స్థితప్రజ్ఞత
యదా సంహరతే చాయం కూర్మోஉఙ్గానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||
భగవద్గీతలో ఇది ఒక అద్భుతమైన శ్లోకం.
ఇందులో చక్కటి ఉపమా నాన్ని వ్యాసులవారు మనకు అందించారు.
కూర్మము అంటే తాబేలు. ఇది మెల్లమెల్లగా నడుస్తుంది. ఇది ఎవరినీ ఏమీ చేయలేదు. నిరపాయమైన ప్రాణి.
తనను రక్షించుకోవడానికి ఇతర జంతువులలాగా, కొమ్ములు, కోరలు, గోళ్లు ఇవ్వలేదు పరమాత్మ. చిన్న తలకాయ. దీని నోటిలో పళ్లు కూడా ఉండవు. కాళ్లు చిన్నచిన్నవే. త్వరగా పరుగెత్తలేదు. అయితే, దానిపైన ఒక గట్టి డిప్పనొకదానిని ఏర్పరిచాడు పరమాత్మ.
అందుకనే, తనకు ఏదైనా అపాయం జరుగబోతుందని తెలియగానే, త్వరగా పరుగెత్తలేదు కాబట్టి, ఉన్న చోటనే తన చిన్న తలకాయను, నాలుగు చిన్న కాళ్లను (పంచ అంగాలను) డిప్పలోకి పోనిచ్చు కుంటుంది. ఇక దానిని ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఒక రాయిలాగా అయిపోతుంది.
ఈ ఉపమానం జ్ఞానికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకనగా, ప్రాపంచిక విషయాలకు మనలోని పంచేంద్రియాలు అతిగా స్పందిస్తాయి. అలా నిరంతరం స్పందిస్తుంటే, ఎవరైనా వాటి ప్రభావానికి లోబడతాడు.
జ్ఞాని అనేవాడు ప్రాపంచిక విష యాలకు దూరంగా ఉండాలి. వాటికి ఎలాంటి సమయాలలో కూడా జ్ఞాని లొంగకూడదు. లొంగిపోతే ఆశించిన ఉన్నత స్థితి పొందే అవకాశం ఉండదు. అలా పంచేంద్రియాలను నియంత్రించడాన్ని, ఇంద్రియ నిగ్రహమని, దీనినే దమమని అంటారు.
తాబేలు ఐదు అంగాలను నియంత్రించుకుంటుంది. జ్ఞాని కూడా పంచేంద్రియాలను నియంత్రించుకుంటాడు.
ఎప్పుడైతే ఇంద్రియాలను నియంత్రించగలుగుతాడో, ఇక మనసును నియంత్రిండం జ్ఞానికి సులభమవుతుంది.
స్వామి చిన్మయానందగారి ఉపన్యాసాలలోని ఉపమానాలు మన అనుభవానికి చాలా దగ్గరగా ఉంటాయి.
మన శరీరం తలుపులు లేని ఒక పబ్లిక్ టాయిలెట్ లాంటిదని అంటారు ఆయన.
ప్రతివాడు వచ్చి, తన పని కానిచ్చుకుని పోతాడు కానీ, దాని శుభ్రత గుఱించి ఆలోచించడు. అందులో వాసనలు అలాగే ఉంటాయి. అందుకనే, దానికి తలుపులు వేసి చూసుకుంటుంటే, కొంత మేలుగా ఉంటుంది.
అలాగే, మన శరీరమనే ఇంట్లోకి ప్రపంచంలో ఉన్న శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు యథేచ్ఛగా లోపలికి రాకుండా ఇంద్రియ నిగ్రహములనబడే తలుపులను అమర్చుకోని జాగ్రత్త పడా లంటారు ఆయన.
ఎలా, కూర్మము తన ఐదు అంగాలను డిప్పలోకి లాక్కుంటుందో, అదే ప్రకారంగా జ్ఞాని బయట ప్రపంచంలోని శబ్దాది ప్రభావాలనుండి తన ఐదు జ్ఞానేంద్రియాలను ప్రాపంచిక విషయాల నుండి వెనక్కిలాక్కోవాలి. అటువంటి వాడి ప్రజ్ఞ ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది.
No comments:
Post a Comment