Thursday, May 28, 2026

 295f6;          ```వందేమాతరం 
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀.        
సావడి కబుర్లు 18     ```

*ధర్మక్షేత్రం నుండి మమ వరకు — భగవద్గీత ఆత్మసారం*```
        ➖➖➖✍️


భగవద్గీత అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం కాదు. అది భారతీయ సనాతన ధర్మం యొక్క హృదయ స్పందన. యుద్ధభూమిలో ఉద్భవించినా, అది మనిషి అంతరంగంలో నిత్యం జరిగే సంఘర్షణలకు మార్గదర్శి. అందుకే యుగాలు మారినా, సమాజాలు మారినా, మనుషుల జీవన శైలులు మారినా గీతా బోధ మాత్రం నిత్యనూతనంగా నిలిచింది. 
ధర్మం, తర్కం, భక్తి, ఆత్మవలోకనం, ఈ నాలుగూ కలిసినచోటే గీత యొక్క అసలైన ప్రకాశం కనిపిస్తుంది.

ప్రముఖ జాతీయవాది, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు భగవద్గీత గురించి ఒక అద్భుతమైన విషయం ప్రస్తావించారు. గీత ప్రారంభమయ్యే మొదటి శ్లోకం:```
*ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।*
*మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ॥*```

ఈ శ్లోకంలో మొదటి పదమే```  *ధర్మక్షేత్రే*. ```

అలాగే గీత చివరి శ్లోకం:```
*యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।*
*తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ॥*```
ఈ శ్లోకంలోని చివరి పదం``` *మమ*. ```
ఈ రెండు పదాల మధ్యే మొత్తం మానవ జీవిత రహస్యం దాగి ఉంది.

“ధర్మం”తో ప్రారంభమై “మమ”తో ముగిసిన గీత మనిషికి ఒక మహత్తరమైన ఆత్మవలోకనం నేర్పుతుంది. “మమ” అనే అహంకారం మరియు  మమకారం ధర్మానికి లోబడి ఉన్నప్పుడే జీవితం శ్రేయోమయమవుతుంది.

ధృతరాష్ట్రుడు మొదటి శ్లోకంలో “మామకాః” అని “నావారు” అన్నాడు. అక్కడే సమస్య మొదలైంది. ధర్మం కన్నా తన పక్షం ముఖ్యం అయింది. మమకారం తప్పు కాదు, కానీ ధర్మాన్ని మరిచిపోయే మమకారం వినాశనానికి దారి తీస్తుంది. ఇదే నేటి సమాజంలో కూడా కనిపిస్తోంది.

ఇంటి వివాదాల నుంచి దేశ రాజకీయాల వరకు, సంస్థల నుంచి కుటుంబాల వరకు చాలా సమస్యల మూలంలో *నా - పర* అనే భావమే ఉంది. ధర్మం పక్కకు తప్పినచోట బంధుత్వం కూడా అనర్థానికే దారి తీస్తుంది.

ధృతరాష్ట్రుడు కళ్ళతో మాత్రమే కాదు, మమకారంతో కూడా అంధుడయ్యాడు. అందుకే ధర్మక్షేత్రంలో నిలబడి కూడా ధర్మాన్ని చూడలేకపోయాడు.

