Thursday, May 28, 2026

 (ఈ వారం స్వాతిలో కథ. అమ్మ చెప్పిన కథలు పుస్తకం నుంచి)

పిల్లల్ని పక్కన పడుకో బెట్టుకుని బెడ్-టైమ్-స్టోరీస్ చెప్పే (చాలా ఇళ్ళలో లేని) ఒక మంచి అలవాటు ఆ ఇంట్లో ఉంది. ఆ రాత్రి ఇద్దరు పిల్లలూ తల్లి పక్కన చేరి కథ చెప్పమన్నప్పుడు లక్ష్మి ఇలా చెప్పింది:

పదిహేనేళ్ల విహాన్ తెలివైనవాడు, చురుకైనవాడు. కానీ ఇటీవలి కాలంలో అతనికి ఒక కొత్త అలవాటు వచ్చింది- ఫోన్..! చేతిలో ఫోన్ ఉంటే చుట్టూ ప్రపంచమే మరిచి పోతాడు. ఆ సమయంలో ఎవరు ఏమి మాట్లాడినా వినిపించదు. తన లోక౦ తనది.

అతడి కొత్త అలవాటుని సపోర్ట్ చేస్తూ ఆ రోజు స్కూల్లో టీచర్ పిల్లలకి “స్వేచ్ఛ” గురించి ఒక కథ చెప్పాడు. “ఒక కుర్రవాడు ఒక పక్షిని పంజరంలో ఉంచి ప్రేమగా చూసుకున్నాడు. నీరూ, గింజలు పెట్టాడు. కానీ ఆ పక్షి ఎంత అడిగినా, బ్రతిమాలినా, అసలు ఒక్కసారి కూడా పాడలేదు. ఒక రోజు ఇంటికి వచ్చిన వృద్ధుడిని “నేను దీన్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాను. అయినా ఇది ఎందుకు పాడడం లేదు?” అని అడిగాడు. వృద్ధుడు ఏమీ మాట్లాడకుండా వెళ్లి పంజర౦ తలుపు తెరిచాడు. పక్షి హుషారుగా బయటికి ఎగిరి దూరంగా చెట్టు మీద వెళ్లి కూర్చుంది. ఆపైన అది ఎంతో మధురంగా పాడింది...”. 
ఈ కథ చెప్పిన టీచర్, “ఆ బాలుడికి పక్షిపై ప్రేమ ఉంది. కానీ పక్షి గొంతెత్తి పాడడానికి, దానికి ఇష్టమైన స్వేచ్ఛ కూడా కావాలి కదా…” అని వివరించాడు. 

ఆ మాటలు విహాన్ మనసులో బాగా నిలచి పోయాయి. ‘స్వేచ్ఛ’ అనే పదం అతనికి చాలా నచ్చింది.

ఆ సాయంత్రం అతను మంచం మీద అడ్డంగా పడుకుని ఫోన్‌లో వీడియోలు చూస్తుoడగా, మేడ మీద నుంచి అతని తాత “నాయినా విహాన్… కొంచెం మంచినీళ్లు తీసుకురా” అని పిలిచాడు. ఆయనకి వయసు ఎక్కువ. నడవడం కూడా కష్టమే.

ఫోనులో బిజీగా ఉన్న విహాన్ తలెత్త లేదు. పై నుంచి తాత మళ్లీ “బాబూ… దాహంగా ఉంది” అన్నాడు. 

విహాన్ క్రింద నుంచే “తాతయ్యా… నేను బిజీగా ఉన్నాను. కనబడటం లేదా?” అని చిరాగ్గా అరిచాడు. 

ఆ మాట విన్న తల్లి వంటగదిలో నుంచి నీళ్ళు తీసుకుని బయటికి వచ్చింది. వీడియోలో నిమగ్నమై ఉన్న విహాన్‌ను నిశ్శబ్ద౦గా ఒక క్షణం చూసి, మౌనంగా పైకి వెళ్లి తాతకి నీళ్లు ఇచ్చింది. తరువాత మేడ దిగి కొడుకు దగ్గరికి వచ్చి పక్కన నిలబడి నెమ్మదిగా, “విహాన్…” అంది.
విహాన్ తలెత్తకుండా “ఏమిటి?” అన్నాడు చిరాగ్గా.

