ భాషణం -*
*మురమళ్ళ :* 2005 / 02 / 09
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment