*న్యాయం-1*
(రావిశాస్త్రి గారి కథలు)
గుప్పున సారా కంపు!
కోర్టు.
గొల్లున సంతగోల!
కోర్టు.
అబద్దాలకి పాముల పుట్ట!
కోర్టు.
బందెలదొడ్డికి రాచబాట!
కోర్టు.
(అక్కడ అనాథుల ఆక్రందన. అక్కడ అసహాయుల ఆర్తనాదం. అక్కడ పేదల కన్నీటిజాలు. అదే సుమా కోర్టు! అని కూడా నాకు రాయాలనుంది. అయితే, సెంటిమెంటల్ సాబ్ స్టఫ్, ఏడుపురాత రాసేనని తప్పక చాలామంది వెక్కిరిస్తారు.)
పదకొండున్నర. పచ్చని పగలు, మేజిస్ట్రేటుకోర్టులో పల్చపల్చని నీడలు. బెంచిమీద కూర్చున్న మేజిస్ట్రేటుగారి తలలో చిక్కు వీడని ఆలోచనలు.
వరండాలో జనుల కిటకిట. వారికేకల గోల. వారి శరీరాల వాసన, వారి బట్టల దృర్వాసన.
మేజిస్ట్రేటుగారు యువకులు. ముఖంలో లేతతనువు ఛాయలు ఇంకా పోలేదు. పెదవుల కటూ ఇటూ రెండు గీతలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, ముడుతలింకా నుదుట మీదకి ఎక్కలేదు.
అతనేదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలని బయల్దేరేడో ఆ సంగతి మధ్య దార్లో మర్చిపోయిన వాళ్ళా ఉన్నాడతను.
వెళ్తూన్న దారి సరైన దారేనా ని అనుమానం తగిలినవాళ్ళా ఉన్నాడతను. ఏదో ఆలోచిస్తూ కొంతసేపు కాయితంలో ఏదో రాసుకున్నాడు. తరువాత ఆగి, చూరువైపు చూస్తూ కూర్చున్నాడు.
బెంచీకి ఎదురుగా నాలుగైదు నల్లకోట్లు కూర్చున్నాయి. అయిదారు ఎర్రటోపీలు
నిల్చున్నాయి. బెంచి వెనక్కి గోడని ఎత్తుగా ప్రభుత్వ చిహ్నం మినుకు మినుకు మంటూ హాల్లో చీకటిని చీల్చుకొంటోంది. ఒక గోడనున్న పటంలోంచి ప్రెసిడెంటుగారు పట్టుదలగానూ, మరో గోడ నుంచి సర్దార్ పటేల్ గారు భీకరంగానూ చూస్తున్నారు.
మీదనున్న పంకాని చిరకాలపు సాలెగూళ్ళు గట్టిపట్టు పట్టుకోనున్నాయి. అవి పంకా కదలిక్కి సాగుతున్నాయే గాని సడలి తెగిపోవడంలేదు.
మేజిస్ట్రేటుగారి చూపు ఇంకా చూరు మీదుండగానే రెండు బూట్ల టకటక ఆయన చెవిన పడింది. టకటక లాడుతూ వచ్చిన బూట్లు టక్కున ఆగేయి. చూరుమీదున్న మేజిస్ట్రేటుగారి చూపు నెమ్మదిగా కిందికి దిగి, ఒక సబిన్ స్పెక్టరుగారి సాల్యూట్నీ, అతని చిరునవ్వునీ, సాల్యూటనంతరం కుర్చీలో అతను కూర్చోడాన్నీ గమనించింది.
"ఈ కేసుమీదే కదా?" అని అడిగేరు మేజిస్ట్రేటుగారు!
"ఏదిసార్?" అన్నాడు సబిన్ స్పెక్టరు.
"ఆ కేసు" అని ఓ ఆడపిల్లని చూపించేరు మేజిస్ట్రేటుగారు.
ఇన్ స్పెక్టర్ గారికి వెనగ్గా గోడకి బల్లిలా చేర్లబడి నిల్చుందొకామె. దూరంనుంచి చూస్తే, చీకట్లోచూస్తే ఆమె పిల్లలా ఉంటుంది. దగ్గిర్నించి చూస్తే పాతికేళ్ళు కనిపిస్తాయి.
అందరూ తనవైపు చూడ్డం చూసి ఆమె కొంచెం సిగ్గుచూపింది. అంతలోనే ఆ సిగ్గుని కట్టేసింది. పగటివేళ మెరుపులా వికృతంగానూ, అర్ధరాత్రి మెరుపులా భయంకరంగానూ ఉందా సిగ్గు.
