Saturday, April 8, 2023

శ్రీ రమణీయం - 15🌹 👌శాశ్వత శాంతిని కోరుకోవటమే వైరాగ్యం👌

 [4/8, 18:07] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 15🌹
👌శాశ్వత శాంతిని కోరుకోవటమే వైరాగ్యం👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 15. శాశ్వత శాంతిని కోరుకోవటమే వైరాగ్యం🌹

✳️ ‘విశేషమైన రాగమే వైరాగ్యం'* అని మన సద్గురుదేవులైన శ్రీశివానందస్వామి వారివ్యాఖ్య. ఒక విషయంపై ఉండే అమితమైన ఇష్టం ఇతర విషయాలపై ఉదాసీనతకు, నిర్లిప్తతకు, అయిష్టతకు కారణం అవుతుంది. అలాగే మనలో భక్తి భావం పెరిగి దైవంపై అంతటి ఇష్టం ఏర్పడిన రోజు లౌకిక విషయాలపై అయిష్టత అదే వస్తుందన్న సత్యాన్ని 'స్వామి' అలా తెల్పారు. జ్ఞానుల బోధల్లో భాష తేడా ఉంటుంది గానీ భావం మాత్రం ఒకటే. 

✳️ 'మనకి శాశ్వత శాంతిని ఇచ్చే విషయాలను మాత్రమే కోరుకోవటం వైరాగ్యమని'* శ్రీరమణ భగవాన్ విశ్లేషణ. మనకి లౌకిక జీవితంలోని వస్తువులు గానీ, విషయాలు గానీ, ఏవీ శాశ్వత శాంతిని సంతోషాన్ని ఇవ్వవు. లౌకిక జీవితంలో అలసిపోయిన మనసు ఒక రోజుకి ఈ సత్యాన్ని గ్రహించి శాశ్వత ఆనందాన్నిచ్చే ఆధ్యాత్మికానుభూతిని కోరుకుంటుంది. ఆ కోర్కె తీవ్రమై తపనగా మారి వైరాగ్యంగా సిద్ధిస్తుంది. ఈ వైరాగ్య భావనకు వివేకం సహకరిస్తుంది. మన వివేకంచేత ఏదినిత్యం, ఏది అసత్యం, ఏది  శాశ్వతం ఏది శాంతిమయం అన్న విశ్లేషణ సాధ్యమౌతుంది. మనం నిత్య జీవితంలో తాత్కాలికంగా పొందే శాంతిని శాశ్వతం చేసుకునే ప్రయత్నమే భగవాన్ చూపుతున్న విచారణ మార్గం. 

✳️ దయామయుడైన భగవంతుడు ప్రతిరోజు నిద్రలో మనకి అఖండ శాంతి వైభవాన్ని రుచి చూపిస్తూనే ఉన్నారు. అందుకే సృష్టిలో ప్రతి ప్రాణి నిద్రను ఇష్టపడుతూనే ఉంటుంది. నిద్రలో పారదర్శకమైన అద్దంలా ఉండే ఆత్మ,  ఏ వికారాలు లేకుండా ఉంటుంది. మెళుకువరాగానే చర్మానికి, ఆకారానికి అహంకరణ అనే కళాయి పూత చేరి వస్తువులను ప్రతిబింబించటం ప్రారంభించి మనసుగా మారుతుంది పైగా పంచేంద్రియాల ద్వారా గ్రహించే విషయాలన్నీ దాని వల్లనే జరుగుతున్నాయన్న కర్తృత్వ భావన పెంచుకొని నిద్రలో ఉన్న శాంతిని మనకి దూరం చేస్తుంది. *మెళకువలో కూడా నిద్రాస్థితి కొనసాగాలని* శ్రీ రమణ భగవాన్ చేసే బోధలో ఆంతర్యం.  *అహంకరణ లేని శాంతిని కొనసాగించమనే తప్ప, మత్తుగా ఉండమని కాదు. అంటే ఏ వికారాలులేని చైతన్యస్థితి కోసం మన ప్రయత్నం సాధనగా సాగాలి. అందుకు భక్తితోపాటు మనకి సద్గుణ సంపత్తి అవసరం.* 

✳️ గుణం లేని భక్తి ఎంత ప్రమాదమో రావణాసురుడు, హిరణ్యకశిపుడు వంటి రాక్షసుల కథలు మనకు బోధిస్తాయి. దైవసాక్షాత్కారం జరిగినా అణిగిపోనంత బలమైన అసురీ గుణాలు వారివి. మనలోనూ ఉన్న ఈ అసుర లక్షణాలు, గుణదోషాలు పోవాలంటే నిరంతర స్మరణం, ఆహార వ్యవహార నియమం చాలా అవసరం. మనలో ఉన్న వాసనా వికారాలను ఆహారం పెంచి పోషిస్తుంది. సాత్వికాహారం సత్వ గుణాలను పెంచుతుంది. సాధకులు సాత్వికాహారం తీసుకోవటం ఉత్తమం. నిరంతర నామజపం, స్మరణలవల్ల జన్మజన్మలుగా వచ్చే గుణదోషాలు పోతాయి. సాధన లేని ఆహార నియమం మానసిక ప్రయోజనాలు చేకూర్చదు. సాత్వికాహారమే తీసుకునే అనేక జంతువుల్లో సాత్వికత లేకపోవటం మనకు తెలిసినదే. అలానే ఆహార నియమం లేని సాధన అసుర గుణాలను పెంచి లక్ష్యాన్ని చేరనివ్వదు. 

