🔱ఓం నమః శివాయ🔱:
*🧘సౌందర్యలహరి🧘♀*
🪷🪷🧘🧘♀🪷🪷
*ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. ఇది స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి మరియు సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు.* *మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి.*
*స్తోత్ర పరిచయం*
*శంకరాచార్యుని అనేక* *స్తోత్రాలలో శినస్తోత్రంగా* *శివానందలహరి,* *దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు.* *త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే ఛందస్సులో ఉంది.* *సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.*
*ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.*
*ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం*
*ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల.* *ఈ మంత్రాలకు ఫలసిద్ధులను వ్యాఖ్యాతలు తెలియబరచారు.*
*ఆగమ తంత్రాలను విశదీకరించే, శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంధం.* *ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి.*
స్తోత్రంలో మొదటి 41 శ్లోకాలు "ఆనంద లహరి" అని, తరువాతవి దేవీ సౌందర్యాన్ని కీర్తించే "సౌందర్య లహరి" అని అంటారు కాని ఈ విభజనను కొందరు వ్యాఖ్యాతలు అంగీకరించరు. భారత దేశంలో సౌందర్య లహరికి ఇంచుమించు 50 వ్యాఖ్యానాలున్నాయని తెలుస్తున్నది. లక్ష్మీధరుడు, భాస్కరరరాయుడు, కామేశ్వర సూరి, అచ్యుతానందుడు మొదలైనవారు ముఖ్య భాష్యకర్తలు. "Serpent Power" ("కుండలినీ శక్తి") అనే పేరు మీద "ఆనందలహరి" అనబడే భాగానికి మాత్రం "ఆర్థర్ ఎవలాన్" అనే ఆంగ్లేయుడు వ్యాఖ్యను వ్రాశాడు. "శ్రీరామ కవి" అనే పండితుడు "డిండిమ భాష్యము" అనే భాష్యాన్ని వ్రాశాడు. శ్రీ నరసింహ స్వామి అనే పండితుడు "గోపాల సుందరీయము" అనే వ్యాఖ్యలో ప్రతి శ్లోకాన్ని శక్తిపరంగాను, విష్ణుపరంగాను కూడా వ్యాఖ్యానించాడు. తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు "శ్రీచక్ర విలసనము" అనే వ్యాఖ్యను వ్రాశాడు.
అన్ని మంత్ర స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని కూడా జపించడానికి ముందుగా గురువును స్మరించాలి. తరువాత ఋష్యాదులను (స్తోత్రము, ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము, అర్ధము, వినియోగము) స్మరించాలి. పిదప అంగన్యాసము, కరన్యాసము, ధ్యానము, పంచోపచారాదులు చేయాలి. తరువాత శ్రద్ధతో, భక్తితో, నిర్మల నిశ్చల హృదయంతో స్తోత్రాన్ని పఠించాలి (జపించాలి). ఈ "సౌందర్య లహరి" స్తోత్రానికి
ఋషి - గోవిందః
ఛందస్సు - అనుష్టుప్
దేవత - శ్రీ మహాత్రిపుర సుందరి
బీజం - "శివః శక్త్యా యుక్తః"
శక్తి - "సుధా సింధోర్మధ్యే"
కీలకం - "జపో జల్పః శిల్పం"
అర్ధము - భగవత్యారాధన
వినియోగము - శ్రీ లలితా మహా త్రిపురసుందరీ ప్రసాద సిద్ధి కోసము
స్తోత్ర సారాంశం.
సౌందర్య లహరిలోని స్తోత్రాల విషయ సారాంశం ఇక్కడ సంక్షిప్తంగా ఇవ్వబడింది.
భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివ కేశవ చతుర్ముఖాదులచేత కూడా పరిచర్యలు పొదే నిన్ను నావంటి పుణ్యహీనుడు స్తుతించడం ఎలా సాధ్యమౌతుంది?
దేవి పాదరేణువు మహిమ గురించి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవి పాదపరాగాన్ని గ్రహించి శక్తిమంతులౌతున్నారు.
దేవి అజ్ఞానులకు జ్ఞానాన్ని, చైతన్య రహితులకు చైతన్యాన్ని, దరిద్రులకు సకలైశ్వర్యాలను, సంసారమగ్నులకు ఉద్ధరణను ప్రసాదించునది.
