Friday, December 26, 2025

 ☘️'ఎంతటి మహనీయునకు ఉద్భవించిన తలవ్రాత మార్చoగ తరము గాదు... అన్నట్టు సృష్టి మొత్తం దైవానుగ్రహంతో నడుస్తుంది. తామనుకున్నట్టే అ జరుగుతోందని భ్రమపడతారు మానవులు. తెలియనిదేమంటే జరిగేవన్నీ భగవంతుడి కనుసన్నల్లో, దైవ నిర్ణయం ప్రకారం జరుగుతున్నాయి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు' ఒక జీవి శ్వాస పోసుకోవాలన్నా, ఆయువు ముగిసి పోవాలన్నా అంతర్యామి నిర్దేశం ప్రధానం. ఆధ్యాత్మిక కోణానికి ఒకవైపు అలా ఉంటే, స్వశక్తితో, సంకల్పబలంతో నుదుటిరాతను సరిదిద్దుకోవచ్చని నిరూపించిన వాళ్లూ ఉన్నారు. పదహారేళ్ల అల్పాయువుతో జన్మించిన మార్కండేయుడు, అకుంఠిత తపోదీక్షతో మరణాన్నీ జయించాడు. శివలింగాన్ని కౌగిలించుకుని పరమేశ్వరుని ధ్యానించిన అతణ్ని యమపాశాలు తాకలేకపోయాయి. కైలాసనాథుడే భక్తుడి కోసం దిగివచ్చాడు. కఠిన దీక్షతో ప్రయత్నిస్తే తలరాత మార్చుకోవడం సులభమేనన్న పాఠాన్ని బోధించింది మార్కండేయ చరిత్ర.

☘️ద్యుమత్సేనుడి పుత్రుడు సత్యవంతుడికి సరిగ్గా ఏడాదే ఆయువుందని తెలిసీ పతిగా స్వీకరించింది సావిత్రి. అనుకున్న దుర్దినాన యమపాశాలతో ప్రత్యక్షమయ్యాడు దండధరుడు. దిగులు పడితే సాధించలేమనే ఎరుక కలిగిన సావిత్రి చురుకుగా ఆలోచించింది. అద్భుతమైన జ్ఞానంతో, వాక్చాతుర్యంతో సమవర్తిని మెప్పించి, మామగారి కంటిచూపును, కోల్పోయిన రాజ్యాన్ని, తండ్రికి పుత్రులను వరాలుగా పొందడమే కాక పతి ప్రాణాలనూ దక్కించుకుంది. అదీ సంకల్పబలమని లోకాలు గర్వపడేలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది సావిత్రి.

☘️నుదుటిరాతని విధికి వదిలేయకుండా తామే లిఖించుకున్న వారున్నారు చరిత్రలో, కొలువుకోసం వెళ్లిన చాణక్యుడిని దారుణంగా అవమానించారు నంద రాజులు. విధి లిఖితమంటూ చింతించకుండా తరుణోపాయం వెదికాడాయన. సరైన బాలుణ్ని చేరదీసి ఉత్తమ వీరుడిగా మలిచాడు. నందరాజులను అంతం చేస్తూ, మౌర్యరాజ్య స్థాపనకు పునాది వేశాడు. గొప్ప ప్రామాణిక గ్రంథంగా పేరొందిన కౌటిల్యుడి అర్థశాస్త్ర సృజనకు బీజం మాత్రం ఆయన హృదయంలో రగిలిన అవమానాల ప్రతీకార జ్వాలలతోనే పడింది.

☘️నుదుటిరాత ప్రకారమే జరుగుతుందని భావిస్తూ కాలం గడిపేస్తారు కొందరు. తలరాత రాసుకుంటానని ధైర్యంగా అడుగేసి విజయం సాధించేవారు ఇంకొందరు. అలాంటివారే సమాజానికి దారిదీపాల్లాంటివారు. కొందరు... సమాజం మారాలంటారు కానీ వాళ్లు మారరు. అక్కడే ఆగిపోతారు. దాంతో వెనకున్న వాళ్లు ముందుకు వెళ్లిపోతారు.  బలమైన సంకల్పం, ఉన్నత ఆశయాలతో ముందడుగేస్తేనే విజయం ముంగిట నిలిచేది. గెలుపు పిలుపు వినపడేది.

☘️తలరాత కేవలం విధాత ప్రసాదించిన ముడిసరుకు. దాన్ని గొప్పగా మలచుకునే శక్తి మన(సు) లోనే ఉంది. యోగవాశిష్టంలో చెప్పినట్టు మనసులో ఆలోచించి సంకల్పించినప్పుడే కార్యాలను సఫలీకృతం చేసుకోగలం. ఏ కార్యం జరగాలన్నా ప్రయత్నం తప్పనిసరి. సంకల్పం, ప్రయత్నం, సత్కర్మలు మాత్రమే భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

No comments:

Post a Comment