Monday, August 17, 2026

 కథ 
*శ్రీమతి...ఒక బహుమతి*
*****************
నిన్న సాయంత్రం రిటైర్మెంట్ ఫంక్షన్ అయ్యాక ఆలస్యంగా ఇంటికొచ్చి పడుకున్నాడు ఆనంద్.

ఈరోజు నుంచి ఆఫీసుకు వెళ్ళక్కర్లేదు. ఆఫీసు అటెండర్, డ్రైవర్ అతనింటికి రారు. గడియారం కూడా నెమ్మదిగా తిరుగుతున్నట్లుగా ఉంది.
నీరజ కాఫీ కప్పు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. 
ఎదురుగ్గా ఉన్న టేబుల్ మీద  ఎప్పటిలా ఫైళ్ళు లేవు. ఆనంద్ అంతరంగ మస్తిష్కం లో మాత్రం పుస్తకంలో పేజీల్లాగా  జ్ఞాపకాల దొంతరులు తెరుచుకుంటున్నాయి.
కాఫీకప్పును చేతిలో పట్టుకుని బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాడు.
తన ముందు కూర్చున్న నీరజను గమనించాడు.
ఆమె జుట్టు అక్కడక్కడా నెరిసింది. ఆమె కళ్ళల్లో మాత్రం  ప్రశాంతత కనిపిస్తోంది.
"నీరజా!" పిలిచాడు.
అతని పిలుపులో సంవత్సరాల తపన దాగి ఉందనిపించింది.
నీరజ నవ్వుతూ చూసింది ' ఎందుక' న్నట్లుగా ?
నీరజకు దగ్గరగా జరిగాడు.
ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
ఇన్నాళ్లూ నిన్ను పట్టించుకోలేకపోయాఅన్నాడు నెమ్మదిగా. 
ఆనంద్ కళ్ళు  పశ్చాత్తాపంతో నిండిపోయాయి.
"గెజిటెడ్ ఆఫీసర్ గా ఇన్నాళ్లూ 'రాణిం'చానంటే ఆ వెనుక వెన్నుముకలా నీ కృషి ఉంది. ఇప్పుడు తెలుస్తోంది. నువ్వున్నావ్ కనుకనే నేను 'రాజు'లా వెలిగాను అన్నాడు.
నీరజ మృదువుగా నవ్వింది. "మీకిప్పుడే తెలిసిందా నా ప్రేమ? ఈ క్షణమే అర్ధమైందా నా హృదయం ?" అంది.
"అవును, నీ డైరీ చదివాకే తెలిసింది".
"పరాయి వారి డైరీ చదవడం తప్పు కదా ? అంది మెల్లగా.
"నిజమే. కానీ నువ్వు పరాయిదానివి కాదు. నాలో సగం. ఆ సగం అర్థమైంది" నీరజ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు.

ఆనంద్ మాటలతో, నీరజకు 
కాలం వెనక్కు వెళ్లినట్లనిపించింది. డైరీలో ఒక్కొక్క పేజీ గతం గుర్తు చేస్తూ  కళ్ళ ముందు సినిమా రీళ్లలా కదలాడింది.
        ******
ఆనంద్ ఒక మామూలు సాదా సీదా ప్రభుత్వ గుమస్తాగా ఉద్యోగం చేస్తున్నాడు. తాను ఉంటున్న ఇంటిని, నెలలో వచ్చే జీతాన్ని చూసి నిట్టూర్చేవాడు. 
సగటు జీవి(తం). పైకి ఎగురలేడు. కిందకు దిగనూ లేడు.