కోర్టులో అంతా ఆ సిగ్గుచూసి ముచ్చటపడ్డారు. ఆమె పైటని తలమీదికి ముసుగువేసుకుంది. సగానికి ఉందా ముసుగు. ఆమె గుండెలు పుష్టిగా, మాయగా ఉన్నాయి. ముఖంలోనూ, మిగతా శరీరంలోనూ మాత్రం నిజం కనిపిస్తోంది. ఆమె వంట్లో ఊపిరిలేదు. ఆమె ముఖంలో కళాకాంతుల్లేవు.
మూడో తరగతి రైలు పెట్టెలో ఓ మూల నలిగిపడి వాడిపోయిన పువ్వులదండలా వుందామె.
'తూస్తే పావుశేరు మాంసం ఉండదు' అని ఆమెని చూడగానే తోచింది. మేజిస్ట్రేటుగారికి.
"కేసు మనదేకదోయ్?" అని ఇనస్పెక్టరు హెడ్డుని అడిగేడు.
"మనదే బాబూ! 'గేలం' పెట్టేం. పట్టుకున్నప్పుడు తమరుకూడా ఉన్నారు" అని దగ్గరకొచ్చి గొణిగేడు హెడ్డు.
"ఈ కేసు మా కేసేసార్" అన్నాడు ఇనస్పెక్టరు కోర్టువారితో, తరువాత హెడ్డుని మెల్లిగా "నేరం వప్పేసుకుంటుందా?" అని అడిగేడు.
"చిత్తం! అలాగే అంది అనడం మన్తో" అన్నాడతను.
"ఛార్జిషీటు చూస్తే నిన్న సాయంకాలం 'గేలం' సారాతో మీరే స్వయంగా
పట్టుకున్నట్టుగావుంది" అన్నారు మేజిస్ట్రేటుగారు.
"అవునంతేసార్. అది రైటేసార్!" అని కోర్టువారితో చెప్పి, "ఏమే! కేసు వప్పేసుకుంటావుకదూ?" అని ఆమెని అడిగేడు సబ్ ఇనస్పెక్టరు.
ఆమె మరోసారి వికృతంగా సిగ్గుపడింది. ఎడమచేతి ఎర్రని గోళ్ళని కుడిచేతి ఎర్రని గోళ్ళతో పాపుచేసుకుంటూ నిలబడింది.
ఆమె కట్టుకున్న నీలిపువ్వుల పరికిణీమీడి ఎర్రని కండువా పంకా గాలికి తలమీదా, గుండెలమీదా అతి నెమ్మదిగా కదుల్తోంది. రోడ్డువార నల్లకుక్క జూలులా ఆమె జుట్టంతా రేగిపోయింది.
"సిగ్గెందుకే, జవాబుచెప్పక?" అన్నాడు ఇనస్పెక్టరు.
కళ్ళెత్తి ఓసారి అతనివైపు చూసిందామె. ఆమె కళ్ళనే చూసేడు కాని కంటిలో తడిని గమనించలేదాయన.
"వీళ్ళకి రాత్రిళ్ళు సిగ్గుండదుసార్: పగలే ఈ సిగ్గంతాను" అన్నాడు ఇనస్పెక్టరు కోర్టువారివైపు తిరిగి.
"ఏం అమ్మాయ్! నీ కేంపని?" అని మేజిస్ట్రేటుగా రామెను ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకి అంతా నవ్వేరు.
మేజిస్ట్రేటుగారు నెల్లాళ్ళయి ఉద్యోగంలో ప్రవేశించేరు. ప్లీడర్లంతా ఆయనను గురించి *'చాదస్తం ముండాకొడుకు*' అని తీర్పు చెప్పేరు.
ఆయన గురించి "పట్టువిడుపూ లేదు. సర్దిపుచ్చుకోవడం తెలీదు. 'సత్యం సత్యం' అని తినేస్తున్నాడు.
కల్పన కొంచెం అయినాలేని కేసు పృథ్విలోనే లేదు. అసలు ఈ ప్రపంచమే భగవంతుడి పెద్ద కల్పన అంతా మాయే అయినప్పుడు మాయలోంచి మాయగాక యింకేమిట్స్తుంది? న్యాయంట, ధర్మంట, సత్యంట! ఇలాటివాడే వెనకటికోసారి 'నిజంచెప్పు! నిజం చెప్పు!' అంటూ పెళ్ళాంపిక పిసికేసి నూతిలోకి దూకేసేడు. నిజమూ, న్యాయమూ కావాలి;
కావాలంటే, నేను కాపరంచేసి పుట్టించాలిగాని, ఎక్కణ్నించి వొస్తుంది నిజం, న్యాయం?
