*దేహం భోగానికి కాదు* - యోగానికి
సందేహాన్ని జ్ఞాన శోధనకు ఉపకరణంగా మార్చుకుంటే జీవనయాత్రను సఫలం చేసుకోవచ్చు.
మనిషి జీవితంలో రెండు స్థితులు దేహం, సందేహం ఎల్లప్పుడూ సహజంగా ఉండేవే. దేహం అనేది మనిషి అనుభవించే భౌతిక స్థితి. ఆహారం, ఆరోగ్యం, శరీరశక్తి ఇవన్నీ దేహ సంబంధమైనవే.
సందేహం అనేది మనసుకు సంబంధించినది. మనసులో కలిగే ప్రశ్నలు, అనుమానాలు, విచారణలు వ్యక్తి ఉన్నతికో, పతనానికో దారితీస్తాయి.
ధర్మ సందేహాలతో విషయ జ్ఞానాన్ని పెంచుకునే వారి వ్యక్తిత్వమే వికసిస్తుంది. దేహాన్ని, సందేహాన్ని సమన్వయం చేస్తేనే ఆధ్యాత్మికత పరిపూర్ణతను సంతరించుకుంటుంది.
పురాణాల్లో దేహాన్ని దేవాలయంగా వర్ణించారు. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లు ఆహారం, నిద్ర, కర్మలు అన్నీ సమతుల్యంగా ఉండే జీవనవిధానం దేహాన్ని దృఢంగా ఉంచుతుంది. అప్పుడే ఆధ్యాత్మిక సాధనలో స్థిరత్వం వస్తుంది.
ప్రహ్లాదుడు, హనుమంతుడు, భీముడు లాంటి మహనీయులు తమ దేహశక్తిని ధర్మానికి, భక్తికి వినియోగించారు. కాబట్టి, శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. దాన్ని పుణ్యకార్యాలకు ఆలంబనగా మార్చుకోవాలి.
ఇక సందేహం లేకుండా జ్ఞానం కలుగదు. చిన్నవయసులోనే ప్రశ్నలవర్షం కురిపించిన నచికేత తన సందేహాల ద్వారా అమరత్వ రహస్యాన్ని యముడి నుంచి తెలుసుకున్నాడు.
అర్జునుడు యుద్ధరంగంలో సంశయానికి లోనయ్యాడు. తన బంధువులను చంపడం ధర్మమా, అధర్మమా అనే సందేహం వల్లే గీతాజ్ఞానం వెలువడింది.
శ్రీకృష్ణుడి ఉపదేశం మానవాళికి మార్గదర్శకమైంది. కాబట్టి, సందేహం ఆధ్యాత్మికతకు అవరోధం కాదు. అది విచా రణకు బాటలు వేస్తుంది.
దేహాన్ని పరిరక్షించుకుంటూ, సందేహాలను పరిష్కరించుకుంటూ నడిచే మార్గమే నిజమైన ఆధ్యాత్మికత. శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే ధ్యానం, భజన, భగవంతుడి సేవల్లో స్థిరత్వం ఉండదు.
సందేహాలను అణచివేస్తే అవివేకం, అజ్ఞానం పెరుగుతాయి. ఆధ్యాత్మిక సాధన స్థిరంగా కొనసాగడానికి దేహం ఆధారమవుతుంది. సందేహం జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది.
దేహంతో ధ్యానం, సందేహంతో జ్ఞానం. రెండింటి సమన్వయం ఆత్మసాక్షాత్కారానికి దారిదీపమవుతుంది.
No comments:
Post a Comment