*#గిజిగాడు_పక్షి, #గిజిగాడి_గూళ్ళు*
- ముత్తేవి రవీంద్రనాథ్ గారి వ్యాసం
మనం గ్రామసీమలలో ఆరుబయట వెళుతూ ఉంటే ఎక్కువగా ఈత చెట్లకూ, తుమ్మ చెట్లకూ, తాటిచెట్టు ఆకులకు పిట్టలు అసంఖ్యాకంగా తలకిందులుగా వేళ్ళాడుతూ ఉన్న ఈ గూళ్ళను గిజిగాడి గూళ్ళు అంటాం. ఈ గూళ్ళను నిర్మించే #గిజిగాడు అనే తెలివైన పిట్ట పేరిట వీటిని గిజిగాడి గూళ్ళు అంటారు.
వర్షాకాలంలో జతకట్టే ఈ పక్షులు తమ గూళ్ళను ఎంతో శ్రద్ధతో ప్రయాసపడి నిర్మించుకుంటాయి. ఇతర పక్షులు, ముఖ్యంగా పాముల నుంచి తమ గుడ్లు, పసికూనలను రక్షించుకోవడం కోసం అవి గూళ్ళను చిటారు కొమ్మలకు వేళ్ళాడేటట్లు, గూడు ముఖద్వారం బహిరంగంగా ఉండకుండా పొడవాటి గొట్టం లో నుంచి గూటిలోకి ప్రవేశించే విధంగానూ ఏర్పాటు చేసుకుంటాయి. మరో వింత విషయంకూడా నేను గమనించాను. ఈ వలసపక్షులు వానాకాలం ముగిసి తమ పిల్లలతో స్వస్థలాలకు వెళ్ళిపోయేటప్పుడు వదలివెళ్ళే ఖాళీ గూళ్ళలో ఎండిపోయిన బురద పెళ్ళలు కనిపిస్తాయి. అవి ఎందుకంటే తమకూ, తమ కూనలకూ గూళ్ళలో వెచ్చదనంకోసం అవి తమ గూళ్ళలోని ఒక ఎత్తైన వేదికమీద కొద్దిగా బురద తీసుకొచ్చిపెట్టి, ఆ బురదలో మిణుగురు పురుగుల్ని తీసుకొచ్చి గుచ్చుతాయి. రాత్రిపూట ఆ మిణుగురుల కాంతి, వెచ్చదనం అవి అనుభవించడానికి అలా అలవాటు పడ్డాయి. చూడండి. ఎంత తెలివైన పక్షులో. Ploceus philippinus అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పక్షులు Ploceidae (ప్లోసీడే) కుటుంబానికి చెందినవి.
వేసవి అంతా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండి, ఇక తొలకరి వానలు రాబోయే ముందు బహిరంగ మైదాన ప్రదేశాలకు వలసవచ్ఛే ఈ బంగారు పిచ్చుకనే గిజిగాడు అనికూడా అంటారు. సాముదాయికంగా జీవించే ఈ పక్షులు ఇంచుమించుగా సాధారణ పిచ్చుకల పరిమాణంలోనే ఉంటాయి. వీటి ఈకలు గోధుమ వన్నెలో ఉంటాయి. పునరుత్పత్తి చేసే రోజులలో మగ పక్షి తల, రొమ్ము భాగంలోని ఈకలు ఆకర్షణీయమైన బంగారు పసుపు వన్నెకు మారిపోతాయి. మగపక్షులు నారతోనూ, చీల్చిన తృణధాన్యాల ఆకులతోనూ, చీల్చిన జమ్ము, తుంగ, రెల్లు కాడల (reeds)తోనూ, తమ గూళ్ళను దృఢంగా అల్లుతాయి. ఈ గూళ్ళు చెట్ల చిటారు కొమ్మలకు ఎంత బలంగా పెనవేయబడతాయంటే ఎంత తీవ్రమైన తుపాను గాలులకు కూడా అవి ఊగుతాయేగానీ, ఊడి కిందపడవు. పునరుత్పత్తి చేసే సమయంలో ఆడ పక్షులు, గూళ్ళు కట్టేటప్పుడు మగ పక్షులు కిచ కిచ మంటూ చేసే రొద అంతా ఇంతా కాదు.
ఒక పొడవాటి సంచిలా అనిపించే ఈ గూడుకు ముఖద్వారం ఒక ఇరుకైన, పొడవాటి గొట్టంలా ఉంటుంది. వీటి గుడ్లను తినడానికి వచ్ఛే పాములు, ఇతర పక్షులు ఈ గూళ్ళలో ప్రవేశించకుండా నిరోధించడానికే అవి ఈ ఏర్పాటు చేసుకున్నాయి. ఎగురుతూ వచ్చే గిజిగాళ్ళు ఒడుపుగా ఆ గొట్టం ఆకారంలోని గూడులో ప్రవేశించి, పైకి ఎగురుతూ మధ్యభాగంలో ఉన్న ఒక దిమ్మె వంటి ప్రదేశానికి చేరుకుంటాయి. ఆ దిమ్మె మీద ఆడ పక్షులు గుడ్లను పొదగడం, పక్షి కూనల్ని (Fledglings) సాకడం చేస్తాయి. గిజిగాడి పక్షులు మనుషుల్ని చూసి కాసేపు మౌనంగా మారినా, కొంచెం అలవాటు పడ్డాక మనం వాటి దగ్గరగా వెళ్ళినా అవి ఏ మాత్రం జంకవు. మగ పక్షులు శ్రమించి గూళ్ళు నిర్మిస్తే ఆడ పక్షులు తమకు ఆ గూడు నచ్చితేనే అక్కడ ఉండేందుకు సిద్ధపడతాయి. గూళ్ళు నిర్మించిన మగ పక్షులు ఆడ పక్షుల్ని ఆ గూటికి రమ్మని ఆహ్వానిస్తున్నాయా - అన్నట్లుగా పెద్దగా గోల చేస్తాయి. ఈ పక్షులు తృణ ధాన్యాల పంటలకు కొంత మేరకు హాని కలిగిస్తాయి. చలికాలంలో మగ పక్షుల ఈకల రంగు తిరిగి గోధుమ వన్నెకు మారిపోతుంది. పిల్లాపాపలతో సహా అవి గుంపులు గుంపులుగా తిరిగి అరణ్యాలలోని తమ నివాసాలకు వెళ్ళిపోయి, వేసవి అంతా అక్కడే గడుపుతాయి. అవి వెళ్ళిపోయాక మునియాలు అనే వలస పక్షులు ఈ గిజిగాడి గూళ్ళలో నివసిస్తాయి. గిజిగాడి గూళ్ళలో ఉండే దిమ్మె మీద బురదతో నిర్మించిన ఒక వేదిక ఉంటుంది. గూటిలోని తన పిల్లలకు వెలుతురు, వెచ్చదనం కోసం మగ పక్షి మిణుగురు పురుగులను తెచ్చి, ఆ బురదలో గుచ్చుతుందని తెలుసుకుంటే గిజిగాడు పిట్టలు ఎంత తెలివైనవో మనం గ్రహించగలం. గిజిగాడు తన గూడును నిర్మించినంత నైపుణ్యంతో మానవులు కూాడా నిర్మించలేరన్నది వాస్తవం. పక్షి శిక్షకులు మగ గిజిగాడు పక్షులకు శిక్షణ కూడా ఇస్తారు. దారం మరియు పూసలతో తమ ముక్కును ఉపయోగించి అవి హారాలు తయారు చేస్తాయంటే నమ్మశక్యం కాకున్నా అది నిజం. ఏ అంకెతో ఉన్న కార్డును తీసుకు రమ్మంటే ఆ పక్షులు సరిగ్గా అదే కార్డును తీసుకొస్తాయి. శిక్షకులు శిక్షణ ఇస్తే లవంగం లేక యాలుక పేరు చెప్పి మనం ఏది తీసుకురమ్మంటే దాన్ని తన ముక్కున కరుచుకుని తీసుకువస్తుందీ పక్షి. దాని జ్ఞాపకశక్తి, నైపుణ్యం అంతటివి మరి. శిక్షణ పొందిన కొన్ని పక్షులు కుంచెతో పెయింటింగ్ చేస్తాయి. సంగీత వాద్యాలను లయబద్ధంగా మోగిస్తాయి.
తెలుగులో పసుపు పిట్ట లేక పచ్చ పిట్ట అని కూడా పిలిచే గిజిగాడును ఆంగ్లంలో వీవర్ బర్డ్ (Weaver Bird) లేక బాయా (Baya) అంటారు. దీని శాస్త్రీయ నామం ప్లోసియస్ బాయా (Ploceus baya) లేక ప్లోసియస్ ఫిలిప్పినస్ (Ploceus philippinus).
No comments:
Post a Comment