“తాత నీళ్లు అడిగాడు. నువ్వు ఇవ్వలేదు. ఎందుకంటే నీకు ఫోన్ ఇంపార్టె౦ట్”.

“అవును. మా టీచర్ చెప్పాడు. అదే నా స్వేచ్ఛ”. 

తల్లి నవ్వి మంచం పక్కన కూర్చుని, “బిడ్డా… స్వేచ్ఛ అంటే మనసుకి ఇష్టం వచ్చినది చేయడం కాదు… ఇష్టాలకి బానిస కాకపోవడం..! బానిసత్వం ఉన్న చోట స్వేచ్ఛ ఉండదు” అంది. విహాన్ తల్లి వైపు ఆశ్చర్య౦గా చూశాడు. అతడికి తల్లి ఆ రోజు కొత్తగా కనపడింది. 
“స్వేచ్ఛ అంటే, మనసుకి- అన్ని వైపులా ఆలోచించ గలిగే అవకాశం ఇవ్వటం..! ‘నేను మారను… నేను చేయను’ అనటం కాదు. ఎదుటి వారిని సంతోష పెట్టటం కోసం ‘చేస్తాను’ అనగలగడం…! ఫోన్ మీద మమకారం కొంచెం తగ్గిస్తే… తాత మీద మమకారం పెరుగుతుంది. తాతకి ఒక గ్లాస్ నీళ్లు ఇవ్వటం చిన్న పని. కానీ ఆ పని చేస్తే ఆయన ముఖంలో కనిపించే సంతోషం… నీకు ఏ ఫోన్ స్క్రీన్‌లోనూ కనిపించదు. ఫోన్‌ పై మమకారం… నీ ఆలోచించే స్వేచ్ఛని మెల్లగా తీసుకు పోతుంది. పేడలో పురుగు, నూతిలో కప్ప, మురిగ్గుంటలో పందిలా... హుక్కా సెంటర్లలో, గంజా మత్తులో ‘అవే ఆనందాలు’ అనుకుంటూ ఉండి పోతావు. స్వేచ్ఛ అంటే మన మొండితనాన్ని కూడా వదిలేయ గలగటం. స్వేచ్చ అంటే మససుకి ఇష్టమైన ఎంపికల గురించి కాదు. మంచి చేసే ఎంపికల మీద ఆధార పడడం గురించి..! ఆలోచనల బంధనాల నుంచి, అనవసరమైన ఆసక్తుల నుంచి, భయాల నుంచి, చివరికి… మరణ భయం నుంచీ కూడా బయట పడగలగటం. అదే నిజమైన స్వేచ్ఛ”.

ఆ మాటలు విహాన్ మనసులో తగిలాయి. అతను మొండివాడు కాదు. మంచి చేప్తే అర్థం చేసుకునే వాడు. 

మెల్లిగా ఫోన్ పక్కన పెట్టి వంటగదిలోకి వెళ్లి, ఒక గ్లాసు నీళ్లు తీసుకుని తాత దగ్గరకు వెళ్లాడు. మంచం మీద పక్కనే కూర్చుని, “తాతయ్య… ఇంకొంచెం నీళ్లు తాగుతావా?” అని ప్రేమగా అడిగాడు. 

తాత ముందు ఆశ్చర్యంగా చూసి ఆ తరువాత నెమ్మదిగా నవ్వాడు. అమ్మ చెప్పినట్టూ ఫోన్‌లో కనిపించని ఆనందం ఆ నవ్వులో విహాన్‌కు కనిపించింది.

: స్వేచ్ఛ అంటే మనసు చెప్పినట్టు నడవటం కాదు. ఆకర్షణలకి లొంగకుండా ఆలోచించే శక్తి మనసుకు ఇవ్వటం..!   రచన.. శ్రీ యండమూరి వీరేంద్ర నాథ్

No comments:

Post a Comment