*సాధనతో సర్వేశ్వర సాక్షాత్కారం*
*ఒక బృహత్తర లక్ష్యాన్ని సాధించడానికి సాధకుడు చేసే పటిష్ఠమైన ప్రయత్నమే సాధన. అది విజయ వంతం కావడానికి సర్వేశ్వరుడు కొన్ని సాధనాలను ప్రసాదించాడు. అవేంటంటే...*
*"అహింసా సత్యశౌచ దయాస్తిక్యాది చరిత్రాణి పరిపాలనీయాణి”*
*హింస చేయకుండటం, సత్యాన్ని సాధించడం, శుచిగా మెలగడం, దయాగుణాన్ని పోషించటం, ఆస్తిక్యాన్ని ఆచరించటం, అనే ఈ ఐదూ సాధకునికి సాధన క్రమాలని, వీటిని ఆసక్తితో అనుష్టించాలని నారద భక్తిసూత్రాలు చెబుతాయి. ఇవే సాధకునికి సాధనలో సంపూర్ణత్వం సాధించడానికి బ్రహ్మాస్త్రంలాంటివి. పరమపవిత్ర భాసుర ప్రమాణాల్లాంటివి. వీటికి తోడు గురుసేవామృత ఆచరణ అత్యవసరం. సద్గురుసేవ సర్వపాపహరం కాదా! పైన పేర్కొన్న ఐదు సాధనక్రమాలే కాక... నిరంతర సేవా దృక్పధం, క్రమశిక్షణ, చిత్తశాంతి, సాధనలో నైపుణ్యం, అంకితభావం కూడా సాధకునికి అవసరమే. 'ఆవృత్తిః అసకృదుపదేశాత్... సాధన పదేపదే చేయాలని నారద భక్తి సూత్రాలల్లో ప్రత్యేకంగా చెప్పబడింది. సాధన అనే రథానికి సత్యం, ధర్మం రెండు చక్రాల వంటివి. సాధకుని సాధన ఆ రెండింటినీ ప్రతిబింబింపజేసే విధంగా ఉండాలి. అప్పుడే అది దివ్యమై లోకకళ్యాణ కారకమై సుప్రసిద్ధ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. సాధన చేసే సమయంలో పరిస్థితుల దుష్ప్రభావం వలన కొన్ని అవాంతరాలు కలుగవచ్చు. కొన్ని అనుకూలఫలాలు అందవచ్చు. కానీ... రెండింటినీ సమానబుద్ధితో స్వీకరించి లక్ష్యసిద్ధిని తలదాల్చి దుఃఖానికి కుంగిపోకుండా సుఖానికి పొంగిపోకుండా సాధకుడు సత్ఫలితాన్ని సాధిస్తాడని ఈ పద్య పాద సారాంశం. దుఃఖాన్ని, సుఖాన్ని సమదృష్టితో చూడటం స్థితప్రజ్ఞుని లక్షణాల్లో ప్రముఖపాత్ర వహిస్తాయి. అవే జీవన్ముక్తికి సైతం చక్కని సోపానాలు, అలాగే... సాధన కేవలం ప్రాపంచికభోగ భ్రమకు నిలయమైన శరీర పోషణకు మాత్రమే పరిమితం కారాదు. మనోవికాసాన్ని కలిగించి మరో జన్మ లేకుండా చేసే మహత్తర సాధన కావాలి. ఇందుకు భక్తి అనే విత్తం అపారమైన సాధనం. అదే ఆత్మపరిశోధనకు అమృతం లాంటిది. 'నేను అనే పదానికి వేదాంతపరమైన నిత్యమైన సత్యమైన విశిష్టార్థం తెలుసుకోవడానికి చేసే నిరంతర ప్రయత్నం... స్వస్వరూప అనుసంధానమే భక్తి' అని శంకరభగవత్పాదులు తెలిపారు. అద్వైతసిద్ధికి అద్దంపట్టి కవితా సాధనచేసి భాగవతంరచించి పోతన భక్తపోతనయ్యాడు. సత్యసాధనకోసం పడరాని పాట్లుపడిన హరిశ్చంద్రుడు పార్వతీపరమేశ్వరుల సాక్షాత్కారంతో వారి ఆశీస్సులతో సత్యహరిశ్చంద్రుడైయ్యాడు. మహాశిల్పి జక్కన్న శిల్పకళా సాధనతో లోక ప్రసిద్ధినొంది అమరశిల్పి అయ్యాడు. పదకవితా సాధనతో మహోన్నతమైన ప్రగతిని సాధించి శ్రీనివాసుని మెప్పించి ఆత్మానందుడయ్యాడు అన్నమయ్య. గానకళా సాధనతో కళకు జీవం పోసిన తాన్సేన్ తాను తరించి లోకాన్ని తరింపచేశాడు. హరికథాసాధనలో అందెవేసిన చేయిగా సమాజంచే సన్నుతులందిన ఆదిభట్ల నారాయణదాసు చిరస్మరణీయుడైనాడు. ఇలా ఎందరెందరో మహానుభావులు కళా సాధనలో సంపూర్ణస్థాయిని సాధించి కృషిఫలితాన్ని పరమాత్మునికి అర్పించి ఉత్తమగతిని సాధించారు.*
*┈━❀꧁ఓం నమ్మఃశివాయ꧂❀━┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు
No comments:
Post a Comment