Thursday, April 27, 2023

🧘శ్రీ అన్నమాచార్య సంకీర్తన🧘‍♀

 *🧘శ్రీ అన్నమాచార్య సంకీర్తన🧘‍♀*
🕉️🌞🌏🌙🌟🚩

గానం. M. S. సుబ్బలక్ష్మి. 


నానాటి బదుకు నాటకము
కానక కన్నది కైవల్యము!!


పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట గలదీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము!!


కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడు మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడె కైవల్యము!!


తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము!!

నానాటి బదుకు నాటకము!!

🕉️🌞🌏🌙🌟🚩

     శ్రీ అన్నమాచార్యుల వారు వేదాంతమంతా రంగరించి తేలిక పదజాలంతో మహోన్నతమైన భావనావాహినిగా చెప్పిన హృద్యమమైన కీర్తన ఇది. దీన్ని పాడుతున్న సమయంలో ఆయన వాయిస్తున్న 'ఏకతార' చేతిలోనే తెగిపోయిందని, దానితో ఆయన మోక్షోన్ముఖుడై తిరుమల చేరుకొని స్వామి కృపతో ముక్తిని పొందాడని కొందరు చెబుతారు.


"జీవితమే ఒక నాటకరంగం"...అనే నేటి ఆధునికుల ఆలోచనలకు ఆచార్యుల వారి ఇటువంటి కీర్తనలే మాతృకలంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మనస్సు కదిలించే కీర్తన ఇది.


     ప్రతి దినము మనం 'అనుభవిస్తున్నాం' అనుకొంటున్న ఈ జీవితమంతా నిజానికి ఒక నాటకం వంటిది. మన పూర్వ సుకృతంతో పొందేది మాత్రమే మోక్షము.


మన పుట్టుక సత్యము. ఒకనాటికి తప్పక చచ్చిపోతామనేదీ నిజమే. కాని ఈరెండిటి మధ్యలో మనం చేసేదంతా 'నాటకమే' మనకళ్ళెదుట కనబడేది ప్రపంచము. కానీ మన తుది గమ్యం మాత్రం ఆ మోక్షమే.


మనం తినేది ఆహారం, ధరించేవి బట్టలు. కానీ ఇవన్నీ మన పుట్టుకతో వచ్చి చావుతో పోయేవే. ఈమధ్యలో వచ్చే వన్నీ మధ్యలో నాటకం నడవటానికి పరికరాలు మాత్రమే. మనం ఒడిలో కట్టుకొని తీసుకొనిపోయే ప్రారబ్ధ, సంచిత కర్మలు లెక్కలు తేలి పరిసమాప్తమయ్యాక మాత్రమే మోక్షం దక్కుతుంది. అందాకా ఈ నాటకం తప్పదు.


ఈ నాటకం జరుగుతున్నదాకా పాపమూ తెగదు, పుణ్యమూ తీరదు. వాటి వల్ల నవ్వులతో నడిచే ఈ నాటకం రంజుగానో విషాదంగనో వుంటుంది. పైన ఆ ఏడుకొండల మీదనున్న శ్రీవేంకటేశ్వరుడే మనందరి ఏలిక. ఆయన అధీనంలో వున్న ఆ నింగినున్నదే మోక్షము.


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు రెండు విషయాలను మనకు విన్నవించారు. ఒకటేమో నాటకం, రెండవదేమో కైవల్యం.


నానాటి అంటే నాలుగు రోజుల ఈ బతుకు... బాల్యము, యవ్వనము, ప్రౌఢత్వం, వృద్ధాప్యము... ఈ దేహ స్థితులు ప్రతి జన్మలోనూ మనకు ఉంటాయి. ఆ తర్వాత శరీరాన్ని వదిలి పెట్టెయ్యాలి. శరీరాన్ని వదిలి పెట్టకముందే మనం శరీరం కాదు ఆత్మ పదార్ధం అని గ్రహించాలి. 'కానక' అంటే చర్మచక్షువులతో కనకుండా!  'కన్నది' అంటే దివ్యచక్షువుతో మూడవకన్నుతో చూసిందే కైవల్యం అనగా చిట్ట చివరి స్థితి అని వివరిస్తున్నారు  శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. 


ఈ పుట్టుక, చావు మధ్యలో ఉన్న పనే నాటకం.  'తల్లిగానో, తండ్రిగానో, భర్తగానో, భార్యగానో, కొడుకుగానో, కూతురుగానో నాటకాలు వేస్తాము',  అయితే అదే సత్యమనుకున్నామా దు:ఖంలో పడతాం.  మనం ఈ శరీరాన్ని వదిలి పెట్టేసిన తర్వాత వేరే ప్రపంచానికి వెళ్తాం ...సత్యలోక ప్రపంచానికి !  ఆత్మలోక ప్రపంచానికి ... అదే కైవల్యం అంటున్నారు శ్రీ తాళ్ళపాక వారు..


రోజంతా కూడానూ మనం కేవలం అన్నము, బట్టల కోసమే శ్రమిస్తున్నాము!  ఎంత మాత్రం 'ఆత్మ ప్రాధాన్యత' లేదు...అన్నానికీ, బట్టకూ! ఏదో శరీరం నిలకడ కోసం కొద్దిగా తింటే సరిపోతుంది. శరీరాన్ని రక్షించుకునేందుకు కొద్దిగా బట్ట చుట్టుకుంటే సరిపోతుంది.  దీనికి ఇంతగా పరితపించనేల? నాటకాన్ని నాటకంగానే స్వీకరిద్దాం అని అంటున్నారు అన్నమాచార్యుల వారు.  ఉభయ కర్మములు అనగా మంచి, చెడు.  ఈ ఉభయ కర్మలు కూడా సమూలంగా నశించాలి! చెడు ఒక బంధం. మంచి కూడా మరొక బంధమే. ఈ రెండూ నశించినప్పుడే కైవల్యం.


పుణ్యం అన్నది తీరేది కాదు. పాపం కూడా తీరేది కాదు. కనుక ఈ రెండింటి నుండి బయటికి రావాలి అనగా పుణ్య భావన నుండి, పాప భావన నుండి బయటికి రావాలి. నువ్వు శరీరమే కాదు, ఆత్మ పదార్థం అని తెలుసుకుంటే రెండింటి నుంచి బయటికి రావచ్చు అని శ్రీ తాళ్ళపాక వారు సెలవిస్తున్నారు.  'ఎగువ' అంటే ఆరు చక్రాల పైన ... సహస్రారంలో అన్నమాట. సహస్రార స్థితిలో ఉన్నవారినే యోగీశ్వరులు అని పిలుస్తారు. వారు మాత్రమే కైవల్య స్థితిని చేరినవారు.


నాలుగు రోజుల ఈ శరీర యాత్ర ఓ నాటకం. అయితే ఆత్మయాత్ర అన్నది మటుకు శాశ్వతమైనది. అది మూణ్ణాళ్ళ ముచ్చట కాదు!  అది శాశ్వతమైన లీలా యాత్ర!  శరీరగతమైన ఈ మూణ్ణాళ్ళ ముచ్చటను ససేమిరా దు:ఖభరితం చేసుకోకుండా, ముచ్చటగా జీవించాలి! అందుకు నాటకాన్ని విధిగా నాటకంగానే స్వీకరించాలి!!

🕉️🌞🌏🌙🌟🚩

No comments:

Post a Comment