Thursday, July 30, 2026

 *గురువుకు కృతజ్ఞతలు తెలిపే పర్వదినం* - 
*గురుపూర్ణిమ రోజున వ్యాస మహర్షిని ఎందుకు పూజిస్తారు?*
*తల్లి తండ్రుల తర్వాత జీవితంలో గురువుకు అత్యున్నత స్థానం* - 
*అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమార్గాన్ని చూపించే గురువులను స్మరించుకుని కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన రోజు*


భారతీయ సనాతన సంప్రదాయం తల్లి తండ్రి తరువాతి స్థానం గురువుకు ఇచ్చింది. తల్లిదండ్రులు సహజంగానే కన్న మమకారంతో ప్రేమాభిమానాలు చూపిస్తారు. వారికి తెలిసిన విలువలను తమ పిల్లలలకు నేర్పిస్తారు. కానీ మనతో ఏ అనుబంధం లేకపోయినా మనల్ని ప్రేమిస్తూ, తన జ్ఞానాన్ని మనకి పంచి పెట్టి, మన అభ్యున్నతిని కోరుకునే వాడు గురువు ఒక్కడే! మంచి చెడు, కష్ట సుఖాల మధ్య ఉన్న సన్నని గీతను సమయస్ఫూర్తిగా నేర్పేవాడే గురువు. అలాంటి గురువుకు కృతజ్ఞతలు తెలపడానికి గురుపూర్ణిమ ఒక అద్భుతమైన అవకాశం. జులై 29, బుధవారం గురుపూర్ణిమ సందర్భంగా గురుపూర్ణిమ విశిష్టత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

*గురు పూర్ణిమ ఎప్పుడు?*
తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురుపూర్ణిమగా జరుపుకుంటాం. ఈ ఏడాది జులై 29, బుధవారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ రోజునే గురుపూర్ణిమ.

*సాక్షాత్తు విష్ణు స్వరూపం*
"వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే! నమో వై బ్రహ్మ నిధయే వాశిష్ఠాయ నమో నమః" సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, జ్ఞాననిధి, వశిష్ట వంశోద్భవుడైన వేదవ్యాసుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ గురుపూర్ణిమ పర్వదినాన్ని జరుపుకుంటాం. లోకానికి అష్టాదశ పురాణాలు అందించిన వ్యాస మహర్షి జన్మదినాన్ని గురుపూర్ణిమగా జరుగుపుకుంటాం. గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు.

*గురుపూర్ణిమ విశిష్టత*
మన సంప్రదాయంలో గురుపూర్ణిమ చాలా విశిష్టమైన రోజు." గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అంటూ ప్రతి రోజూ మనం గురువుకు నమస్కరిస్తూనే ఉంటాం. ఒక్క గురువును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలం దక్కుతుందని విశ్వాసం. 'గు' అంటే అంధకారం 'రు' అంటే తొలగించేవాడు అని అర్ధం. అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు గురువు కాబట్టి గురువును సాక్షాత్ బ్రహ్మ అనడంలో సందేహం లేదని వేదశాస్త్రాలు చెబుతున్నాయి.

*గురుకుల విద్యాభ్యాసం*
పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న రోజుల్లో పురాణ పురుషులైన శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద, శ్రీరాముడు వశిష్టుని వద్ద విద్యాభ్యాసం చేసిన సంగతి తెలిసిందే! అలాగే చక్రవర్తులు, మహారాజులు కూడా తమ పిల్లలను విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపేవారు. ఆ గురువులు కూడా తమ శిష్యులను సొంత పిల్లల కన్నా అధికంగా ప్రేమించి విద్యాబుద్ధులు నేర్పించేవారు. అంతటి గురువులను స్మరించుకోవడానికి వ్యాసమహర్షి జన్మదినమైన గురుపూర్ణిమ రోజు శ్రేష్టమైనది. ఈ రోజు గురువులను పూజించడం వలన త్రిమూర్తులను పూజించిన ఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

*గురుపూర్ణిమ ఎందుకు జరుపుకుంటాం?*
ఆదియోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి రోజు సప్తర్షులకు జ్ఞానబోధ చేసాడని శివ మహాపురాణంలో వివరించి ఉంది. అలాగే దత్తాత్రేయ స్వామి ఈ ఆషాఢ పౌర్ణమి రోజే తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లుగా దత్త చరిత్ర చెబుతోంది. అంతేకాక గురువుకే గురువైన వ్యాస మహర్షి జన్మదినం కూడా ఈ రోజే! వ్యాస మహర్షి వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా గురుపూర్ణిమ రోజునే! ఇక గురువులను ఆరాధించుకోవడానికి ఇంతకంటే మంచిరోజు మరొకటి ఉంటుందా! ఇన్ని పుణ్య విశేషాలు ఉన్నాయి కాబట్టే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపూర్ణిమగా జరుపుకునే సంప్రదాయం వచ్చింది.

*గురు పూర్ణిమ ఎలా జరుపుకోవాలి?*
గురు పూర్ణిమ రోజు వ్యాస మహర్షిని పూజించడం వలన జ్ఞానమనే ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం. పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్షను స్వీకరిస్తారు. ఈ నాలుగు మాసాలు వారు ఎక్కడకు వెళ్లకుండా ఒకే ప్రాంతానికే పరిమితమవుతారు. దీక్షలతో, తపస్సులతో కాలాన్ని గడుపుతారు. గురుపూర్ణిమ రోజు సూర్యోదయం తోనే స్నానం చేసి జ్ఞానప్రదాత, విద్యాబుద్ధులు నేర్పిన గురువు వద్దకు వెళ్లి ఆయనకు పాదపూజ చేసి నమస్కరించుకోవాలి. గురువు పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సున చల్లుకోవాలి. గురువుకు నూతన వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి.

*గురుపూర్ణిమ రోజు ఇవి ఆచరించడం శ్రేష్టం*
వ్యాసుడి పూర్వకంగా మీ ఇష్టమైన గురువును ఉపాసన చేయాలి.
గురువులను స్మరిస్తూ పేదలకు అన్నదానం చేయాలి.
ఈ విధంగా గురుపూర్ణిమ రోజు గురువులను పూజించడం వల్ల గురువుల అనుగ్రహంతో ఇష్ట కార్యసిద్ధి, జ్ఞాన వైరాగ్యాలు, అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి.
*ఓం శ్రీ గురుభ్యోనమః*

No comments:

Post a Comment