Wednesday, May 27, 2026

 మన అందరి కథ 2వ రోజు.

ఆత్మహత్య చేసుకుందామనుకున్నా ఆ స్త్రీ భూతం చెప్పినట్లు ఆరు నెలలు తరువాత వచ్చింది. భూమి లోంచి ఆ దీపాన్ని తవ్వి తీసి రాచింది. అందులోంచి భూతం బయటకు వచ్చి ఆనందం తో వెలిగిపోతున్న ఆ స్త్రీ ముఖం చూసి, " ఏం జరిగింది? " అని అడిగింది. ఏం చెప్పాలి? ఒకటా ? రెండా? అన్నీ మార్పులే! " అంది నవ్వుతూ..
ఆత్మవిశ్వాసం తో కూడిన స్వచ్ఛమైన ఆమె నవ్వును భూతం విస్మయంగా చూస్తూవుంటే ఆ స్త్రీ చెప్పసాగింది. 

ఇన్నిరోజులు నా అశాంతినీ, ఒంటరితనాన్నీ మరిచిపోవడానికి 'టీ.వి' కి బాగా అలవాటు పడ్డాను. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత నన్ను ఆలోచించకుండా చేస్తూ, నా సమయాన్నంతా తినేస్తున్న టీ.వీ అలవాటు ను అరగంట కు కుదించాను. అంతకు ముందు టి.వి చూస్తూ, పాటలు వింటూ, ముచ్చట్లు పెడుతూ, మధ్యమధ్య ఫేస్బుక్ - వాట్సప్ లు చెక్ చేస్తూ నేను చేసే ఏకాగ్రత లేని పనుల వల్ల రోజంతా బిజీగా ఉన్నాగానీ నా పనులు తెమిలేవి కావు.
ఇప్పుడు చేసే పనిలో లీనమై ఏకాగ్రతగా చేయడం వల్ల పనులు తొందరగా పూర్తి కావడమే కాకుండా చాలా సమయం మిగులుతుంది కూడా !.
డైరీ రాయడం ప్రారంభించాను. నా బలాలూ, బలహీనతలు అర్థమవ్వసాగాయి.
మనస్సులో అశాంతిగా ఉండడం వల్ల రాత్రిళ్లు అనవసర కాలక్షేపం చేస్తూ ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే దానిని. నేను ఆలస్యంగా నిద్ర లేచి పిల్లలకు స్కూల్‌ బస్ వచ్చే టైం అవుతుందని నేను టెన్సన్ పడుతూ పిల్లలను కూడా టెన్సన్ పెడుతూ గట్టిగా అరుస్తూ నిద్ర లేపే దానిని. అలాగే అరుస్తూనే వాళ్లను రడీ చేయించేదాన్నీ.
నాకు తెలియకుండానే పిల్లలకు కూడా "టెన్సన్ పడడాన్నీ, అసంపూర్తిగా పనులు చేసే విధానాన్నీ అభ్యాసం చేయిస్తున్నాను. " అన్న విషయాన్ని గమనించలేకపోయాను.

నీకు తెలుసా! గతంలో నీ దగ్గరకు వచ్చే వరకూ నా పిల్లల నుదిటిపై ముద్దు పెట్టుకుని ప్రేమగా పిలుస్తూ నిద్రలేపి కావలించుకున్న సందర్భం ఒక్కటీ లేదు.ఇప్పుడు నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను. రాత్రి తొందరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేస్తున్నాను. వెంటనే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఒక గంట శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ  నా ఆత్మస్వరూపంగా ఉన్న భగవంతుని ప్రార్థించి నా భర్తాపిల్లలను నిద్ర లేపుతున్నాను.
నాలో ఆత్మ విశ్వాసమూ, జ్ఞానం పెరుగుతున్నా కొద్ది అనవసర అనుమానాలూ, మూఢ నమ్మకాలు తొలగిపో సాగాయి. అంతకుముందు స్నానం తర్వాత ప్రక్క బట్టలు ముట్టుకోకూడదని దూరంగా ఉండి అరుస్తూ నిద్ర లేపే దాన్ని. రాతి విగ్రహంలోనే దేవున్ని దర్శించే నేను,నా భర్తాపిల్లలలో దర్శించలేనా? కృష్ణ జయంతి రోజు కృష్ణవిగ్రహాన్ని పడుకోబెట్టి ఊపే ఉయ్యాల ఎంత పవిత్రమైనదో నా భర్తాపిల్లలు పడుకునే మంచం - బట్టలు అంత పవిత్రమైనవి కావా ?

