తుంగలా ఉండాలి!
మహాభారత యుద్ధానంతరం శ్రీకృష్ణుడు ప్రేరేపించగా శరతల్పగతుడైన భీష్ముని వద్దకు ధర్మరాజు వచ్చి, ధర్మా ధర్మముల స్వరూపం తెలుసుకొనే ఉద్దేశంతో పలు ప్రశ్నలు వేస్తాడు. శత్రువు అధిక బలుడైనప్పుడు, అల్ప బలుడైనవాడు ఏ విధంగా తనను తాను రక్షించుకొని ఆపద నుండి బైటపడాలి? అనేది వాటిల్లో ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు ఒక కథ చెప్పాడు.
"ఒకప్పుడు సముద్రుడి మెదడులో ఒక సందేహం పొడమింది. అది తీర్చుకొనేటందుకు అన్ని నదులనూ ఈ విధంగా అడిగాడు: 'మీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్పుడు వేళ్ళతో సహా పెళ్ళగింపబడిన మహా మహా వృక్షాలు మీతోపాటుగా వస్తుంటాయి. కానీ అలా ఎప్పుడు తుంగ గడ్డి మొక్కలు రావటం నేను చూడలేదు. తుంగ గడ్డి మొక్కలు సన్నగా పొడుగ్గా బల హీనంగా ఉంటాయి. అవి మీ ఒడ్డు లనే పెరుగుతాయి. అవి ఎందుకు పెళ్ళగింపబడవు? అవంటే మీకు చిన్న చూపా? లేక మరే విధంగానైనా అవి మీకు ప్రీతి. పాత్రమైనవా? వాటిని పెరికి వేయటానికి మీకు శక్తి చాలదా? ఎందువల్ల వాటికి చేటు వాటిల్లదు?
అందుకు గంగానది, అన్ని నదుల పక్షాన ఈ విధంగా అన్నది: 'పెద్ద పెద్ద వృక్షాలు అన్నీ ఒకే చోట స్థిరంగా పాతుకుపోయి ఉంటాయి. అందువల్ల అవి మాకు ఎదురొడ్డి నిల్చినప్పుడు మా ప్రవాహ వేగానికి వాటి స్థానాలను అవి విడిచిపెట్టక తప్పదు. తుంగ గడ్డి మొక్కల పరిస్థితి వేరు. మా ప్రవాహ ఉద్ధృతికి అవి తలొగ్గుతాయి. వరద ఉద్ధృతి తగ్గగానే తుంగ గడ్డి మొక్కలు మళ్ళీ పైకి లేచి యథాస్థితికి వస్తాయి. అవి సమయానుకూలంగా ప్రవర్తిస్తాయి. మొండిగా వ్యవ హరించవు. అందువల్ల ఆ మొక్కలను మేము పెరికి వేయం.
ఈ కథ సారాంశం ఏమిటంటే... తన కంటే బల వంతుడైన శత్రువును ఎదుర్కోవాలి అంటే సరైన సమయం, అవకాశం కోసం కాచుకొని ఉండాలి. శత్రువు బలం ఏ పాటిదో, తనకున్న శక్తి ఎంతటిదో అంచనా వేసుకోవాలి. తొందరపాటుతో మూర్ఖంగా శత్రువును ఎదిరించకూడదు."
- దీవి సుబ్బారావు…….
No comments:
Post a Comment