పేరు చివర పేరు మోసిన డిగ్రీలు ఎన్ని చదివినా, అర్హతకు తగిన ఉద్యోగం రాలేదన్న అసంతృప్తి ఏ మూలనో ఉండి పోయింది. అయితే, ప్రేమించి పెళ్లాడిన నీరజను, ప్రేమకు ప్రతిఫలం అయిన అరుణ్ ని చూసి, ఆ  అసంతృప్తిని పక్కన పెట్టేసేవాడు.
ఇల్లు చిన్నది. జీతం ఇంకా చిన్నది. అయితే అతని హృదయం విశాలం. మమత అనంతం.
ప్రేమ ఆకాశం.
భార్యా, బిడ్డలతో హాయిగా గడిపేవాడు.
సాయంత్రం సైకిల్ బెల్ వినబడటంతోనే నీరజ కళ్ళు గుమ్మం వైపు చూసేవి. నీరజ వీధి గుమ్మం చేరుకునేసరికి కళ్ళు వాకిట్లో ఉండేవి.
"అమ్మా!...'నాన్న!' వచ్చారంటూ ఐదేళ్ల అరుణ్ తండ్రి తెచ్చే చాకలెట్ల కోసం సైకిల్ దగ్గరకు చేరిపోయేవాడు.
చాకలెట్లు తీసుకోగానే అరుణ్ ముద్దిచ్చేవాడు.
"మా మంచి నాన్న" అంటూ చాకలెట్స్ పట్టుకుని ఆటలకు వెళ్లిపోయేవాడు.
"నీరూ! మన వాటా" అంటూ మూర మల్లెపూల దండను చేతిలో పెట్టేవాడు. నీరజ మురిపెంగా తీసుకునేది.
అరుణ్ చాకలెట్స్ తీసుకోగానే ముద్దిచ్చాడు. మరి నువ్వు ?  కొంటెగా  అనేవాడు.
చాళ్ళెండి...సంబడంఅంటూ కవ్వించేది.
ఆరోజు ఆనంద్ నీరజ ల పెళ్ళిరోజు.
రాత్రయింది. పున్నమి వెన్నెల పడకగది  కిటికీలోంచి గదిలోకి ప్రసరిస్తోంది.
ఆనంద్ పడుకోబోతూ కిటికీ వేయడానికి లేచాడు.
"ఎందుకో ?" అంది కవ్వింపుగా.
"చందమామ చూస్తాడు" అన్నాడు అంతే కవ్వింపుతో.
"మెల్లగా వేయండి!"
"దేనికో?"
"బాబు లేస్తాడు".
"గడుసరివే"
"సొగసరిని కానా ?
"కాదన్నానా ? కబుర్లతోనే  వెన్నెల రాత్రిని కరిగించేస్తావా ? అంటూ నీరజను దగ్గరకు తీసుకున్నాడు.
తమకంతో ఆనంద్ ను అల్లుకు పోయింది.
ఆనంద్ తపనతో నీరజకు మరింత చేరువ అయ్యాడు.
కొంతసేపటి తరువాత
ఆనంద్, అరుణ్ తో సమానంగా ఆదమరిచి నిద్ర పోతున్నాడు.
నీరజ ముందు గదిలోకి వచ్చి తన డైరీ తీసుకుంది.
"ఈ పున్నమి రాత్రి ఎంతో అందంగా, ఆనందంగా గడిచింది. ఈ ఆనందం పదిలం కావాలి. ఆనంద్ ఎప్పుడూ, నాతో ప్రేమగా ఉండాలి. అని రాసింది.
తెలతెల్లగా తెల్లారింది.
ఆరోజు ఆదివారం.
ఆనంద్ అరుణ్ ను సైకిల్ సీటు మీద కూర్చోపెట్టి, సైకిల్ ను పట్టుకున్నాడు. ముందుకు నడిపిస్తున్నాడు.
కాలు అందడం లేదు. పడిపోతా నాన్నా!
నన్ను దాటి ఎదగాలి. నేను చూడాలి. నీ బాధ్యత నాది. అన్నాడు. సైకిల్ పై విన్యాసమా ?
తండ్రీ కొడుకులకేసి ఆప్యాయంగా చూస్తూ అంది.
కాదు... విహారం అన్నాడు.
"అమ్మా! నేను ముందు కూర్చుంటాను. నువ్వు వెనుక సీటు మీద కూర్చో. నాన్న సైకిల్ తొక్కుతారు" అన్నాడు అరుణ్.
"అమ్మో! నాకు భయం కన్నా!" అని నీరజ. 
"ఆనంద్ ఉండగా నీ చెంత. ఇంకేల ఆ చింత ?"  నవ్వుతూ అన్నాడు సైకిల్ సీటు మీద కూర్చుంటూ.
"శ్రీవారు ప్రాసలో బాగా చెప్పారే"

