Wednesday, March 11, 2026

నేను ఏ రూపాన్ని దర్శిస్తూ, ఏ నామాన్ని జపిస్తే మంచిది ?"

 నేను ఏ రూపాన్ని దర్శిస్తూ, ఏ నామాన్ని జపిస్తే మంచిది ?"

"స్మరణ, ధ్యానాదులకు ఏదేవత రూప నామాలైనా ఒక్కటే ! మనసుచేసే స్మరణ, ధ్యానాలే ముఖ్యం కానీ అది ఎంచుకునే రూపనామాలు ప్రధానం కాదు. తనను ఏ నామస్మరణ చేయమంటారని రామశాస్త్రి అనే భక్తుడు శ్రీరమణమహర్షిని అడిగాడు. నీ పేరునే సార్ధక నామం చేసుకోమని మహర్షి సూచించారు. అంటే రాముడన్నది కేవలం పేరుకే పరిమితం చేసుకోకుండా నిజంగా రాముడిగానే ఉండేందుకు ప్రయత్నించాలని మహర్షి ఉపదేశం. మనం అనేక దేవతల పేర్లు పెట్టుకుంటాం. కానీ పిలిచేప్పుడు, పలికేప్పుడు వారి స్మరణ ఉండదు. అలాకాక పేరుపెట్టి పిలిచే ప్రతిసారీ ఆ దైవాన్ని స్మరించగలిగితే అది సాధనే అవుతుంది. పేరు మన దేహానికే అయితే శవాన్ని కూడా పేరు పెట్టి పిలవాలి. కానీ ప్రాణం పోయిన తర్వాత దాన్ని 'రామయ్యశవం' అంటారేగాని శవాన్ని రామయ్య అని ఎవరూ పిలవరు. మనసు, దేహానికి వర్తించని ఆ నామం అనాదిగా వస్తున్న మన ప్రాణస్వరూపమైన ఈశ్వరుడిదే. ఆ ధ్యాసతో ఉండగలిగితే ప్రతి పిలుపు భగవంతుని సంకీర్తనే అవుతుంది !"*

*"అసలు మనసుకు 'ఇష్టాయిష్టాలు' ఎలా ఏర్పడుతున్నాయి ? 'వాసనా బలగాల'ను పెంచి పోషించేవి ఏమిటి ??"*

****

*"మనకు ఇష్టం కలుగకముందు ఏర్పడిన ఒకానొక అనుభవమే ఆ ఇష్టాన్ని పెంచుతోంది. మనసును ఇష్టాయిష్టాలతో కలుషితం చేసేది 'తమస్సు, రజస్సు' అనే గుణాలు. తమస్సు అంటే 'చీకటి'. కోరుకునే విషయం తప్ప ఇంకేది కనిపించనంత వివేకంలేని మనోచీకటి అది. ఇది మనలోని వాసనాబలాన్ని పోషిస్తోంది. రజోగుణ ప్రభావం వల్ల కోర్కెతీర్చుకోవటం కోసం ప్రయత్నం జరుగుతుంది. సత్వగుణం ఈ రెంటికీ మధ్యస్థంగా త్రాచులో ముల్లులా ఉంటుంది. రజో, తమో గుణాల సమస్థితే 'సత్వగుణం'. ఈ గుణాలే మనలో 'వాసనాబలాన్ని' పెంచి పోషించేది !"*

"నేను" లేచిందా..సర్వము లేస్తుంది.
"నేను" అణిగిందా...సర్వము అణగుతుంది.
ఈ  " నేను" సమస్తాన్ని తెలుసుకుంటుంది.
ఈ "నేను" ను తెలుసుకోకుండా, సమస్తము
తెలుసుకోవాలని అనుకోవడం అవివేకం.
అందుకే  "నేను" ను విచారించండి.
"నేను" ను విచారించడమే వివేకం.

No comments:

Post a Comment