అందుకే నా పిల్లలకు "యశోద"నయ్యాను.
నా భర్త కు "రాధ"నయ్యాను.అలా ప్రేమగా నా భర్తాపిల్లలను నిద్ర లేపి వాకింగ్ తీసుకెళ్ళడం ప్రారంభించాను.అంతకుముందు ప్రతిదానికి ఎదురు చెప్పే నా భర్తాపిల్లలు మారు మాట్లాడకుండా నాతో ఉత్సాహంగా వాకింగ్ కు రాసాగారు. ఆ ప్రభాత సమయంలో చల్లని పిల్లగాలులు వీస్తూ ఉండగా నా కుటుంబంతో కలిసి నేను ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తూ నడుస్తూవున్నప్పుడు భరించలేని నా ఒంటరి తనమంతా ఒక్క క్షణంలో ఎగిరిపోయింది.

నాకు ఇంగ్లీషు లో బాగా మాట్లాడాలని కోరిక.కానీ, చాలా భయపడేదాన్ని.ఒక రెండు నెలలు తీవ్రంగా శ్రమించి, ఇంగ్లీషు లో అనర్గళంగా మాట్లాడడాన్ని అభ్యాసం చేశాను.మా ఆఫీసుమీటింగ్ లో నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి చూసి తర్వాత చప్పట్లతో నన్ను అభినందించారు. నా భర్తాపిల్లలను కారులో కూర్చోబెట్టుకుని నేను డ్రైవ్ చేస్తూ కారులో ప్రయాణించాలని కోరిక డ్రైవింగ్ నేర్చుకుని తీర్చుకున్నాను.

చెబితే నమ్మవు కానీ, ఈ వయస్సులో స్విమ్మింగ్ నేర్చుకుని నా భర్తతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరిక తీర్చుకున్నాను.ఈ సెలవులలో నా పిల్లలకూ స్విమ్మింగ్ నేర్పించి నా కుటుంబంతో కలిసి స్విమ్మింగ్ చెయ్యాలనే కోరికను కూడా తీర్చుకుంటాను. ఇది విని నేను ఒక చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నాని అనిపించవచ్చు ! కానీ, ఒక స్త్రీకి తన కుటుంబం తో కలిసి ఇలాంటి చిన్న చిన్న ఆనందాల వల్ల పొందే తృప్తి వెలకట్టలేనిది. నాలో ప్రశాంతత పెరిగిన కొద్దీ నా భర్త కూడా నాకు అర్థమవ్వసాగాడు. అతనొక జర్నలిస్టు. తన వృత్తిని బాగా ప్రేమిస్తాడతడు. ఒక విషయాన్ని చూసి అందులోని మంచి - చెడులను విశ్లేషించే తత్వం అతని నుండి వేరు చేయలేంతగా అతనిలో జీర్ణమైపోయింది.అతనిలో అభ్యాసమైన ఈ గుణం వల్ల గతంలో నాలోని మంచి - చెడులను కూడా విశ్లేషించేవాడు. 

