*🙏శ్రీ అన్నమాచార్య సంకీర్తన🙏*
ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు
ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు!!
చరణం :-
ఎందరికి కొడుకుగాడీ జీవుడు
ఎందరికి తోబుట్టడీ జీవుడు
ఎందరికి కొడుకుగాడీ జీవుడు వెనక
ఎందరికి తోబుట్టడీ జీవుడు
ఎందరిని భ్రమియింపడీ జీవుడు దుఃఖ
మెందరికి గావింపడీ జీవుడు
…..ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు
ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు!!
ఎక్కడెక్కడ తిరుగడీ జీవుడు
ఎక్కడో తన జన్మ మీ జీవుడు
ఎక్కడెక్కడ దిరుగడీ జీవుడు వెనుక
ఎక్కడో తన జన్మ మీ జీవుడు
ఎక్కడీ చుట్టము ఈ జీవుడు ఎప్పుడెక్కడికి నేగునో ఈ జీవుడు
…..ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు
ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు!!
ఎన్నడును చేటులే నీ జీవుడు
ఎన్ని తనవులు మోవడీ జీవుడు
ఎన్నడును చేటులే నీ జీవుడు వెనుక
ఎన్ని తనవులు మోవడీ జీవుడు
ఎన్నగల తిరువేంకటేశు మాయలదగిలి
యెన్ని పదవుల బొందడీజీవుడు
…..ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు
ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు
ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు!!..2
ఈ జీవుడు ఎన్నో జన్మములలో ఎందరికో జన్మించుచున్నాడు. జనన మరణాత్మకమైన సంసారచక్రములో పరిభ్రమించుచున్నాడు. ఇట్టి జీవుడు ఏ యే జన్మలలో ఎవరెవరికి ఏయే వావివరుసలలో సంబంధపడియున్నాడో నిర్ణయించుట కెవరి తరము ?
విచారించగా జీవులలో ఒకరితో నొకరికెట్టి సంబంధమును లేదు.
1. ఈ జీవుడెన్నో జన్మములలో ఎందరికో కొడుకై జన్మించినాడు. పూర్వము తానెందరికో తోబుట్టువుగా పుట్టినాడు. ఎందరినో ఎన్నో విధముల పుత్రమిత్ర కళత్రాది సంబంధములతో భ్రమింపజేసినాడు. ఎందరినో ఎన్నో రీతుల దుఃఖముల పాలు చేశారు.
2. ఈ జీవుడు తిరుగని చోటే లేదు. ముందటి జన్మల ఎన్నో చోట్ల పలు రూపులతో జన్మించి తిరిగియున్నాడు. తానున్న జన్మములో ఇతడెక్కడ పుట్టనున్నాడో? ఈ జన్మములో మాత్రము తనకీజీవుడేవిధముగా అనుగు చుట్టము కాగలడు ? ఇతడెప్పుడెక్కడికి పోవునో తెలియదుగదా !
3. ఇన్ని జన్మలు దాల్చుచున్నను, ఇన్నిసార్లు మరణించుచున్నను నిజముగా ఈ జీవునకు మాత్రము ఎట్టి చేటును లేదు. పూర్వమితడెన్నో తనువులు దాల్చినాడు. తాను దాల్చిన శరీరములే చేటందుచున్నవి గాని సనాతనుడైన జీవాత్మునకేమాత్రము చేటు లేదు. శ్రీవేంకటేశ్వరుని మహా మాయా ప్రభావమునకు లోబడి ఈ జీవుడెన్నో పదవులు పొందుచున్నాడు.🙏
No comments:
Post a Comment