🔱ఓం నమః శివాయ🔱:
*🧘సౌందర్యలహరి🧘♀*
🪷🪷🧘🧘♀🪷🪷 చండీమాత పాదములు బీదలకు భద్రమైన సకలైశ్వర్యములను ప్రసాదించును. చండీమాత పాదములకు దేవతలు చేతులు జోడించి అంజలి ఘటించుచున్నారు. మాత కాలిగోళ్ళనెడు చంద్రుల కాంతికి ఆదేవతాస్త్రీల కర పద్మముల ముకుళించుచున్నట్లుగా అనిపించుచున్నది. ఆ చంద్రులు స్వర్గములో (దేవతలకు సంపదలనిచ్చెడు) కల్పవృక్షములను పరిహసించుచున్నట్లున్నది.
తల్లీ! నీ పాదములు ఎల్లప్పుడు కోరిన సంపదలనిచ్చునవి. సౌందర్యమనెడు మకరందమును వెదజల్లెడు కల్పవృక్షపు పుష్పగుచ్ఛములు. ఆఱు ఇంద్రియములతో (మనసు + జ్ఞానేంద్రియములు) గూడిన నా జీవము ఆఱు కాళ్ళ తుమ్మెదవలె నీపాదములను ఆశ్రయించును గాక.
మాతా! సుందర గమనా! నీ భవనములోని పెంపుడు హంసలు నీ నడకల తీరును నేర్చుకొన గోరి, నీ వెంటనే తిరుగుచున్నవి. నీ పాదముల మణిమంజీరములు (అందెలు) ఆ హంసలకు పదన్యాసమునందు శిక్షణ నిచ్చుచున్నట్లుగా ఉన్నది.
42వ శ్లోకము నుండి 91వ శ్లోకము వరకు శంకరాచార్యుడు శ్రీమాత కిరీటము నుండి పాదములవరకు స్తుతించాడు. ఇప్పుడు దేవి సంపూర్ణ స్వరూపము వర్ణింపబడుచున్నది.
దేవీ! బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్రులు నీకు సమీప సేవను పొందుటకై నీ మంచమునకు కోళ్ళుగా ఉన్నారు. శివుడు తెల్లని కాంతి అను మిషతో నీకు పైని కప్పుకొనుటకు దుప్పటియైనాడు. అట్టి సదాశివుడు నీ యెఱ్ఱని దేహకాంతులు ప్రతిఫలించిన కారణమున తానును ఎఱ్ఱబారి మూర్తీభవించిన శృంగార రసము వలెనుండి నీ కనులకు వినోదము గొలుపుచున్నాడు. (శివుని శరీర వర్ణం తెలుపు. దేవి శరీర వర్ణం ఎఱుపు.)
కామేశ్వరి సంపూర్ణ సౌందర్య స్తుతి - శివాణి కేశములు వక్రమైనవి. సహజ మందహాసము సరళమైనది. దేహము శిరీష పుష్పము వలె మృదువైనది. కుచ ప్రాంతము కఠినమైనది. నడుము లతవలె సన్ననైనది. నితంబములు విశాలమైనవి. సదాశివుని కరుణా శక్తి మూర్తీభవించిన రూపమే ఆ సౌందర్యమూర్తి. అట్టి అరుణాదేవి లోకములను రక్షించుటకు జయమొందుగాక.
సూర్యుడు దేవి పాదములవద్ద సేవ చేయుచున్నాడు. తన కిరణ తీవ్రతను ఉపశమించి, అద్దమువలె ధగధగలాడుచున్నాడు. ఆ అద్దములో దేవి ముఖపద్మము కనుపించుచున్నది. (సూర్యుని హృదయ ఫలకములో దేవి ముఖము ప్రతిబింబించుచున్నది). ఆ పద్మము సదా వికసించియున్నందున చంద్రుని బాధ లేదు (రాత్రి కాదు కనుక సూర్యుని సేవకు అంతరాయము లేదు).
చంద్రబింబమును దేవి అలంకరణ సామగ్రి పెట్టెగా చెప్పుట - దేవీ! చంద్రబింబము జలమయమైన మరకత మణితో చేయబడిన పెట్టె. అది కళలు అనే కర్పూరముతో నిండియున్నది. నీవు వాడుకొనే కస్తూరియే అందులో కనుపించే మచ్చ. ప్రతిదినము దీనిలోని వస్తువులను (కస్తూరిని, కర్పూర శకలాలను) నీవు వాడుకొనుచుండుట చేత ఆ పెట్టె తగ్గిపోతున్నది. (దానిలోని రంధ్రము పెద్దగా అగుచున్నది.) దానిని బ్రహ్మ మరల పూరిస్తూ ఉన్నాడు. (చంద్రునిలోని హెచ్చుతగ్గులు - కృష్ణ పక్షము, శుక్ల పక్షము).
దేవీ! నీవు త్రిపురారి అంతఃపురాధిదేవతవు. (శివుని పట్టపురాణివి). నీ పాదసేవ దుర్లభము. కనుక ఇంద్రాది దేవతలు నీ ద్వారముచెంత కావలిగానున్న అణిమాది సిద్ధుల ప్రసాదములతో అతులమైన ఇష్టసిద్ధులను పొంది తృప్తులగుచున్నారు.
సతీదేవీ! గొప్పకవులను సరస్వతీవల్లభులంటారు. గొప్ప సంపన్నులను లక్ష్మీపతులంటారు. కాని నీ కౌగిలింత మాత్రము ఈశ్వరునకు మాత్రమే లభించును. గోరింట చెట్టుకు కూడ లభించదు.
గిరిజా దేవీ! వేదవిదులు నిన్ను సరస్వతి యనియు, లక్ష్మి యనియు, పార్వతి యనియు చెబుతారు. కాని నీవు ఈ మువ్వురికంటె వేరైన మహామాయవు. పరబ్రహ్మయగు సదాశివుని దేవియగు చంద్ర కళగా ఆరాధింపబడు శ్రీవిద్యవు. దేశకాల పరిమితులకు అతీతమైన మహిమ గల దానవు. మహామాయవై విశ్వమును భ్రమింపజేయుచున్నావు.
ఉమా దేవీ! సముద్భూత స్థూల స్తనభరమైన వక్షోభాగము,మనోహరమైన దరహాసము, కడగంటి చూపులందు మన్మధులు, కదంబమువంటి ప్రభ కలిగిన తనువు - ఈ గుణములన్నియు శివుని మనస్సునందు నీవేయను భ్రాంతి కలిగించును. నిర్మలమైన మనస్సుతో దేవిని ధ్యానించు భక్తులకు ఈ గుణములు కలుగుటయే వారి భక్తికి పరమావధి.
తల్లీ! నేను జ్ఞానార్ధిని. నీ పాదములు కడిగినపుడు లత్తుక రసముతో ఎఱ్ఱనైన నీ పాదోదకమును త్రాగే భాగ్యము నాకెప్పుడు లభిస్తుందో? అది మూగవారిని కూడ కవులుగా చేయునది. ఆ జలమునకు సరస్వతీ దేవి ముఖ తాంబూల రస గుణము కలిగనది.
(ఈ శ్లోకములో షట్-కమల భేదనము, సహస్రార కమలమును చేరుకొనుట సూచింపబడినవి) దేవీ! సాదాఖ్య చంద్రకళ యగు నిన్ను భజించువాడు విద్యను, ఐశ్వర్యమును పొంది (సరస్వతిని, లక్ష్మిని వశము చేసుకొని) బ్రహ్మకును, విష్ణువునకును విరోధిగా వెలుగుచున్నాడు. రమ్యమైన రూపము పొంది రతీదేవి పాతివ్రత్యమును శిధిలము చేయగలడు.