ఇక్కడ గమనించవలసింది గీత చివర్లో సంజయుడు చెప్పిన “మమ” అన్నది. అది అహంకారపు “మమ” కాదు. అనుభవంతో వచ్చిన నిర్ణయం. ధర్మం, దైవజ్ఞానం, కర్తవ్యనిష్ఠ కలిసి ఉన్నచోటే విజయం ఉంటుందని తెలిసిన జ్ఞానవాక్యం. అందుకే గీత ఒక అద్భుతమైన సందేశం ఇస్తుంది.
```
*ధర్మం లేని శక్తి దుర్యోధనత్వం అవుతుంది._
*కర్తవ్యభయం అర్జునత్వం అవుతుంది._
*జ్ఞానం, ధర్మం, భక్తి కలిసినప్పుడు కృష్ణత్వం ప్రత్యక్షమవుతుంది.```

ఇక్కడ ఒక అద్భుతమైన విషయం గమనించదగినది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది శ్రీకృష్ణుని ఉపదేశంతో. ముగిసింది ఆయన నామస్మరణతో.
యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు మానసిక భయాందోళనలకు గందరగోళంలో ఉన్నాడు. అతనికి బంధువులు కనిపించారు, ధర్మం కనిపించలేదు. చేతిలో గాండీవం ఉన్నా హృదయంలో స్థిరత్వం లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించాడు. అంటే జీవితంలో సందేహం వచ్చినప్పుడు దైవబోధ అవసరం.

యుద్ధం పూర్తయ్యాక కూడా నిలిచింది ఏమిటి? శ్రీకృష్ణుని నామమే. అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు చేసిన విష్ణు సహస్రనామ పారాయణమే.

ఎందుకంటే ఉపదేశం మనసుకు దారి చూపుతుంది. నామస్మరణ ఆ మార్గంలో నడిపిస్తుంది. ఈ రెండు సందర్భాలలో విన్నవాడు ఒక్కడే, అర్జునుడు. అంటే అర్జునతత్వము కలిగిన మనమే అని అర్థం. 

ఇది చాలా గొప్ప సంకేతం. దైవం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. కానీ వినడానికి అర్జునుడి లాంటి వినయంతో కూడిన హృదయం కావాలి. అర్జునుడు యోధుడు కావడం వల్ల గీత వినలేదు, తన అహంకారాన్ని పక్కనపెట్టి _*శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం*_ అని శరణాగతి చేసినందువల్ల వినగలిగాడు.
నేటి మనిషి జీవితమూ ఒక కురుక్షేత్రమే. కుటుంబ బాధ్యతలు ఒక వైపు, వ్యక్తిగత కోరికలు మరో వైపు. ధర్మం ఒక వైపు, లాభనష్టాల లెక్కలు మరో వైపు, సత్యం ఒక వైపు, సమాజ ఒత్తిడి మరో వైపు. ఇలాంటి ప్రతి సందర్భంలో గీత మనకు ఒక ప్రశ్న అడుగుతుంది.

నీ నిర్ణయం ధర్మం ఆధారంగా ఉందా?
లేక మమకారం ఆధారంగా ఉందా? అని!

*ఒక వైద్యుడు ధర్మంతో పని చేస్తే ప్రాణరక్షకుడు అవుతాడు; లాభంతో మాత్రమే ఆలోచిస్తే వ్యాపారి అవుతాడు.

*ఒక గురువు ధర్మంతో బోధిస్తే ఆచార్యుడు అవుతాడు,  ఉద్యోగంగా మాత్రమే చూస్తే ఉపాధ్యాయుడిగానే మిగిలిపోతాడు.

*ఒక పాలకుడు ధర్మంతో నడిస్తే రాజర్షి అవుతాడు, స్వార్థంతో నడిస్తే నియంత అవుతాడు.

*అందుకే గీత యుద్ధం గురించి చెప్పిన గ్రంథం కాదు. యుద్ధంలో కూడా ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలో చెప్పిన గ్రంథం!

గీత మనిషిని లోకం విడిచి అడవికి పంపదు. లోకంలోనే ధర్మంతో జీవించడం నేర్పుతుంది. చేతిలో పని, హృదయంలో భక్తి, బుద్ధిలో జ్ఞానం, ప్రవర్తనలో ధర్మం,  ఇదే గీత చూపించిన జీవన మార్గం!

అందుకే వేల సంవత్సరాల తరువాత కూడా గీత ప్రతి మనిషికి చెబుతోంది, ధర్మంతో ప్రారంభమైన జీవితం మాత్రమే చివరికి శాంతిని ఇస్తుంది. మమకారాన్ని ధర్మానికి అర్పించినప్పుడు మాత్రమే నిజమైన విజయం లభిస్తుంది.

కురుక్షేత్రం ఎక్కడో జరిగిన యుద్ధభూమి కాదు.‌ ప్రతి మనిషి హృదయంలో ప్రతిరోజూ జరుగుతున్న ధర్మాధర్మ సంగ్రామమే కురుక్షేత్రం. అక్కడ మమకారం దుర్యోధనుడిలా లాగుతుంటే, ధర్మబుద్ధి అర్జునుడిలా సందేహిస్తుంది. ఆ సమయంలో అంతరంగంలో వినిపించే దైవవాణియే భగవద్గీత.

ధర్మంతో ప్రారంభమై “మమ”తో ముగిసిన గీత చివరికి మనిషికి నేర్పేది ఒక్కటే . “మమ” అనే భావాన్ని ధర్మానికి సమర్పించినప్పుడు మాత్రమే జీవితం విజయవంతమవుతుంది. 

*అందుకే గీత కేవలం చదవాల్సిన గ్రంథం కాదు.  జీవించాల్సిన జీవన విధానం!```

*యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।*
*అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥* ```

ధర్మం నిలిచినంతకాలం భారతీయ సంస్కృతి నిలుస్తుంది. గీతా జ్యోతి వెలిగినంతకాలం మానవత్వం నిలుస్తుంది.✍️```
మృశి
(దశిక ప్రభాకరశాస్త్రి)
9849795167.
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
          ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...                  8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

No comments:

Post a Comment