✳️ సాధనకు ఆరంభంలో మనం దైవాన్ని ఏదో ఒక రూపంగా ఆశ్రయించాల్సిందే. మనసును నిగ్రహించేందుకే విగ్రహాం. అయితే అది మనలో సంశయాలను, ఇతర దేవతామూర్తులపై చిన్నచూపును ద్వేషాన్ని కలిగించకూడదు. శివుడు లయకారకుడు కదా! అన్న ఓ భక్తుడి సంశయాన్ని భగవాన్ 'అవును ! దుఃఖాలను లయం చేస్తాడు కదా' అన్న సమాధానంతో తీర్చారు. శివుడంటే శుభ స్వరూపం, తృప్తినిచ్చేవాడు. ఆ తృప్తి ద్వారానే శాశ్వత సుఖానుభూతినిచ్చే మోక్షస్థితిని ఇస్తారు. మనసు నిలవటం కోసం ఆశ్రయించిన దేవతా రూపాలు, విశ్వాసాలే మన మోక్షస్థితికి అడ్డుకాకూడదు. భక్తితో వికారాలు నశించిన శుద్ధ మనసే మనం ధ్యానించే రూపాన్ని దర్శింప చేస్తుంది. అయితే ఏ రూపం అయినా శాశ్వతం కాదుకదా.. అన్న భగవాన్ బోధన సాధకులు సదా గుర్తుంచుకుంటే సాధన సంపూర్ణం అవుతుంది. 

✳️ మనలోని నిరాకారమైన ఈశ్వర చైతన్యమే సాధనలో పరిణామక్రమాన్ని బట్టి దర్శనం వంటి అనుభవాలు కలిగించి మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఎవరిని ఏ రూపంలో అనుగ్రహించాలన్నా ఈశ్వరుడు అందరి మనసుల్లో ఆ చైతన్య స్వరూపుడిగా ఉండాల్సిందే. గాలి, నీరు అవి ఉన్న పాత్ర ఆకారాన్ని పొందినట్లే,.. దైవం మన భావనను బట్టి ఆకారం తీసుకుని దర్శనమిస్తారు. మనం నిర్గుణంగా ధ్యానించినా, రూపంతో పూజించినా ఆ రెండూ మనలోని ఆత్మ చైతన్యంతో జరగాల్సిందే. మన ఇంద్రియాలు పంచభూతాలను ఆశ్రయిస్తే, అవి ఈశ్వరుడ్ని ఆశ్రయించుకొని ఉంటాయి. ఈ సృష్టిలో ఏది జరగాలన్న అది ఈశ్వర చైతన్యంతోనే జరగాలి. కర్తృత్వ భావన చేత మన శరీరంలో జరిగే ఈశ్వర లీలలు మనం గమనించం. 

✳️ మన ప్రమేయం లేకుండానే జరిగే హృదయ స్పందన, రక్త ప్రసారం, జీర్ణక్రియ వంటి కోటి పనులు ఈశ్వర చైతన్యమే చేయిస్తుంది. వీటన్నింటిలో ఒకానొక గమనింపు అనే పని కూడా ఉంది. అదే మన మనసుగా వ్యక్తం అవుతుంది. ఈశ్వర చైతన్యంతో జరిగే అన్ని పనులనూ ఈ మనసు తనవిగా ఆపాదించుకొని కర్తృత్వ భావనను, అహంకారాన్ని పెంచుతుంది.
[4/8, 18:08] +91 73963 92086: అదే మనని సత్యానికి దూరం చేస్తుంది. సదా ఆ ఈశ్వర వైభవాన్ని జ్ఞప్తిలో ఉంచుకొని నిరహంకారంగా జీవించటం ద్వారా సాధన సులభం అవుతుంది. 

✳️ నిరంతరం ఈశ్వర వైభవాన్ని అనుభవిస్తూనే భగవాన్ తన 76 ఏళ్ళ జీవితం ఒక్క క్షణంలా గడిపేశారు. వారు చూపిన విచారణా మార్గం దైవం కోసం ఎక్కడికో పరుగులు పెట్టకుండా మనలోనే ఉన్న ఆ దివ్యత్వపు ఉనికిని కనుగొనేలా చేస్తుంది. వంద గ్రంధాలు వల్లె వేసినా ఈ దేహాత్మభావన నశించదు. సాధనతో సారాన్ని ఆకళింపు చేసుకొని ఆచరిస్తే తప్ప ఆత్మానుభూతి కలగదు. అది సాధించిన వారే నిజమైన పండితులు. 

✳️ జనక మహర్షి కొలువులోకి అడుగుపెట్టిన అందవికారుడైన అష్టావక్రుడు అనే జ్ఞానిని చూసి అంతా నవ్వారట. అందరితో పాటు గొంతు కలిపిన ఆ జ్ఞాని, అందుకు కారణం అడిగిన జనకునితో.. 'రాజా నువ్వు పండిత సభలో ఉన్నావని అనుకున్నాను. విలువనిచ్చే ఈ పామరులతో ఉన్నందుకు నవ్వొచ్చింది' అన్నాడట. ఎంతటి విజ్ఞానమైనా దేహాభిమానం, అహంకారం నశిస్తేనే అది జ్ఞానంగా పరిమళిస్తుంది. శాశ్వతం కాని విషయాత్మక సుఖాన్ని వివేకంతో గుర్తించాలి. అఖండశాంతినిచ్చే ఆత్మ వైభవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకు భక్తి, జ్ఞాన, యోగ మార్గాలు ఏవైనా శిరోధార్యాలే. ఏ మార్గంలో ఉన్న వారికైనా వివేకాన్ని పెంచే విచారణ మార్గం కరదీపిక కాగలదు.

   🙏ఓం నమోభగవతే శ్రీరమణాయ🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment