మారిన అమ్మ
రాత్రి 9:00 అయింది. డిసెంబర్ నెల కావడం వల్ల చలి వణికించేస్తోంది. టేబుల్ మీద ఉన్న సెల్‌ఫోన్ అదే పనిగా మోగుతుంటే, వంటింట్లోంచి పరుగు పరుగున వచ్చి ఫోన్ తీసింది రాజ్యలక్ష్మి.
“హలో” అనగానే —
“అమ్మ ఎలా ఉన్నావ్?” అని కొడుకు రంగనాథ్ అడిగాడు.
“నేను ఎల్లుండి బయలుదేరుతున్నాను. సంక్రాంతి పండక్కి… నెలరోజుల పాటు అక్కడే ఉంటాను. పండగ స్పెషల్ తయారు చేసి రెడీగా పెట్టు. ఇక్కడ పిజ్జాలు, బర్గర్లు తిని నోరు చచ్చిపోయింది. వెళ్లేటప్పుడు గోంగూర పచ్చడి, స్వీట్లు పట్టుకెళ్తాను…” అంటూ తన కావాల్సిన లిస్ట్ అంతా చిన్నపిల్లలాగే చెప్పడం మొదలుపెట్టాడు.
“నాన్న ఎలా ఉన్నారు? ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? పిల్లలు రావటం లేదు. మీ కోడలు కూడా రావట్లేదు. నేనొక్కడినే వస్తున్నా…” అన్నాడు.
“సరే రా… జాగ్రత్తగా బయలుదేరి రా” అంటూ పిల్లల గురించి, కోడలు గురించి కుశల ప్రశ్నలు వేసి ఫోన్ పెట్టేసింది రాజ్యలక్ష్మి.
ప్రతి ఏటా సంక్రాంతికి సొంత ఊరు వచ్చి నెలరోజుల పాటు భార్యా పిల్లలతో ఉండే రంగనాథ్, వచ్చినప్పుడల్లా తనకు కావాల్సిన పచ్చళ్ళు, స్వీట్లు, పొడులు, ఆవకాయలు అన్నీ తయారు చేయించుకుని తీసుకెళ్తుంటాడు. పిల్లలకిష్టమని, భార్యకి ఇష్టమని ఇలా ఏవేవో చెబుతుంటాడు.
చిన్నప్పటి నుంచే చిరుతిళ్లంటే రంగనాథ్‌కు ఇష్టం.రాజ్యలక్ష్మి కొడుకు ఇండియా వచ్చినప్పుడల్లా నెలరోజులపాటు కొడుకుకి, కోడలికి, మనవలకి రోజూ రెండు పూటలా వాళ్లకు ఇష్టమైన వంటలు చేసి తృప్తి పడేది. రాజ్యలక్ష్మి గారే కాదు — ఏ తల్లైనా అలాగే చేస్తుంది.
కానీ వయసు పెరిగిన తర్వాత ఆమెకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. దానికి తోడు ఈ మధ్యకాలంలో “ఇవాళ ఉన్న మనిషి రేపు ఉండడం లేదు” అన్న భావన బాగా బలపడింది. కరోనా తర్వాత ఈ భయం మరింత పెరిగింది.
చనిపోయిన తర్వాత ఎన్నో కారణాలు చెబుతున్నారు గానీ, బతికుండగానే తీసుకోవాల్సిన జాగ్రత్త ఎవరు తీసుకోవాలి?
ఇంట్లో తల్లి లేదా భార్య — ఈ ఇద్దరే నిజమైన ఆరోగ్య సంరక్షకులు.
ఒక కుటుంబంలో ఆరోగ్యానికైనా, ఆర్థికానికైనా గట్టి మార్పు తీసుకురావాలంటే ఒక స్త్రీ వల్లే సాధ్యం. ఆరోగ్యానికి, అనారోగ్యానికి పుట్టినిల్లు వంటిల్లు. వంటిల్లుకు యజమాని మన ఇల్లాలు. ఒక ఇల్లాలు తలుచుకుంటే ఏ మార్పైనా తీసుకురాగలదు.
అష్టకష్టాలు పడి అమెరికా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని ఆ పల్లెటూరికి వచ్చిన రంగనాథ్‌కి రాత్రి 12 గంటలైంది. వచ్చీ రాగానే కొడుకును కౌగిలించుకుని,
“ఏమిట్రా అలా చిక్కిపోయావు?” అని అడిగింది రాజ్యలక్ష్మి.
“గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 కిలోలు పెరిగాను అమ్మ” అన్నాడు రంగనాథ్.
“ఆరోగ్యం బాగానే ఉందా?” అని ఆందోళనగా అడిగింది.
“శంకు చక్రాలు రెండూ ధరించాను అమ్మ” అన్నాడు.
“అంటే?”
“బీపీ, షుగర్ రెండూ వచ్చాయి.”
“సరే… పద సామాన్లు గదిలో పెట్టేద్దాం. ఏమైనా తింటావా?”
“లేదు అమ్మ. హోటల్లో తిని వచ్చాను.”
స్నానం చేసి ఒక గ్లాసు మజ్జిగ తాగి పడుకున్నాడు రంగనాథ్.
“మజ్జిగ ఇంత నీళ్లలా ఉంది?” అనుకుంటూ మంచం మీద వాలిపోయాడు. ప్రయాణ బడలికతో వెంటనే నిద్ర పట్టేసింది.
తెల్లవారుజామున తలుపు గట్టిగా కొట్టడంతో మెలకువ వచ్చింది. ఎదురుగా అమ్మ.
“గుడ్ మార్నింగ్ రా!”
“ఏమిటమ్మా అప్పుడే లేపావు?” అనగానే,
“పద… వాకింగ్‌కి వెళ్దాం” అంటూ ముందే వీధిలోకి నడిచింది.
అమ్మతో గొడవ ఎందుకని రంగనాథ్ కూడా వెంబడించాడు. రెండు కిలోమీటర్లు నడిచేసరికి ఒళ్లంతా చెమట. అమెరికాలో అయితే ఎనిమిది గంటలకు లేచే అలవాటు. ఇక్కడ పొద్దున్నే నడక!
ఇంటికి వచ్చాక బాత్రూంలోకి వెళ్లి బయటకు వచ్చేసరికి అమ్మ కప్పు చేతిలో పెట్టింది.
ఒక గుక్క తాగగానే —
“ఇదేంటమ్మా? టీ కాదా?”
“కాదు రా… తేనె, నిమ్మరసం, అల్లం.”
“టీ మానేశామా?”
“అవును రా… రోజూ ఇదే.”
స్నానం చేసి వచ్చేసరికి టేబుల్ మీద రాగి దోశ, వేరుశనగ చట్నీ, బొప్పాయి ముక్కలు.
“ఇదేనా నాకీ టిఫిన్?” అని ఆశ్చర్యపోయాడు రంగనాథ్.
అయిష్టంగానే తినడం మొదలుపెట్టాడు. కానీ తింటూ పోతే రుచిగా అనిపించింది. మళ్లీ మారు అడగలేదు అమ్మ. మైసూర్ బజ్జీలు గుర్తొచ్చాయి. అయినా మౌనంగా తినేశాడు.
మధ్యాహ్నం లంచ్ కూడా అంతే. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ, పళ్ళు పక్కనే. ఉప్పు, కారం, పులుపు — అన్నీ కొలతల్లో.
“దేశ రక్షణకి మిలటరీ ఎంత క్రమశిక్షణగా ఉంటుందో, మన ఆరోగ్యానికి అమ్మ అంతే క్రమశిక్షణ తీసుకొచ్చింది” అన్నాడు నాన్న నవ్వుతూ.
కొద్ది రోజులు అలాగే గడిచాయి. సంక్రాంతి వచ్చింది. గతంలా పొయ్యిలు, హడావిడి లేదు. ఇంట్లో పండిన కూరగాయలే. ఆవులు, సహజ ఎరువులు — ఊరంతా అదే మార్గం.
పండగ కూడా నిశ్శబ్దంగానే గడిచిపోయింది.
అమెరికా వెళ్లే రోజు వచ్చింది. రాజ్యలక్ష్మి కొడుకి రెండు వీడియోలు ఇచ్చింది.
“ఇవి కోడలికి ఇవ్వు. నూనె లేకుండా వంటలు చేసే వీడియోలు.”
ఆ తర్వాత ఆమె చెప్పిన మాటలు రంగనాథ్‌ను లోలోపల కదిలించాయి.
“అమ్మ అంటే కడుపు నింపేదే కాదురా… ఆరోగ్యం కాపాడేదీ. కాలం మారింది. శ్రమ తగ్గింది. అనారోగ్యాలు పెరిగాయి. ఇప్పుడు తల్లి, ఇల్లాలే ఆరోగ్య రక్షకులు…”
ఆ మాటల్లో నిజం గ్రహించిన రంగనాథ్ మౌనంగా అమెరికా ప్రయాణమయ్యాడు.
రచన : మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
.
No comments:
Post a Comment