రాత్రి 10 గంటలకు ఒక డాక్టరు గారి ఇంట్లో ఫోన్ రింగవుతుంది. నిత్యం పేషెంట్ లకు అందుబాటులో ఉండే నంబరు అది. డాక్టర్ నిద్రమత్తులో వెళ్ళి ఫోన్ తీశాడు.
“నమస్కారం సార్”
“నమస్తే! చెప్పండి”
“నాకు ఒంట్లో బాగోలేదని సాయంత్రం మా అమ్మతో పాటు మీ హాస్పిటల్ కి వచ్చాను సార్. గుర్తొచ్చానా?” అనగానే వయసుతో సమానంగా బుద్ది పెరగని ఓ అమాయక కుర్రాడి రూపం డాక్టర్ కళ్ళ ముందు కదిలింది.
“హా.. నేను మిమ్మల్ని మర్చిపోలేదు చెప్పండి” అన్నాడు డాక్టర్.
“నాకు జ్వరం తగ్గడానికి మీరు పెద్ద బిళ్ళొకటి, చిన్నబిళ్ళొకటి ఇచ్చారు కదా..”
“ఓకే.. అవి వేసుకున్నారా? ఎలా ఉందిప్పుడు?” వైద్యం వికటించిందేమోనని కంగారుతో అడిగాడు డాక్టర్.
“మీరు చెప్పినట్టు రాత్రి అన్నం తిన్నాక ఆ రెండు బిళ్ళల్ని వేసుకున్నాను”
“ఇప్పుడెలా వుంది? ఏదైనా తేడాగా ఉందా?”
“భయంగా ఉంది సార్” అన్నాడు ఆ అబ్బాయి.
“భయమా! ఎందుకు?”
“అన్నం తిన్న వెంటనే పెద్దబిళ్ళ ముందేసుకుని చిన్నబిళ్ళ తర్వాత వేసుకున్నాను... పర్లేదా?”
“దీంట్లో భయపడేదేముంది?” లాలనగా అడిగాడు డాక్టర్.
“అంటే పెద్దబిళ్ళ ముందెళ్ళి నేను తిన్న అన్నం మొత్తం అదే తినేస్తే? వెనకాలేసుకున్న చిన్నబిళ్ళకు ఏమీ మిగలదు కదా? అప్పుడు అదెళ్ళి పెద్దబిళ్ళతో గొడవపడితే? ఆ రెండూ కొట్టుకుంటే? మధ్యలో నాకేమన్నా అవుతుందేమోనని”
అతని అమాయకపు మాటల్లో అనేక ప్రశ్నలు, భయాలు.
“నువ్వు చాలా మంచోడివని, నిన్ను ఏమీ చెయ్యొద్దని ఆ టాబ్లెట్స్ కి ముందే చెప్పి ఇచ్చాను. కాబట్టి అవి లోపలికెళ్ళి కొట్టుకున్నా నిన్ను ఇబ్బందిపెట్టవు”
“మీరు అలా చెప్పిన మాట అవి వింటాయా సార్?”
“వింటాయ్.. వినకపోతే ఎక్కడున్నా వచ్చి ఇంజెక్షన్ ఇచ్చేస్తానని వాటికి భయం” అన్నాడు తెలివిగా సర్ధిచెప్పాననుకుంటూ.
“అవునూ…ఇలాంటి భయం నీకెందుకొచ్చింది?” డాక్టర్ తిరుగు ప్రశ్న వేశాడు.
మా ఇంట్లో అంతే సార్. పెద్దోడు స్కూల్ నుంచి ముందొచ్చి అన్నం మొత్తం తినేస్తాడు. ఆ తరువాత చిన్నోడొచ్చి నాకేమీ మిగల్చలేదని పెద్దోడుతో గొడవేసుకుంటాడు.
👉ఇంతలో మా నాన్న వచ్చి వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఆపలేవా అని నన్ను కొడతాడు”. వాళ్ళిద్దరి మధ్య అనవసరంగా దెబ్బలు తింటున్న బాధ అతని చివరి మాటలో వినిపించింది.
👉అతనికా భయం రోజువారి అనుభవం నుంచి పుట్టినదని డాక్టర్ కి అర్ధమయ్యింది. తన తెలివైన సమాధానం ఇక్కడ వర్తించదు అని డాక్టర్ అనుకుంటుండగా..
“సార్..! మా పెద్దోడు, చిన్నోడు గొడవలో నన్ను కొట్టొద్దని, కొడితే ఇంజెక్షన్ ఇచ్చేస్తానని మా నాన్నని కూడా భయపెడతారా?” దీనంగా అడిగాడు ఆ అమాయకుడు.
అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాడు డాక్టర్.
***
🌿ప్రతీ తల్లి తండ్రి ఆలోచన చేరవలసిన విషయం.. మీరు చేసే ప్రతీ పని పిల్లల సున్నిత మనసుపై ప్రభావం చూపిస్తుఉంది.. జర జాగ్రత..!🍁.
No comments:
Post a Comment