కేసుల్లోనే న్యాయంవుంటే ఈ పోలీసులం మేమెందుకు ? ఇంతమంది ఈ ప్లీడర్లు అంతా ఎందుకు? ఈ కోర్టులన్నీ ఎందుకు" అని హెడ్డు- అతను పర్మనెంటుగా రివర్టయేడు - నాలుగైదు సార్లు వరండాలో చమత్కరించాడు.
"ఏం అమ్మాయ్? ఏంపని చేస్తావ్" అని ఆమెని మేజిస్ట్రేటుగారు మళ్ళీ అడిగేరు. అంతా మళ్ళీ నవ్వారు.
మేజిస్ట్రేటుగారికేమీ బోధపడ్డంలేదు. అతను పెద్దించివాడు. ప్రాక్టీసు చేసిన రోజుల్లో అతను, డబ్బున్నవాడే అయినా, నలుగురిలో తిరిగేవాడు కాదు. ప్రాక్టీను వుండకపోవడంచేత అతను కథలే చదివేవాడు.
ఎవరికీ చూపించకుండా పద్యాలు రాసుకొని దాచుకొనేవాడు. అతనికి కాకినాడ లో పెద్ద మేడా, హైద్రాబాద్ లో ఒక కొత్త
యిల్లూ ఉన్నాయి. అతనికి పల్లపు భూములున్నాయి. మెట్టున తోటలున్నాయి బ్యాంకులో మంచి అకౌంటుంది.
పురుష లక్షణానికి ఉద్యోగం వుంది. తల్లిదండ్రులకతను మంచి కొడుకు. తోబుట్టువులతనికి లేరు కాని, వుంటే వాళ్ళకతను మంచి అన్నదమ్ముడు. భార్య కతను ప్రేమించేభర్త. డెయిసీ ఇరానీ, షెర్లీ టెంపిల్, వాసంతి లాంటి కూతురుకతను మంచి తండ్రి. అతను చాలా మంచివాడు కాదని ఎవరూ ఇప్పటిదా అనలేక పోయేరు.
అందుచేత ఆయనకేమీ బోధపడ్డంలేదు.
"దాని కేం పనా? అదేపనండి" అని అప్పుడు హెడ్డు వస్తూన్న నవ్వు నిలిపిపారేసుకుని, కోర్టువారికి తెలియజేసేడు.
"ఏమే? సూకరాజు కంపెనీలో కదూ వున్నావు?"
అని ఇనస్పెక్టరు అడగ్గా ఆమె అవునన్నట్టు తలూపింది.
"ఏం కంపెనీ అది?" అని మేజిస్ట్రేటుగారు తిరిగి ప్రశ్నించేరు.
"కంపెనీ అంటే మామూలు కంపెనీ కాదుసార్! ముండల కంపెనీని ఇక్కడ టూకీగా 'కంపెనీ' అంటారు" అని ఇనస్పెక్టరు బెంచి దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా చెప్పేడు. మేజిస్ట్రేటుగారు పెదవి కరుచుకున్నారు.
ఎదురుగా నిల్చున్న ముద్దాయిగురించి ఆ సంగతి తెలియగానే అతనికెందు గాని అసహ్యం వేసింది. అసహ్యం కలగడం ఆయనకే ఆశ్చర్యం కలిగించింది. కథ లో పతితలా లేదామె. వాస్తవదృశ్యం చూసేసరి కాయనకి కడుపులో వికారం పుట్టింది.
"నిన్న సాయంకాలం సూకరాజు అనే ఆసామీ ఇంటిప్రక్కన సందులో, స్వాధీనంలో ఒకగేలం వంటసారా వుండగా, నిన్ను పట్టుకొన్నామని, మదరాసు ప్రాహి బిషన్ ఆక్టు సెక్షన్ 4(1) ఎ ప్రకారం నువ్వు నేరం చేసేవని పోలీసువారు నీమీద కేసు పెట్టే నేరం చేసేవా?" అని ముద్దాయీగా నిలబడ్డ ఆమెని పద్ధతి ప్రకారం ప్రశ్నించేరు.
సమాధానంగా పిల్ల తలవూపింది.
"తలూపడము కాదు, నోటితో సమాధానం చెప్పాలి."
"కేసు వొప్పేసుకుంటానండి" అందామె.
"అంటే, నేరం చేసేనంటావా?"
"కేసు కొప్పేసుకుంటానండి."
"నేరం చేసేవా?"
"కేసు కొప్పేసుకుంటాను బాబుగారూ.”
"నే నేం నేరం చెయ్య లేదండి.”
"అయితే కేసు వొప్పుకుంటానని యెందుకంటున్నావు?"
"కేసు కొప్పేసుకుంటానండి."
"కేసు వప్పుకోవడం అంటే ఏమిటి నీకు తెలుసా?"
(సశేషం)
No comments:
Post a Comment