తక్కిన దేవతలు వరదాభయముద్రలతో దర్శనమిస్తున్నారు. లోకరక్షకురాలైన శ్రీమాత పాదములే సకలాభీష్ట ప్రదాయములు, భయాపహములు, లోకరక్షకములు.
త్రైలోక్యమోహినియు, శ్రీచక్ర రూపిణియు అయిన శ్రీ త్రిపురసుందరీదేవిని పూజించి విష్ణువు మోహినీ రూపమును ధరించగలిగెను. మన్మధుడు లోకములను మోహింపజేయగలుగుచున్నాడు.
పార్వతి కటాక్షవీక్షణం వలన మన్మధుడు ఒంటరివాడైనను, శరీరహీనుడైనను, అల్పాయుధధారియైనను లోకములను వశీకరించుకొంటున్నాడు.
శ్రీదేవీ స్వరూప ధ్యానం: క్వణత్కాంచీధామా - మ్రోయుచున్న చిరుగంటల మొలనూలు కలది; కుంభస్తననతా - స్తన భారముచే కొంచెము వంగినది; పరిక్షీణామధ్య - కృశించిన నడుము కలది; పరిణత శరచ్చంద్రవదన - నిండు చందమామ వంటి మోము; ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - ధనుస్సును, పుష్పబాణములను, పాశమును, అంకుశమును చేతులలో ధరించినది; త్రిపురాంతకుని అహంకారరూపియైన దేవి.
"సుధా సింధోర్మధ్యే" - దేవియొక్క ఆవాసం వర్ణన - అమృత సముద్రమున, కల్పవృక్షముల తోటలలో మణిద్వీపం గురించి.
వేదాంతయోగసారము - శరీరంలోని షట్చక్రాల గురించి వర్ణన - కుండలినీ యోగ విధానము (ఆరోహణ)- సహస్రార చక్రంలో సదాశివునితో కలిసి దేవి విహరించుచున్నది.
కుండలినీ యోగం (అవరోహణ) గురించి తెలిపే రెండ శ్లోకం - శరీరంలో నాడీ ప్రపంచం గురించి, అమృత ధారా స్రావ మార్గం గురించి.
శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, 44 అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.
శ్రీలలితామహాభట్టారికామాత అనంత సౌందర్య స్తుతి, శివ సాయుజ్య ప్రసక్తి
దేవి కటాక్షమహిమా వైభవం వలన ఎంతటి వికారరూపుడైన ముదుసలి కూడా సుందరాంగులను మోహింపజేయగలడు.
షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.
సాత్విక ధ్యాన విధానం - శరత్కాలపు వెన్నెలను బోలు దేవికి నమస్కరించిన సజ్జనులకు అమృత రస తరంగిణులైన వాక్ప్రభావము లభించును.
రాజస ధ్యాన విధానం - అరుణాదేవిని ధ్యానించువారు సరస్వతీ సమానులగుదురు.
జ్ఞాన శక్తి రూపముననున్న, వశిన్యాది శక్తులతో కూడ దేవిని ధ్యానించువాడు మహాకావ్యములను వ్రాయగలడు.
ఇచ్ఛాశక్తి రూపమున కామరాజకూటమును అధిష్టించిన దేవిని ధ్యానించినయెడల వానికి అప్సరసలు కూడ వశులగుదురు.
అతి గోప్యము, గురువు ద్వారా గ్రహింపనగునది అయిన కామకలారూపము. ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తి ధ్యానము.
విష హరము, జ్వర హరము అగు ధ్యానము - దేవిని హృదయమున నిలుపుకొనువాడు అమృతతుల్యమగు తన చూపుచే, సర్పములను గరుత్మంతుడు శమింపజేసినట్లుగా, ఎట్టి జ్వరపీడితుల సంతాపమునైన పోగొట్టగలడు.
యోగ ధ్యాన విశేషము - సహస్రారంలోని చంద్రకళను ధ్యానించిన వారికి పరమానందము లభించును.
భక్తి మహిమ - తనను భక్తితో కోర్కెలు కోరెడి దాసుల వాక్యము పూర్తి కాకుండానే దేవి వారికి దుర్లభ సాయుజ్యమును ప్రసాదించును.
శివశక్తుల సంపూర్ణైక్యత
బ్రహ్మాండము యొక్క సృష్టిలయములు దేవి కనుసన్నల ఆజ్ఞల ప్రకారమే జరుగుచున్నవి.