పడిపోకుండా కూడా సైకిల్ నడిపేస్తా అంటూ నీరజను సైకిల్ వెనుక సీటుపై కూర్చోబెట్టాడు. మెల్లగా ముందుకు సైకిల్ తొక్కాడు.
ఆమె చేతులు ఆనందును వెనుక నుండి పట్టుకున్నపుడు
'సైకిల్ కదిలిందా, ఆమె గుండె కదిలిందా ? నీరజకు తెలియలేదు. ఆమె  శ్వాస తాకిడికి అతడి మనసు ఎగిరినంత ఆనందంగా ఉంది.
దారిలో ఫోటో స్టూడియో దగ్గర ఆపాడు. ఆనంద్ ను చూడగానే ఫోటో స్టూడియో అప్పారావు బయటకు వచ్చాడు.
"అప్పారావ్ ! మా ముగ్గురికి ఈ సైకిల్ మీద ఉండగా ఓ ఫోటో తియ్యి" అన్నాడు.
అప్పారావు వెంటనే ఇన్ స్టెంటు కెమెరా తో ఫోటో
తీసిచ్చాడు.  మళ్ళీ ఇంటికి బయల్దేరారు.
భార్యా, బిడ్డలను సైకిల్ పై బాధ్యతగా ముందుకు నడిపిస్తున్న భర్త మీద అమితమైన ప్రేమ కలిగింది. ఆ ప్రేమనే, అక్షరాలలో వ్యక్త పరచాలనుకుంది.
డైరీ తీసింది. పేజీలు తిప్పింది.
"ఈనాటి  ఈ సంతోషం విలువ, కలంతో రాయలేనంత. కాలం తో కొలవలేనంత. నా ఆనందం అంబరాన్ని తాకింది. సంబరాలు జరుపుకోవడానికి పండుగే అవసరం లేదు. మనకంటూ మనసు, ఆ మనసును అర్ధం చేసుకునే మనిషి ఉంటే చాలును . మా ఇల్లు ఇరుకే..కానీ ఆయన హృదయం విశాలం.
జీతం తక్కువే. కానీ   జీవితం ఆనందమయం...ఆ ఆనందం ..ఈ అనంద్  నా సొంతం" అని రాసింది.
**********
కాలం గిర్రున తిరగడం సహజం. కానీ ఆనంద్ కూడా కాలంతో సమానంగా పరుగు పెట్టాడు. ఉద్యోగం, స్థాయీ పెరగాలనుకున్నాడు. జీతం, హోదా, సోషల్ స్టేటస్ అన్నీ పెరగాలి...పెంచుకోవాలి" అనుకున్నాడు. పట్టుదలతో చదివాడు. గ్రూప్స్ పరీక్షలు రాసి గెజిటెడ్ ఆఫీసర్ అయ్యాడు.
మూడు గదుల ఇల్లు, మూడు బెడ్ రూమ్ ల  భవనమైంది. సైకిల్ స్థానంలో కారొచ్చింది. నీరజకు  పనితో పాటు ఆనందమూ ఆవిరయ్యింది.  ఒకే ఇంట్లో ఉంటున్నా ఆనంద్ తనకు బాగా దూరంగా ఉన్నట్లుగా ఉంటోంది. మనసు విప్పి మాట్లాడుకునే సమయం లేదు. ఆనంద్ చుట్టూ ఫైల్స్, ఎప్పుడూ ఫోన్స్...నెలలో ఎక్కువుగా క్యాంపులు.
గతంలో నీరజ రోజులో ఒక్కసారి మాత్రమే డైరీ చూసేది, రాసేది.
ఆనంద్ ఆఫీసు పనితో, అరుణ్ హాస్టల్ చదువులో బిజీ బిజీ అయ్యారు.
మధ్యలో నీరజ మాత్రం నిశ్శబ్దంగా సర్దుకుంది. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో నీరజ కు అర్థమయ్యింది. డైరీ తోనే  రోజంతా గడుపుతోంది.
ఆనంద్ ! నేను నీ ఉరుకుల, పరుగుల జీవితాన్ని ఆశించ లేదు. నువ్వు ఎదిగావ్. అది గెలుపే కావచ్చు. కానీ నాకు అందడం లేదు. నీ గెలుపుతో నా ఓటమి మొదలైంది. నీ చేతిని అందుకునే లోపు, పరుగు పెడుతున్న కాలం, నీ వేళ్ళు పట్టుకుంది. పున్నమి రాత్రులు నన్ను వెక్కిరిస్తూ వెళ్లిపోతున్నాయి. నా మరో సగం... ఆశల పల్లకీని అందుకోవాలని అలసి సొలసి తిరుగుతోంది. ఈ సగం మాత్రం ఆశగా ఎదురు చూస్తోంది అంటూ డైరీలో రాసుకుంది.
*************

నీరజా! పిలుస్తుంటే పలకవే. ఏమిటా ఆలోచనలు ?
ఆనంద్ మాటలతో ప్రస్తుతం లోకి వచ్చింది.
ఇన్నాళ్లూ మౌనమే నా భాష అయింది. మూగకు మాటొచ్చినా, ఆనందం ఎక్కువైనా, ప్రతిస్పందనకు సమయం పడుతుంది అంది.
నీకొక గిఫ్ట్ అంటూ ఒక కవర్ చేతిలో పెట్టాడు. 
కవర్ ఓపెన్ చేసి చూసింది. ఫోటో...
ఆ ఫోటో గతకాలపు తీపి జ్ఞాపకం. అరుణ్ ముందు కూర్చున్నాడు. తాను వెనుక సీటు మీద కూర్చుంది. ఆనంద్ సైకిల్  మధ్య సీటు మీద కూర్చున్నాడు.
ఫోటో చూడగానే నీరజ కళ్ళు జలపాతాలయ్యాయి...నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి.
ఈ కోల్పోయిన ఆనందాన్నే కోరుకున్నానంటూ నీరజ, ఆనంద్ భుజం మీద వాలిపోయింది.
"ఉద్యోగం,  జీవితంలో ఒక భాగం. కానీ 'ఆలూమగల అనుబంధం' అంటూ ఆనంద్ కేసి చూసింది.
"భాగం కాదు, జీవితం" అన్నాడు. నీరజను మరింత దగ్గరగా తీసుకుంటూ.
వాళ్ళిద్దరి 'చొరవ' మధ్యన గాలి కూడా 'చొర 'బడలేక తన ఓటమిని ఒప్పుకుంటూ పక్కకు తప్పుకుంది.
****************
  ..శుభం..
**************
Lakshman Rao Kokkeragadda

9/8/2026 ఆదివారం, ప్రజాశక్తి అనుబంధం స్నేహలో ప్రచురించడం జరిగింది..
***********

.

No comments:

Post a Comment