Thursday, April 27, 2023

మనిషి ఎప్పుడూ ఏదో వాగుతూ ఉండటాన్ని ‘వాచాలత’ అంటారు.

 🌿🌹🌷🌹🌿
మనిషి ఎప్పుడూ ఏదో వాగుతూ ఉండటాన్ని ‘వాచాలత’ అంటారు.

మాట్లాడటానికీ కొన్ని హద్దులుంటాయి. హద్దులు దాటకుండా మాట్లాడేవారు గొప్పవారు. హద్దులు మీరి విచ్చలవిడిగా మాట్లాడేవారు అల్పులు. 
మాటలో ఏముందని ప్రశ్నించుకుంటే మాటలోనే అంతా ఉంది అనే సమాధానం వస్తుంది. మాటలు శ్రుతిమించితే అనర్థాలకు దారితీస్తాయి. మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మాట పదునైన ఆయుధం. అది దుర్వినియోగం అయితే బాణంలా ఎదుటివారి హృదయాలను చీల్చివేస్తుంది. మాటతో ఎదుటివారిని బతికించవచ్చు. చంపనూవచ్చు.
మాట విషయంలో సంయమనం ఎంతో అవసరం. లేకుంటే మనిషికి గౌరవం లభించదు. 

లోకంలో తప్పులు చేయనివారు ఎవరూ ఉండరు. ఎదుటివారిలో తప్పులు కనబడినప్పుడు మర్యాదగా వాటిని ప్రస్తావించాలి. మనసు నొచ్చుకోకుండా చెప్పాలి. 

మాటలు శ్రుతిమించినప్పుడు వాటిని అదుపులో పెట్టేది మౌనం. మౌనం వల్ల కలహాలు దూరమవుతాయని నీతి కోవిదులు చెబుతారు. అతిగా మాట్లాడటం వల్ల మనిషిలో ప్రాణశక్తి తగ్గిపోతుంది. మౌనం వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది. అందుకే పూర్వకాలంలో తపస్యులు మౌనాన్ని పాటించేవారు.
అతిగా మాట్లాడేవారిలో అనుకోకుండానే కొన్ని దుర్గుణాలు వచ్చి చేరతాయి. 

ఎదుటివారి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడటం, ఎవరూ కోరకుండానే ఉచిత సలహాలు ఇవ్వడం కనిపిస్తుంది. ఇది మాట్లాడే వ్యక్తికి మంచిది కాదు. దీనివల్ల అతడిపై చులకన భావం ఏర్పడుతుంది. విరోధం పెరుగుతుంది.

బ్రహ్మదేవుడు కేవలం మానవులకే మాట్లాడగల శక్తిని ప్రసాదించాడు. మానవుల్లా జంతువులు, పక్షులు మాట్లాడలేవు. ఈ కారణంగా మనిషి గొప్ప అదృష్టవంతుడే. ఇతర జీవజాలానికి లేని అరుదైన ఈ వరాన్ని పొందిన మనిషి వాక్‌శక్తిని ప్రాణశక్తిలా భావించి, పొదుపుగా వాడుకోవాలి. 

*‘అతి సర్వత్ర వర్జయేత్‌’* అన్నారు ప్రాచీనులు. అన్ని విషయాల్లో ‘అతి’గా ప్రవర్తించడం మానేయాలని దీని అర్థం.

మాట విలువ తెలిసిన వక్తలు ఏది అవసరమో దాన్నే చెబుతారు. మాట విలువ తెలియనివారు పనికిరానిదంతా వాగుతుంటారు. లోకంలో అందరూ మాట్లాడతారు కానీ కొందరే మధుర భాషణులుగా మిగిలిపోతారు. మధురంగా మాట్లాడేవారి మాటలను మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. నిస్సారంగా మాట్లాడేవారిని చూస్తే తప్పించుకొని పారిపోవాలని అనిపిస్తుంది. మంచికీ చెడుకూ ఉండే తేడా ఇదే.

మిత భాషణం అమితానందదాయకం. లోకంలో అపార కీర్తిని గడించిన మహనీయులందరూ మిత భాషులే. 

కాకి అరుపులు వినడానికి కర్ణకఠోరంగా ఉంటాయి. అవసరం ఉన్నా, లేకున్నా కాకులు అరుస్తూనే ఉంటాయి. కానీ, కోకిలలు వసంతకాలం వచ్చినప్పుడే కమ్మగా కూస్తాయి. కోకిల కూతలు వినాలని అందరూ ఇష్టపడతారు. కాకి అరుపులను ఎవరూ వినడానికి ఇష్టపడరు. కనుక మనిషి వాచాలతను తగ్గించుకొని మితభాషి, హితభాషి కావాలి. 

No comments:

Post a Comment