Thursday, May 28, 2026

Bhagavadgeetha emergency numbers

 శిక్ష 

యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీకి నేను కలిసాను. అతని కళ్ళల్లో పశ్చాతాపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మాటల్లో ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి? అన్న ఆలోచన స్ప్రష్టంగా వినిపిస్తుంది. తన జీవితంలో ఇంకా ఏమీ మిగలలేదు అనే బాధ. జైలు జీవనంలో తన జీవితం వ్యర్థం అవుతుందని వ్యధ. చెరసాలలో ఉండలేని స్థితి, వెలుపలకు రాలేని పరిస్థితి తనను నిస్సహాయడ్ని చేసాయి.

తనను మాట్లాడినంత సేపు మాట్లాడనిచ్చాను. తన లోని బాధ బయటకు వచ్చే దాక, మనసులో బరువు దిగి పోయే దాక , కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయేదాకా, గొంతులో మాటలు ఇంక లేవు, అనే దాక మాట్లాడ నిచ్చాను. కాళ్ళ వైపు చూసే తన కళ్ళను పైకి నెట్టి,  తన కళ్ళల్లో కళ్ళు పెట్టి, ప్రేమతో భుజం తట్టి, తన మనసులో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాను. తనతో మాటలు కలిపాను.

“ఈ పరిస్థితి లో నీవు జైలు బయట ఉంటే ఏంచేస్తావు”అని అడిగాను.

అతనిలోనుంచి వచ్చిన సమాధానానికి ఆశ్చర్య పోయాను. “నిత్యం ధ్యానం చేసుకుంటూ, భగవద్గిత చదువుకుంటూ, పది మందికి సేవ చేసుకుంటూ చేసిన పాపానికి ప్రాయాచిత్తం చేసుకుంటూ ,ఆధ్యాత్మిక జీవితం గడుపుతాను. ఆత్మనుభూతిని పొందుతాను ” అని చెప్పాడు.

అప్పుడు నేను అతనికి చేసిన కౌన్సెలింగ్ సారాంశం ఇక్కడ తెలియ చేస్తున్నాను.

మిత్రమా! నీ జీవితంలో ఇంకేమీ మిగల్లేదని నీవంటున్నావు. నీ అసలు జీవితం ఇప్పుడే ఆరంభమయ్యిందని నేను అంటున్నాను.జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. నీ విషయంలోనూ అదే జరిగింది. 

“అదెలా” అని అతను నన్ను అడిగాడు. నేను అతనికి చెప్పింది ఇదే

ఇక నీవు బయటకు వెళ్లే ప్రసక్తి లేదు. అసాధ్యాన్ని సాధ్యం కావాలని ఆలోచించడం మానేయి. ఇప్పుడు నీవు బయటకు వెళ్ళినా అందరూ చెరసాలనుంచి వచ్చిన వాడిగా నిన్ను చులకనగా చూస్తారు.నీవు చేసిన తప్పుని  మళ్ళీ మళ్ళీ నీకు గుర్తు  చేస్తుంది సమాజం. ఉద్యోగం దొరకడం కూడా కష్టం అవుతుంది. బ్రతుకు భారం అవుతుంది. బ్రతక లేక చావ లేక బ్రతక వలసి వస్తుంది.

కాబట్టి నీవు ఉన్న చోటు నే స్వర్గంగా మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ లోని పరివర్తనతో,  నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో. కొత్త రకంగా ఆలోచించడానికి ప్రయత్నం చెయ్యి.

అక్కడ జైలు సమయంలో పని చేయనవసరం లేదు. ఆహారం ఉచితం, గది ఉచితం, బట్టలు ఉచితం, వైద్య సంరక్షణ ఉచితం. ఈ ఉచిత వస్తువులన్నింటినీ ఉపయోగించుకుని, నీవు నీ మనసును స్వేచ్ఛగా మార్చుకోవాలి . నిన్ను వీరు జైలు గోడలు దాటనివ్వకపోవచ్చు. కానీ నీ ఆత్మను చేరుకోకుండా నిన్ను ఆపలేరు. బయటి ప్రపంచం లోపలి కంటే ఎంతో పూలబాటగా నీకు కనిపించవచ్చు. దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగానే ఉంటాయి. కానీ నీ లోపలి ప్రపంచం బయటి కంటే ఎంతో రసవంతమైనది. 
చెరసాల బయట ఉన్న చాలా మంది; శారీరకంగా జైలులో లేకపోయినా, వారు సృష్టించుకున్న జైలులో జీవితకాల ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. వీరికి అనుబంధాలు, స్వార్థం, దురాశ & ద్వేషం అనేవి జైలు గోడలు. ఈ నాలుగు గోడల మధ్య బంధించబడి, వారు శారీరకంగా చెరసాలలో లేక పోయినా మానసిక చెరసాలలో మగ్గిపోతున్నారు.

 జైలులో అందమైన గ్రంథాలయం, ప్రశాంతమైన ప్రార్థనా మందిరం ఉన్నాయి. ఆందోళన చెందకుండా, ఈ వనరులను పూర్తిగా ఉపయోగించుకో. నీ శరీరం జైలులో ఉంది; కానీ నీవు నీ మనసును ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉంచుకోవచ్చు. నెల్సన్ మండేలా, ఎం.కె. గాంధీలను చూడు. వారు తమ జైలు సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారో, చదువు. వర్తమానాన్ని ఎలా సద్వినియోగ పరచుకో గలవో ఆలోచించు . గతం గురించిన అపరాధ భావన నుండి బయటపడు.

ఆత్మపరిశీలన ప్రారంభించు.  ప్రతి దినం ధ్యానం చెయ్యి . వర్తమానంలో జీవించు . విభిన్నంగా ఆలోచిస్తూ, జైలునే నీ బాహ్య ప్రపంచంగా మార్చుకో. నీవు నేర్చుకున్నది బోధిస్తూ, ఇతర ఖైదీలను ప్రభావితం చెయ్యి. వారికి ధ్యానాన్ని పరిచయం చెయ్యి. ప్రతి సంక్షోభంలోనూ నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మనం శ్రద్ధగా ఉంటే, దైవత్వం ఆ అవకాశాన్ని ఆవిష్కరిస్తుంది.

ఇలా చేస్తే ఏ ఆత్మ సాక్షత్కారం కోసం ప్రపంచంలో ప్రజలు పడి గాపులు కాస్తున్నారో, ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని ఈ నాలుగు గోడల మధ్యనే నీవు పొందవచ్చు. ఎవరికి తెలుసు? నీవు యిలా చేస్తే అధికారులు నీ సత్ ప్రవర్తనకు మెచ్చి నిన్ను విడుదల చేయవచ్చు.

నీవు బాధ పడుతూ కూర్చుంటే అన్నీ నష్టాలే. నా బోధనను అర్థం చేసుకుని ఆచరిస్తే అన్నీ లాభాలే.
ఆలోచించు మిత్రమా!

“అలానే చేస్తాను ” అని అన్నాడు.
కానీ కళ్ళు చెమర్చడం చూసాను.
మళ్ళీ కన్నీళ్ళా? అన్నాను.
‘కాదు’ అన్నాడు 
“మరేంటి” అన్నాను 
‘తెలియదు“. అని గట్టిగా కౌగాలించుకున్నాడు.

ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment