దుఃఖిత మానవులకు ధర్మబోధ
..................................
కురుక్షేత్రం ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక దశలో ఎదురవుతుంది. ఆప్తులను కోల్పోయి జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. యుద్ధానికి ముందు అర్జునుడు స్వజన నాశనం చేయలేనంటూ మాయా మోహితుడై విషాదంలో మునిగిపోతే అదే విషాద యోగం అయ్యింది. క్షత్రియ ధర్మం బోధించి అర్జునునికి కర్తవ్య బోధ చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. యుద్ధం ముగిసి అపార ప్రాణ నష్టం జరిగిన తరువాత ధర్మజుడు విషాదంలో మునిగిపోతే సోదరులు, భార్య, మహర్షులు కర్తవ్య ఉపదేశం చేస్తారు. సర్వం వదిలి అడవుల బాట పట్టడం, భిక్షాటనతో బతకాలనుకోవడం తగ్గదయ్యా అని హితోపదేశం చేస్తారు. రాజయోగి జనకుడు కూడా ఇదే స్థితిలో పడ్డప్పుడు ఆయన భార్య చెప్పిన హితవు ధర్మజునికి అర్జునుడు గుర్తుచేస్తాడు. ఆ పతివ్రతా శిరోమణి జనకునితో ఇలా అంటుంది. " నాధా ధనధాన్య సమృద్ధమైన రాజ్యాన్ని విడిచి భిక్షాటన చేయడం అనుచితం. భిక్షుక వృత్తి వల్ల దేవతలు, పితృదేవతలు, అతిథులు తృప్తి పడరు కదా? పెట్టేవాడి కంటే యాచకుడు ఎప్పుడూ తక్కువ వాడే కదా? నీ వల్ల ఎందరో జీవిస్తుండగా నీవు కర్మ త్యాగం చేయడం తగునా? సంసారంలో ఉంటూనే నిరాశక్తంగా ఉంటూ శత్రు మిత్రులను సమంగా చూసే వాడికే మోక్షం. మనసులో కాలుష్యం లేనివాడికి కాషాయంతో పని ఏమిటి? భిక్షకులను పోషించడం మంచిది కానీ వారివలే నీవూ భిక్షకుడివి కావడం శ్రేయస్కరమా?" అని భర్తను ప్రశ్నిస్తుంది. మహాభారతంలోని శాంతిపర్వం దుఃఖిత మానవులకు దిక్చూచి. హరిఓం/ఆదూరి వెంకటేశ్వర రావు.
No comments:
Post a Comment