గతంలో నాలోని పొరపాట్లు గూర్చి ఆతను చెబుతున్నపుడు నేను అవేశం తో రగిలిపోయేదాన్ని. నేను తలదువ్వుకుని చాలా సార్లు దువ్వెనకు అలాగే వెంట్రుకలుంచే విషయం గోడవగా మారి ఒక పదిరోజులు మాట్లాడుకోని సంగతి " గుర్తుకువస్తుంది.
ఇంత చిన్నవిషయం గూర్చి ఇతనికెందుకు పట్టుదల ? అని ఆలోచించేదాన్ని. కానీ అది చిన్న విషయం కాదనీ, నాలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికీ - నిర్లిప్తితకు గుర్తని ఇప్పుడు నా కర్థమౌతుంది. ఇలా అతన్ని వృత్తితో సహా అర్థం చేసుకున్న తర్వాత అతను నాకు అర్థమవ్వసాగాడు. క్రమంగా అతడు అర్థమౌతున్నాకొద్ది అతని అద్భుతమైన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయాను.
అతను నాపట్ల ఆసక్తి చూపాలంటే అతనికిష్టమైన విషయాల్లో నేనూ ఆసక్తి చూపాలన్న ప్రాథమిక సూత్రాన్ని నేను గ్రహించాను. పేపర్ లో వచ్చిన అతడు రాసిన వార్తలనూ,వ్యాసాలనూ శ్రద్ధగా చదివి విశ్లేషించి అతన్ని ప్రోత్సాహించడం ప్రారంభించాను.

నాలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును చూసి నా భర్త మొదట్లో నామీద విపరీతమైన గౌరవంతో కొన్ని రోజులు దగ్గరకు రావడానికే ధైర్యం చాలక తటపటాయించాడు. నేనూ కొన్ని రోజులు బింకాన్ని నటించి ,అతని ఇబ్బందిని చూసి ఫక్కున నవ్వేసి వెళ్లి కావలించుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి రోజున తెలుసుకుందాం. 

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏



మనందరి కథ మూడవ చివరి రోజు.
నిన్నటి రోజున ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ ప్రయత్నాన్ని ఆరు నెలలు వాయిదా వేసిన తరువాత ఎలాంటి మార్పు జరిగిందో ఏం చెప్పిందో చదవండి

ఇప్పుడు నాకు కుటుంబ సభ్యులతో పట్టుదలలు లేవు. అన్నీ పట్టు విడుపులే !
నీకో విషయం చెప్పనా ? మా వివాహమైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా భర్తను నిజంగా ప్రేమించడం మొదలు పెట్టాను.
ఇక చుట్టుప్రక్కల జరిగే చెత్త విషయాలన్నీ తీసుకుని ఉసుపోని కబుర్లకోసం మా ఇంటికి కొంతమందివచ్చేవారు. మొహమాటంతో నా పని మానుకుని ముచ్చట్లు పెట్టేదాన్ని. వాళ్ళవల్ల నా సమయమూ,మనస్సూ రెండూ చెడిపోయేవి.

ఇప్పుడు అలా వచ్చేవారికి " కొంచం కూరగాయాలు తరిగి పెట్టవా ?  కడగడంలో హెల్ప్ చెయ్యవా? " అంటూ పనులు చెప్పడం మొదలు పెట్టాను. చాలామంది రావడం మానుకున్నారు. నా స్నేహాన్ని నిజంగా కోరుకునే స్నేహితులు మాత్రం వస్తూనే ఉన్నారు..ఇప్పుడు నన్నెవరూ అర్థం చేసుకోవలసిన అవసరం లేదనిపిస్తుంది. నేనే అందరిని అర్థం చేసుకోగలను.