చిరంజీవియై జీవుని అవిద్యను జయించి బ్రహ్మానంద రసమును ఆస్వాదించును. (సాదాఖ్య కళను ఉపాసించు వానికి ఐహికాముష్మిక ఫలములు రెండును సిద్ధించును)
సర్వ జ్ఞానములకు, సకలైశ్వర్యములకు నిధియైన శ్రీదేవీ! నిత్య మందహాస వదనా! నిరవధిక గుణ నిధానమా! నీతి నిపుణా! నిరాటంక జ్ఞానా! నియమ వశమైన చిత్తములందు నివశించుదానా! నియమ విధులకు కట్టుబడని దానా! నిఖిల నిగమాంత స్తుత పదా! ఆపదలు, ఆటంకములు సమీపించని దానా! నిత్యా! నా స్తుతిని కూడ స్వీకరించు తల్లీ! (చండిక స్తోత్రము
చేతను, భాస్కరుడు నమస్కారము చేతను, విష్ణువు అలంకారము చేతను, శంకరుడు అభిషేకము చేతను సంతుష్టులగుదురు.)
సర్వ వాక్కులకు జననీ! ఈ విశ్వములోని వాక్కులన్నయును నీవే! కనుక నా స్తోత్రములోని వాక్కులు కూడా నీవే! అట్టి నీ వాక్కులచేతనే నిన్ను స్తుతించుచుంటిని. దీప కాంతులతో సూర్యునికి నీరాజనమిచ్చినట్లుగాను, చంద్రకాంత శిలా జలముచే చంద్రునికి అర్ఘ్యమిచ్చినట్లుగాను, జలములతో సముద్రుని తృప్తి పరచినట్లుగాను నేను నీ వాక్కులచేత నిన్ను స్తుతించి నీకు ప్రీతి కలిగింపనెంచితిని.శిశువు పలుకులు నిరర్ధకమైనవైనను తల్లికి ఆనందమే కలిగించును కదా! అట్లే ఈ భక్తుని స్తుతి సకల లోకమాతవగు నీకు ఆనందము కలిగించును గాక.
శ్రీవిద్యా రహస్యాలు, మంత్ర శాస్త్రం
శాక్తేయ సంప్రదాయంలో శ్రీవిద్య చాలా ముఖ్యమైనది. శ్రీవిద్య అంటే వివిధ రకాలుగా నిర్వచిస్తారు. త్రిపుర సుందరిని ప్రసన్నురాలిని చేసుకొనుటకు మూడు విధాలుగా ఆరాధనాదీక్షను ఆచరిస్తారు (1) దేవీ ధ్యానము (2) శ్రీచక్ర పూజ (3) శాక్త సిద్ధాంత అధ్యయనము. ఈ మూడింటినీ కలిపి శ్రీవిద్య అంటారు.వీటిలో శ్రీచక్రపూజ చాలా ముఖ్యంగా భావిస్తారు. దీనినే మరొక విధంగా లలితా సహస్రనామ స్తోత్రము పారాయణము, శ్రీచక్రార్చన, షోడశాక్షరీ మంత్రము అనుష్ఠానము కలిపి "శ్రీవిద్య" అని చెబుతారు. శ్రీవిద్యలో "వామాచారము", "సమయాచారము" అనె రెండు విధాలున్నాయి. సౌందర్య లహరిలో శ్రీచక్రం గురించి 11వ శ్లోకంలో చెప్పబడింది.
మిగిలిన అనేక శ్లోకాలలోఅనేక శ్రీవిద్యా రస్యాలున్నాయి అని చెబుతారు. ఉదాహరణకు "శివః శక్త్యా యుక్తో యది భవతి" అని ప్రాంభమయ్యే మొదటి శ్లోకంలోనే శ్రీవిద్యాసారమంతా నిక్షిప్తమయ్యి ఉన్నదని దర్శన సాహిత్య కర్తల అభిప్రాయము.
కామేశ్వర సూరి ఈ శ్లోకాన్ని శ్రీవిద్యలోని 14 అంశాల పరంగా వ్యాఖ్యానించాడు. అవి (1) వేదాంతము (2) సాంఖ్యము (3) శ్రీవిద్య యొక్క ముఖ్య దేవత (4) సార్ధకములైన శబ్దములు (5) వాని అర్ధము (6) శబ్దముల సృష్టి (7) యంత్రము (8) ప్రణవము (9) మాతృక (సంస్కృతాక్షరమాల) (10) కాది విద్య (11) హాదివిద్య (!2) పంచాక్షరి (13) దీక్షనిచ్చు గురువు (14) చంద్రకళ . ఒక్కొక్క శ్లోకంలోను ఒక్కొక్క మంత్రం లేదా బీజాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయంటారు.
ఇంకా సౌందర్య లహరిలో అనేక మంత్రాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయంటారు. ఒక్కో మంత్రానికి లేదా శ్లోకానికి ఒకోపారాయణాఫలం చెప్పబడింది. శాక్తేయులలో రెండు శాఖలవారున్నారు - కౌలాచారులు, సమయాచారులు. కౌలులు శ్రీచక్రం, ఇతర సంకేతాలలో శ్రీమాతను పూజిస్తారు మరియు బాహ్యపూజకు ప్రాధాన్యత ఇస్తారు. సమయాచారులు అంతఃపూజ ద్వారా మూలాధార చక్రంనుండి సహస్రదళకమలం వరకు కుండలినీశక్తిని జాగృతం చేయడాని దీక్ష సాగిస్తారు.
గాధలు
సౌందర్య లహరి స్తోత్రావిర్భావం గురించి ఒక గాధ ప్రచారంలో ఉంది. ఆదిశంకరుడు ఒకమారు స్వయంగా కైలాసం వెళ్ళాడట. అక్కడ వ్రాసి ఉన్న ఈ శ్లోకాన్ని చదువుతుండగా వినాయకుడు దానిని క్రిందినుండి చెరిపేశాడట. ఎందుకంటే అది మానవులకు అందరాని అత్యంతగుహ్య విద్య గనుక. అలా శంకరుడు మొదటి 40 శ్లోకాలు మాత్ర,మే చదివాడు. వాటికి తోడు మరొక 60 శ్లోకాలు శంకరాచార్యుడు రచించాడు. ఆ వంద శ్లోకాలు కలిపి సౌందర్య లహరిగా ప్రసిద్ధమయ్యాయి. ఈ కథకు వివిధ రూపాంతరాలున్నాయి. ఏమయినా మొదటి 40 శ్లోకాలు యంత్ర తంత్ర విధాన రహస్యాలు తెలుపుతుండగా తరువాతివి శ్రీమాత యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నాయి.
విశేషాలు
సౌందర్యలహరిలోని శ్లోకాలు మంత్రాలుగా కూడా భావింపబడుతాయి. ఒక్కొక్క శ్లోకం నియమానుసారం ఉపాసిస్తే ఒక్కో ప్రయోజనం లేదా సిద్ధి లభిస్తుందని విశ్వాసం.
ఉదాహరణకు -
మొదటి శ్లోకము - దినమునకు 100సార్లు చొప్పున 12 దినాలు జపించి త్రిమధురము (బెల్లము+నేయి+కొబ్బరి) లేదా మధురమైన అపూపము నైవేధ్యంగా పెడితే ఇష్ట సిద్ధి, అభ్యుదయము, సకల విఘ్ననివారణ కలుగుతాయి.
11వ శ్లోకము - దినమునకు 100సార్లు చొప్పున 8 దినాలు జపించి బెల్లపు పానకము, వెన్న, గారెలు మహానైవేద్యం పెట్ఠాలి. ఈ శ్లోకాన్ని రాగిరేకుపై వ్రాసి మొలతాడులో తాయెత్తుగా కట్టుకొనాలి. అప్పుడు వంధ్యత్వం నశిస్తుంది.
20వ శ్లోకం- విభూతిలో గాని, నీటిలో గాని వ్రాసి 1000 సార్లు జపిస్తే విషం విరుగిపోతుంది. దినమునకు 2000 సార్లు చొప్పున 45 దినములు జపిస్తే సర్పవశీకరణ లభిస్తుంది.
43వ శ్లోకం- దినమునకు 3000 సార్లు చొప్పున 40 దినములు జపించి తేనెను నైవేద్యంగా పెట్టి ఉంగరముగా తాయెత్తు ధరిస్తే అందరిని ఆకర్షించే శక్తి లభిస్తుంది.
91వ శ్లోకం- దినమునకు 1000 సార్లు చొప్పున 45 దినములు పాయసమును నైవేద్యంగా పెడితే భూమి, ధనము సిద్ధిస్తాయి. *శుభం*
No comments:
Post a Comment