సత్వరజస్తమోగుణముల వలన ఉద్భవించిన త్రిమూర్తులకు శివాణి పాదపూజయే నిజమైన పూజ.
మహాప్రళయంలో సర్వమూ లయమైనాగాని సతీదేవి మాంగల్య మహిమవలన శివుడు మాత్రము విహరించుచున్నాడు.
జ్ఞానయోగాభ్యాసనా సారము - ఆత్మార్పణమే దేవికి సముచితమైన అర్చన- ఏది చేసినా అంతా భగవతి పూజయే అని కవి విన్నవించుకొంటున్నాడు - "నా మాటలే మంత్రాలు, చేసే పనులన్నీ ఆవాహనాది ఉపచారాలు. నా నడకే ప్రదక్షిణం. నేను తినడమే నైవేద్యము. నిద్రించుటయే ప్రణామము. నా సమస్త కార్యములు నీకు పూజగా అవుగాక."
దేవియొక్క తాటంకములు (కర్ణ భూషణములు) అత్యంత మహిమాన్వితమైనవి. వాని సన్నిధిలో కాల ప్రభావము కూడ నిరోధింప బడును.
శివుడు ఇంటికి వచ్చు సమయములో ధేవి ఎదురేగబోగా ఆమె కాలికి మ్రొక్కుచున్న బ్రహ్మ, విష్ణు, మహేంద్రాదుల కిరీటములు అడ్డముగానున్నవని చెలులు హెచ్చరించుచున్నారు.
దేవిని నిరంతరము ధ్యానించు భక్తునకు ఎట్టి సంపదలు అవుసరము లేదు. వానికి ప్రళయాగ్నియే ఆరతివలె అగును.
దేవి నిర్బంధము కారణముగా 64 తంత్రములను శివుడు భూతలమునకు తెచ్చెను.
దేవీ మంత్రరాజము అయిన పంచదశాక్షరి సకలపురషార్ధ సాధకము. ఈ శ్లోకములో పంచదశాక్షరి సంకేతములతో చెప్పబడినది. (షోడశాక్షరి మంత్రము గుహ్యము. గురువు ద్వారా మాత్రమే శిష్యుడు గ్రహించవలెను. కనుక ఈ శ్లోకములో 15 అక్షరములే చెప్పబడినవి.)
కౌలులు బాహ్య విధానములో చేయు దేవి అర్చన వర్ణన. ఈ శ్లోకము బీజాక్షరములున్నవి. ఇది అధికారము, ఐశ్వర్యము, మోక్షము అవంటి ప్రయోజనములను కలిగించును.
శివశక్తుల ఐక్యత గురించి. నవ వ్యూహాత్మకమైన భైరవస్వరూపము ఇందు వర్ణితము. శివుడు ఆనంద భైరవుడు. పరాశక్తియే మహాభైరవి. వారు వేరు వేరు కాదు.
షట్చక్రములందున్న పృధివ్యాధి తత్వములు దేవియే. అన్ని రూపములు ఆమెయే.
ఆజ్ఞా చక్రమునందున్న పరమ శివునికి నమస్కారము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - పరశంభునాధుడు, పరచిదంబ.
విశుద్ధి చక్రము నందలి దేవీ తత్వము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - వ్యోమేశ్వరుడు, వ్యోమేశ్వరి.
అనాహత చక్రము నందలి హంస ద్వంద్వమునకు వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - హంసేశ్వరుడు, హంసేశ్వరి
స్వాధిష్ఠాన చక్రము నందలి సంవర్తాగ్నికి (అగ్ని తత్వము గలది) స్తుతి. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - సంవర్తేశ్వరుడు, సమయాంబ
మణిపూరక చక్రము నందుండి ముల్లోకములను తడుపు నీలమేఘమునకు ధ్యానము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - మేఘేశ్వరుడు, సౌదామిని
మూలాధార చక్రము నందు నటన చేయు ఆనందభైరవునికి వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - ఆదినటుడు, లాస్యేశ్వరి (ఆనంద భైరవుడు, సమయ)
మొదటి 41 శ్లోకములు "ఆనంద లహరి"యనబడును.
42వ శ్లోకమునుండి "సౌందర్య లహరి"గా భావింపబడుచున్నది.
ద్వాదశాదిత్యులనే మణులతో కూర్చబడిన దేవి కిరీటం వర్ణన.
దేవి కురులు అజ్ఞానమును నశింపజేయునని వర్ణన. .. (సశేషం).
No comments:
Post a Comment