ఇప్పుడు నేను వృథాగా సమయాన్నీ , డబ్బునూ, ఆహారాన్నీ , మాటలనూ, కన్నీళ్ళనూ, భావావేశాలనూ ఖర్చు చేయడాన్ని మానుకున్నాను. నాకు తెలియకుండానే నా ముఖం పై చిరునవ్వు కదలాడుతుంది.
" ఉద్ధరేదాత్మనాత్మానం " అని గీతా, ఉపనిషత్తులు చెప్పిన మాటలు మరచి ....ఎవరో టీ.వి లో మఱ్ఱిచెట్టు కు పాలుపోయ్యు !' అంటే వెళ్లి పోశాను. రాగిచెట్టు క్రింది మట్టిని బొట్టు పెట్టుకో! " అంటే వెళ్లి పెట్టుకున్నాను. అలాచెస్తే నా భర్తాపిల్లలూ, పరిస్థితులు మారుతాయని ఆశపడ్డాను. మార్పు బయటనుంచి వస్తుందని ఎదిరు చూశాను. మార్పు నా లోపలినుంచే వస్తుందని ..మారాల్సింది నేనేనని నాకిప్పుడు అర్థమైంది. ఇదంతా నీవల్లే!
నా ఆత్మహత్య ను తప్పించావు. నాకో కొత్త జీవితాన్ని ప్రసాదించావు. నన్నో వ్యక్తిగా నిలబెట్టి విలువా,గౌరవం రావడానికి కారణమయ్యావు. ముఖ్యంగా "నేనంటే నాకు బాగా ఇష్టం కలిగేటట్లు చేశావు." ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేనిది.నిజంగా నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కృతజ్ఞతతో కూడా కళ్ల వెంబడి నీళ్లొస్తాయన్న సంగతి నాకు మొదటిసారిగా తెలుస్తుంది. సరే! నా సంగతి అలా ఉండనీ! నీ వివరాలు చెప్పు " అన్నదా స్త్రీ కృతజ్ఞతాభాష్పాలను తుడుచుకుంటూ..

ఆ స్త్రీ మాటలు విన్న భూతం ఆనందంతో ఇలా చెప్పసాగింది. నేను కూడా గతంలో నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి , ఇదే కొండ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుని ఇలా భూతన్నయ్యాను. చచ్చి భూతాన్ని అయ్యాక నేను చేసిన తప్పు తెలిసొచ్చి జ్ఞానం వచ్చింది. నేనున్న స్థితి దుర్భరంగా ,పరమ యాతనగా ఉంటుంది. ప్రేతశరీరంలో వుండడం ఇష్టం లేక ఈ కొండకు వచ్చిన ఒక నిజమైన మహాత్ముని కాళ్లావేెళ్ళా పడి విముక్తి కలిగించుమని పార్థించాను.

నా ప్రార్థన విన్న అతడు ...ఆత్మహత్య మహా పాపం."నీ జీవితాన్నీ - ఆయుష్షును వ్యర్థం చేశావు. నీ పాపం తొలిగిపోవాలంటే నీవల్ల మూడు విషయాలు జరగాలి.
1. ఒకరిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలి.( ప్రాణదానం )
2. నీ మాటలు ఒక వ్యక్తి క్రొత్త జీవితం పొందడానికి కారణం కావాలి.
( జ్ఞానదానం )
3. ఆ వ్యక్తి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి.  అంత వరకు ప్రేతయాతనలు పొందకుండా ఈ దీపం లో ఉంచుతాను అంటూ దీపంలో ఉంచి ఇక్కడ పాతిపెట్టాడు.

ఎవరైనా నీతులు చెప్పగలరు. కానీ ఆచరించడం లోనే ఉంది గొప్పంతా! నీ శక్తిసామార్థ్యాల వల్లనే ఇదంతా నువ్వు సాధించావు.నేను చేసిందేమీ లేదు. నీ వల్ల నా మూడు విషయాలు ఒకేసారి నెరవేరి నాకు ప్రేతరూపం నుండి విముక్తి లభించింది.నీకే నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆ భూతం శూన్యంలో కలిసి పోయింది.

మూడు రోజులపాటు ఓపికతో చదివిన ఆత్మీయులు అందరికీ ధన్యవాదాలు. ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించింది నాకు పర్సనల్ గా తెలియజేస్తే మరింతగా సంతోషిస్తాను 

మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment